బిల్లు రికార్డ్ చేసేందుకు లంచం… ట్రాప్ చేసిన ఏసీబీ…

దిశ దశ, హుజురాబాద్:

పూర్తయిన పనికి బిల్లు రికార్డు చేయాలంటే లంచం ఇవ్వాలని అడిగిన ఓ ఇంజనీర్ ఏసీబీకి రెడ్ హైండెడ్ గా పట్టుబడ్డాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ట్రాప్ అయ్యాడు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం… హుజురాబాద్ పట్టణంలో మునిసిపల్ నిధులతో డ్రైనేజీ నిర్మాణం జరిగింది. ఈ పని చేసిన కాంట్రాక్టర్ ఫైనల్ బిల్లు చేసేందుకు, ఎంబీ రికార్డు చేయాలని మునిసిపల్ ఏఈ సుధాకర్ రెడ్డిని అభ్యర్థించాడు. అయితే రూ. 50 వేలు లంచం ఇస్తేనే బిల్లు సిద్దం చేస్తానని తేల్చి చెప్పాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో బుధవారం స్థానిక ఆర్టీసీ డిపో క్రాసింగ్ వద్ద  రూ. 50 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. ఏఈ సుధాకర్ రెడ్డిని కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పర్చనున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

మొదటి పోస్టింగ్…

బుధవారం ఏసీబీ అధికారులకు చిక్కిన హుజురాబాద్ మునిసిపల్ ఏఈ సుధాకర్ రెడ్డి ఫస్ట్ పోస్టింగులోనే ఏసీబీకి చిక్కడం గమనార్హం. గ్రూప్స్ ద్వారా ఉద్యోగం సంపాదించిన సుధాకర్ రెడ్డి కరప్షన్ లో దూకుడు ప్రదర్శించారు. ఇంకా ఆయన ప్రొబేషనరీ కూడా పూర్తి కానట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. మొదటి పోస్టింగ్ లోనే అవినీతికి అర్రులు చాచి జైలు పాలైన సదరు ఏఈకి ఇంకా వివాహం కూడా కానట్టుగా తెలుస్తోంది.