Godavari: గోదావరి ప్రాజెక్టులకు జలకళ…

ఎస్సారెస్పీ నుండి ఎల్లంపల్లి వరకు ఇలా…

దిశ దశ, గోదావరి:

సమృద్దిగా వర్షాలు కురియకపోవడంతో తెలంగాణాలోని గోదావరి నది నిన్న మొన్నటి వరకు నీరు లేక బోసిపోయింది. భారీ వర్షాలు పడినట్టే పడి మొఖం చాటేయడంతో ప్రాజెక్టులు కూడా నీరు లేక వెలవెలబోయాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల పుణ్యమా అని గోదావరి నదిలో వరద ఉధృతి తీవ్రంగా పెరిగింది. బాల్కొండ సమీపంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, నిర్మల్ సమీపంలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుల్లో భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాజెక్టులు కూడా జల కళ సంతరించుకోనున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 1091 అడుగుల ఎఫ్ఆర్ఎల్ లెవల్ కాగా శనివారం సాయంత్రం 6 గంటల వరకు 1083 అడుగులకు చేరుకుందతి. 80.5 టీఎంసీలకు కాను 54. 628 టీఎంసీల మేర నీరు ఎస్సారెస్పీలోకి చేరింది. ప్రస్తుతం 104879 క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లోగా వస్తుండగా ఔట్ ఫ్లో మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతం నుండి వరద నీరు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్టయితే ఈ ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తే అవకాశాలు లేకపోలేదు. మరోవైపున నిర్మల్ జిల్లా కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టుకు కూడా వరద నీరు పెద్ద ఎత్తున వస్తోంది. 4.699 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఉన్న కడెం ప్రాజెక్టులో ప్రస్తుతం 3.257 టీఎంసీల నీరు నిలువ ఉండగా, 2 లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు ఇన్ ప్లోగా వస్తుండడంతో అధికారులు శనివారం సాయంత్రం ప్రాజెక్టులోని 18 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి 214730 క్యూసెక్కుల నీటిని వదిలారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సమీపంలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 20.175 టీఎంసీల సామర్ధ్యం కాగా 17 టీఎంసీలకు పైగా నీరు వచ్చి చేరింది. తాజాగా ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టుతో పాటు క్యాచ్ మెంట్ ఏరియా నుండి కూడా వరద నీరు ఎల్లంపల్లికి వస్తోంది. నంది పంప్ హౌజ్ కు 12 వేల క్యూసెక్కుల నీటిని వదలగా, దిగువ ప్రాంతానికి 80 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. గంట గంటకు శ్రీపాద ఎల్లంపల్లి వరద నీటి ప్రవాహం తీవ్రమవుతుండడంతో ఎప్పటికప్పుడు అధికారులు అంచనాలు వేస్తూ నీటిని వదిలేందుకు సత్వర ఆదేశాలు ఇస్తున్నారు. వరద ఇలాగే కొనసాగించినట్టయితే గత మూడు నాలుగు రోజులుగా నంది పంప్ హౌజ్ ద్వారా ఎగువ ప్రాంతానికి మరిన్ని నీళ్లను పంపింగ్ చేసే అవకాశం ఉంది. నందిమేడారంలోని నంది పంప్ హౌజ్ నుండి కరీంనగర్ జిల్లా లక్ష్మీపూర్ అండర్ టన్నెల్ కు, అక్కడి నుండి మిడ్ మానేరు, లోయర్ మానేరు ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారు. అయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చినట్టయితే అక్కడి నుండి కూడా దిగువ ప్రాంతానికి నీటిని వదిలే అవకాశం కూడా లేకపోలేదు. వాతావరణ శాఖ వర్షాలు మరో రెండు మూడు రోజుల వరకు పడే అవకాశాలు ఉన్నాయని అలెర్ట్ చేసింది. దీంతో ఈ సారి గోదావరి, మానేరు నదులపై ఉన్న ప్రాజెక్టులన్ని కూడా నిండిపోనున్నాయి.

కాళేశ్వరం పరిస్థితి…

ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నుండి నీరు యథావిధిగా దిగువకు వెలుతూనే ఉంది. సుందిళ్ల బ్యారేజీకి వచ్చి చేరుతున్న 6142 క్యూసెక్కుల నీరంతా కూడా అన్నారం బ్యారేజీకి వచ్చి చేరుతోంది. అయితే ఎల్లంపల్లి గేట్లు ఎత్తిన నేపథ్యంలో దిగువకు చేరే వరద నీరు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి 80 వేల క్యూసెక్కుల నీటిని ఎల్లంపల్లి అధికారులు దిగువకు వదిలామని ప్రకటించారు. కాళేశ్వరానికి దిగువన ఉన్న మేడిగడ్డ వద్ద మాత్రం నీటి ఉధృతి తీవ్రరూపంలోనే కొనసాగుతోంది. గోదావరి నుండి అంతగా వరద నీరు రాకున్నప్పటికీ మహారాష్ట్రలోని ప్రాణహిత నుండి భారీ స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. దీంతో కాళేశ్వరం వద్ద క్రమక్రమంగా గోదావరి నది నీటిమట్టం పెరుగుతోందని అధికారులు చెప్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ ప్రాంతం నుండి వస్తున్న 3,73,500 క్యూసెక్కుల వరద నీటిని యథావిధిగా అధికారులు దిగువకు వదులుతున్నారు.