అంతర్మథనంలో పోలీసు అధికారులు
దిశ దశ, హైదరాబాద్:
శాంతి భద్రతల పరిరక్షణలో కీలక భూమిక పోషించే పోలీసు అధికారుల్లో అంతర్మథనం మొదలైంది. మార్పుతో మారిపోతుందేమోనని ఆశించినప్పటికీ లాభం లేకుండా పోయిందన్న నిర్ణయానికి వచ్చేసే పరిస్థితి తయారైంది. ఇటీవల భారీగా డీఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, సీఐల పోస్టింగుల ఉత్తర్వుల నేపథ్యంలో సీనియర్ పోలీసు అధికారులు పడుతున్న వేదన ఇది. పది నుండి పదిహేనేళ్లుగా లూప్ లైన్ విభాగాల్లో మగ్గిపోతున్న తమకిక పోస్టింగులు దక్కడం అసాధ్యమని, శాంతి భద్రతల విభాగంలో పనిచేసే భాగ్యం దక్కే అవకాశమే లేదన్నట్టుగా మారిపోయిందని కలత చెందుతున్నారు. కుల బలం, పలుకుబడి ఉన్న వారు మాత్రమే ఇక లా అండ్ ఆర్డర్ లో విధులు నిర్వర్తిస్తారు తప్ప లూప్ లైన్ లో పనిచేస్తున్న తమలాంటి వారికి అలాంటి అదృష్టం దొరకడం గగనమే అన్న భావనకు వచ్చేసారు చాలామంది పోలీసు అధికారులు.
ఎమ్మెల్యే లెటర్…
పోలీసు విభాగంలో పోస్టింగ్ రావాలంటే ఎమ్మెల్యే లేఖ రాదని తేలిపోయిందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో తమ లాంటి వారు ఎమ్మెల్యేలను ప్రాపకం చేసుకోవడం కూడా కష్టమేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ పోస్టింగ్ చేస్తూ తెరమీద కనిపిస్తున్న అధికారులే ప్రజాప్రతినిధుల దృష్టిలో ఉంటున్నారని దీంతో తమలాంటి సామాన్యులు శాంతి భద్రతల విభాగంలో పోస్టింగ్ పొందడమనేది అసామన్యమైన విషయంగా మారిపోయిందన్న వేదన సీనియర్ పోలీసు అధికారుల్లో వ్యక్తం అవుతోంది.
కౌన్సిలింగ్ విధానం…
పోలీసు అధికారుల బదిలీ విషయంలో కనీసం కౌన్సిలింగ్ విధానం అమలు చేసినా సమన్యాయం అందినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. క్యాడర్ వారిగా పోలీసు విభాగంలో పనిచేస్తున్న అధికారులు నిర్వర్తించే డ్యూటీలకు సంబంధించిన అంశాల్లో పనితీరు ప్రామాణికంగా మెరిట్ వేయడం, పని చేసిన ప్రాంతాలను, లూప్ లైన్ విభాగాల్లో పనిచేసిన సమయాన్ని, కేసుల దర్యాప్తు, శిక్షలు పడేందుకు తీసుకున్న చొరవ, నేరాల నియంత్రణ, పరిశోధన తదితర అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకుని కౌన్సిలింగ్ విధానం అమలు చేసినా బదిలీల్లో పారదర్శకత పాటించినట్టు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసు విభాగంలో ఈ విధానం కానిస్టేబుల్ నుండి ఏఎస్ఐ వరకు మాత్రమే అమలవుతున్నందున ఆపై స్థాయి అధికారుల విషయంలో కౌన్సిలింగ్ ప్రక్రియను కొనసాగిస్తే అన్నివిధాలుగా భావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
రిటైర్ అయ్యేవరకూ…
లూప్ లైన్ లో మగ్గిపోతున్న పోలీసు అధికారులు తాము రిటైర్ అయ్యేవరకూ కూడా అక్కడే ఉండిపోవల్సిందే తప్ప ఒక్కసారైనా శాంతి భద్రతల విభాగంలో డ్యూటీ చేస్తామా అన్న అంతర్మథనంలో కొట్టుమిట్టాడుతున్నారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో రికమండేషన్ పోస్టింగు విధానం కొనసాగుతుండడంతో 75 శాతం మంది పోలీసు అధికారులు లా అండ్ ఆర్డర్ వైపు కన్నెత్తి చూసే పరిస్థితికి కూడా నోచుకోలేకపోయారంటే రాష్ట్రంలో పోలీసు వ్యవస్థలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది పోలీసు అధికారులు అయితే పదోన్నతి పోందిన తరువాత కనీసం రెండేళ్లు కూడా శాంతి భద్రతల విభాగంలో పనిచేయలేదంటే రాష్ట్ర పోలీసు అధికారుల బదిలీల్లో కొనసాగుతున్న విధానం ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇతర రాష్ట్రాలు…
ఇకపోతే పోలీసు అధికారుల పోస్టింగ్ విషయంలో ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న విధానాలపై సమగ్రంగా అధ్యయనం చేసి సముచితమైన విధానం అమలు చేస్తే బావుంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దీని వల్ల లా అండ్ ఆర్డర్, లూప్ లైన్ విభాగాల్లో ప్రతి అధికారి పనిచేసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రమోషన్ పొందే ముందు ఖచ్చితంగా లూప్ లైన్ విభాగంలో పనిచేయాలన్న నిబంధనను ఖచ్చితంగా అమలు చేసినా ఇలాంటి పరిస్థితులు ఎదురు కావని అంటున్న వారూ లేకపోలేదు.
నైరాశ్యంలో వారు…
సాంకేతిక విద్యతో పాటు వివిధ కోర్సుల్లో పట్టభద్రులైన యువత క్రేజీతో పోలీసు విభాగంలో చేరి తలల పంటుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఉన్నత చదువులు చదివినా ప్రభుత్వ ఉద్యోగం ధీమానిస్తుందన్న ఆశతో పోలీసు విభాగంలో చేరిన కొత్తతరం యువత నిరాశ నిసృహలకు గురవుతోంది. శిక్షణ సమయంలో ఏదో సాధించాలని ఆశించినప్పటికీ జిల్లాలకు అలాట్ అయిన తరువాత చాలా మంది నీరుగారిపోతున్నారు. శిక్షణలో చెప్పే అంశాలకు, విధుల్లో చేరిన తరువాత ఎదురవుతున్న అనుభవాలకు ఏ మాత్రం పోలిక లేకుండా పోతోందన్న ఆవేదన కూడా కొత్తతరం పోలీసు అధికారుల్లో బలంగా నాటుకపోతోంది. దీంతో కొంతమంది ఇతర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ పోలీసు విభాగం నుండి బయటపడాలని తాపత్రయపడుతున్నారు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ కు కూడా కొత్తతరం పోలీసు అధికారులు ప్రిపేర్ అవుతున్నారు. పోస్టింగుల విషయంలో పారదర్శకత పాటించకపోవడం, పొలిటికల్ పోస్టింగులకే ప్రాధాన్యత ఇచ్చే ఆనవాయితీ కొనసాగించడం ఇలాగే కొనసాగితే రానున్న కాలంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పోలీసు విభాగంలో ఉద్యోగాల కోసం ఎవరూ ముందుకు వచ్చే అవకాశం కూడా ఉండదు. దీనివల్ల పోలీసు విభాగం మిగతా యూనిఫారం విభాగాల వలే నామమాత్ర సేవలతోనే సరిపెట్టుకోవల్సిన దుస్థితికి చేరే ప్రమాదం కూడా ఉంటుంది.`