దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కార్పోరేషన్ లో ఏక ఛత్రాధిపత్యం నడుస్తోందా..? శాశ్వత ఉద్యోగి కాకున్నప్పటికీ సంబంధం లేని బాధ్యతలు అప్పగించడానికి కారణమేంటీ..? దశాబ్ద కాలంగా పాతుకపో్యిన ఆ ఎంప్లాయి చెప్పుచేతల్లోనే కొనసాగుతున్న తీరు దేనికి సంకేతం..? బల్దియాలో సాగుతున్న ఈ తతంగంపై జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.
సంబంధం లేని బాధ్యతల్లో…
సదరు ఉద్యోగిని అపాయింట్ చేసుకున్న పనితో సంబంధం లేకుండా ఇరతాత్ర బాధ్యతల్లో ఉపయోగించుకుంటున్న తీరు విస్మయానికి గురి చేస్తోంది. వాహనాల వ్యవహారాలను చక్కబెట్టే పనులు కూడా ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయని తెలుస్తోంది. సుదీర్ఘ కాలంగా ఇక్కడే పని చేస్తున్న ఆయన చెప్పిందే వేదం అన్నట్టుగా నడుస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓ ఉన్నతాధికారిని మచ్చిక చేసుకున్న సదరు తాత్కాలిక ఉద్యోగి ఇక్కడకు బదిలీపై వచ్చిన వారిని విధుల్లో చేరకుండా ఉండే విధంగా చక్రం తిప్పుతున్నారన్న చర్చ కూడా బల్దియాలో సాగుతోంది. కార్పోరేషన్ లో అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ లు ఉన్నా ఆ తాత్కాలిక ఉద్యోగి చేతికే ఓ విభాగం పగ్గాలు అప్పచెప్పడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటో అంతుచిక్కకుండా పోతోంది.
అదెలా సాధ్యం…
సాధారణంగా తాత్కాలిక ఉద్యోగులకు కీలకమైన బాధ్యతలు అప్పగించే విషయంలో అధికారులు ఆచూతూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికపరమైన అంశాలతో పాటు అత్యంత ప్రాధాన్యత అంశాల విషయంలో రెగ్యూలర్ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించేందుకు మొగ్గు చూపుతుంటారు. అయితే కరీంనగర్ కార్పోరేషన్ మాత్రం ఆ ఉద్యోగికి సంబంధం లేని బాధ్యతలను అప్పగించడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోంది. ఒక వేళ ఆయనకు అప్పగించిన బాధ్యతల విషయంలో నిబంధనల మేరకే నడుచుకున్నమన్న వాదనలు తెరపైకి తీసుకొస్తే ఇందుకు సంబంధించిన అన్ని వ్యవహారాలను చక్కదిద్దేందుకు సదరు ఉద్యోగి ఎందుకు చొరవ తీసుకోవడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది.