Phone Tapping: ఉనికి లేని చోట ఉద్యమ సానుభూతి పరులు..!

ట్యాపింగులో 4 వేలకు పైగా ఫోన్లు

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు దాదాపుగా అంతరించి పోయాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు నామమాత్రంగానే ఉన్నాయి. కేవలం పొరుగు రాష్ట్రాల సరిహద్దు జిల్లాల్లో మాత్రమే కట్టడి చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంటుంది. కొమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు మహారాష్ట్ర, చత్తీస్ గడ్ సరిహద్దులను ఆనుకుని ఉంటాయని దశాబ్ద కాలానికి పైగా రాష్ట్ర హోంశాఖ కేంద్ర హోంశాఖకు పంపిస్తున్న నివేదికలో పేర్కొంటోంది. అడపాదడపా మావోయిస్టులు రాష్ట్రంలోకి చొచ్చుకుని వచ్చే అవకాశాలు ఉన్నందున సరిహధ్దు ప్రాంతాల్లో కట్టడి చర్యలు తీసుకోవల్సి ఉంటుందని, ఆయా జిల్లాలను మాత్రమే ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించాల్సి ఉంటుందని ఆ నివేదికలో తెలంగాణ ప్రభుత్వం పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే పోలీసు అధికారులు కూడా మావోయిస్టుల ఉనికి రాష్ట్రంలో ఎక్కడ లేదని పలు మార్లు ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ట్యాపింగ్ విషయంలో…

అయితే మావోయిస్టు పార్టీ ఉనికి నామ మాత్రంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీకి సహకరించే వారు ఉన్నారని స్పెషల్ ఇంటలీజెన్స్ బ్యూరో (SIB) గుర్తించడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ మేరకు రివ్యూ కమిటీకి కవరింగ్ లెటర్ తో పాటు నిఘా వేయాల్సిన కాంటాక్టు నంబర్ల జాబితాను పంపించినట్టుగా ఇప్పటి వరకు అధికారులు ఇచ్చిన వాంగ్మూలాలను బట్టి స్పష్టం అవుతోంది. సాధారణ, ఉప ఎన్నికల సమయంలో మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్న వారి జాబితాను తయారు చేసిన SIB రివ్యూ కమిటీకి ప్రతిపాదనలు పంపించినట్టుగా వెలుగులోకి వచ్చింది. SIB చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు ద్వారా రివ్యూ కమిటీకి చేరిన ఈ నివేదికలకు ఆమోద ముద్ర వేయడంతో చీఫ్ సెక్రటరీ కూడా క్లియరెన్స్ ఇచ్చి ఉంటారని సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం. సరిహద్దుల్లో ఉన్న ఆరు జిల్లాలు మాత్రమే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బారీ సంఖ్యలో మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్న వారు ఎలా పుట్టుకొచ్చారన్నదే మిస్టరీగా మారింది. ఫోన్ ట్యాపింగ్ కోసం కావాలనే మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్న వారి జాబితా తయారు చేశారా లేక నిజంగానే నక్సల్స్ తో వారంతా మిలాఖత్ అయ్యారా అన్న విషయంపై స్పష్టత రావల్సిన అవసరం ఉంది. సాంకేతికత అందుబాటులోకి రావడంతో పాటు కీలక నాయకత్వం తెలంగాణలో ప్రభావితం చేసే పరస్థితి లేకుండా పోయిన ఆ సమయంలో నక్సల్స్ కు సహకరించేందుకు అంతమంది సాహసిస్తారా లేదా అన్న అనుమానం రాకపోవడానికి కారణం ఏంటన్నది కూడా అంతు చిక్కకుండా పోతోంది. మావోయిస్టులకు సహకరించే వారి జాబితాను ఎలా తయారు చేశారు..? వారు అప్పటి వరకు నక్సల్స్ నేతలతో టచ్ లో ఉన్నట్టుగా ఏమైనా ఆధారాలు లభించాయా లేదా అన్న విషయంపై కూడా సిట్ దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

SIB ఏం చేసింది…?

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, చత్తీస్ గడ్ సరిహద్దుల్లో ఉన్న ఆరు జిల్లాలో పోలీసు అధికారుల పోస్లింగుల విషయంలో SIB ఆమోద ముద్ర వేయాల్సిన అవరసం కూడా ఉంటుందని తెలుస్తోంది. పొలిటికల్ పోస్టింగులకు ప్రాధాన్యత ఇవ్వకుండా మావోయిస్టు ఏరివేత, కట్టడి చర్యల్లో క్రియా శీలకంగా పనిచేయడం, యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్లకు మాత్రమే SIB క్లియరెన్స్ ఇచ్చే సాంప్రాదాయం కూడా కొనసాగింది. ఈ క్రమంలో సరిహద్దు ప్రాంతాల్లోకి బదిలీ చేయించుకోవాలంటే నక్సల్స్ కార్యకలపాలపై అవగాహన ఉన్న వారికే ప్రాధాన్యత ఇచ్చిన SIB రాష్ట్రంలో నక్సల్స్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయన్న విషయంపై తీవ్రంగా ఎందుకు పరిగణించలేకపోయిందోనన్నది కూడా మిస్టరీగా మారింది. SIB రికమండేషన్ ద్వారా మాత్రమే సరిహధ్దు ప్రాంతాల్లో పోస్టింగులు ఇచ్చే ఆనవాయితీని కొనసాగించినప్పుడు, రాష్ట్రంలో మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్న వారిని వేలల్లో గుర్తించి ఫోన్ ట్యాపింగుకు పాల్పడ్డారు. ఈ లెక్కన సరిహద్దు ప్రాంతాల్లో SIB ప్రతిపాదించిన అధికారులు కూడా వైఫల్యం చెందినట్టా లేక వారితో సంబంధం లేకుండానే జాబితా తయారు అయిందా అన్నది తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు నిజంగానే విస్తృతం అయినట్టయితే స్పెషల్ ఇంటలీ జెన్స్ బ్యూరో క్లియరెన్స్ ఇచ్చిన అధికారులు నక్సల్స్ ను కట్టడి చేయడంలో విఫలం అయినట్టే కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన బార్డర్ ఏరియాలో పోలీసు అధికారుల పోస్టింగ్ విషయంలో SIB కూడా విఫలం అయినట్టే కదా అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో నక్సల్స్ ఏర్పాటు చేసిన బూబీ ట్రాప్స్ గుర్తించడం, కర్రె గుట్టల్లో షెల్టర్ తీసుకుంటున్న తెలంగాణ కమిటీలో ఉన్న వారిని ఏరివేయడంలో ములుగు, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాల పోలీసు అధికారులు పలుమార్లు సఫలం అయ్యారు. అన్నె సాగర్, భద్రూ, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు మధుతో పాటు పలువురిని ఎన్ కౌంటర్లు చేయడం, సరిహద్దు ప్రాంతాల్లో పేల్చివేతల కోసం ఏర్పాటు చేసిన మందు పాతరలను నిర్వీర్యం చేయడంలో కూడా ఆయా జిల్లాల పోలీసు అధికారులు సక్సెస్ అయిన సందర్భాలూ ఉన్నాయి. మావోయిస్టు పార్టీ కూడా సరిహధ్దుల్లో షెల్టర్ జోన్లను ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలకు ఆదిలోనే చెక్ పడుతుండడంతో ఇప్పుడున్న పరిస్థితుల్లలో స్వీయ రక్షణ చర్యలకే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇందులో బాగంగానే తెలంగాణ కమిటీకి దండకారణ్యంలో కెటాయించిన షెల్టర్ల జోన్లకే పరిమిత కావాలని నిర్ణయించుకున్న విషయం అందరికీ తెలిసిందే. మావోయిస్టులను కట్టడి చేయడంలో సఫలం అవుతున్నామని సరిహద్దు జిల్లాల పోలీసు అదికారులు కూడా పలు మార్లు ప్రకటనలు చేసిన సంగతి విధితమే. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాలకు వలస వచ్చిన గొత్తి కోయల అవాసాలపై కూడా పోలీసులు గట్టి నిఘా వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న ముసుగు వేసి రాజకీయ నాయకులతో పాటు వివిధ వర్గాలకు చెందిన 4 వేలకు పైగా ఫోన్లు ట్యాప్ చేయడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్న చర్చ సాగుతోంది. ఇందులో 618 మంది రాజకీయ నాయకులు కూడా ఉన్నారని సిట్ గుర్తించడం గమనార్హం. సరిహద్దు ప్రాంతాల పోలీసులు మావోయిస్టు పార్టీని కట్టడి చేయడంలో పలు మార్లు సక్సెస్ అయినందున మావోయిస్టు పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 4 వేల మందిని తమకు అనుకూలంగా మల్చుకోవడంలో సానుకూలత సాధించే అవకాశం ఉంటుందా లేదా అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అసలు ఉనికే లేకుండా పోయిన తెలంగాణాలో మావోయిస్టు పార్టీకి వేలాది మంది సహకరించే అవకాశం ఉంటుందా..? లేక కావాలనే వారిని ఆ జాబితాలో చేర్చారా అన్న విషయంపై స్పష్టత రావల్సిన అవసరం కూడా ఉంది. ఒకవేళ మావోయిస్టు పార్టీకి వేలాది మంది సహకరించినట్టుగా SIB గుర్తించినట్టయితే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలకు, ట్యాపింగ్ చేసిన తీరుకు పొంతన లేకుండా పోవడం విస్మయం కల్గిస్తోంది. వేల సంఖ్యలో మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారన్న విషయాన్ని గమనించి రాష్ట్రంలో నక్సల్స్ కార్యకలాపాలు పెద్ద ఎత్తున మొదలయ్యాయన్న నివేదిక ఇచ్చారా, రాష్ట్రం మొత్తాన్ని కూడా ప్రభావిత ప్రాంతంగా గుర్తించాలని కోరుతూ ప్రతిపాదనలు చేశారా అన్న విషయంపై దృష్టి సారించినట్టయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఎన్నికలప్పుడేనా..?

ఇప్పటి వరకు సిట్ నోటీసులు ఇచ్చిన తీరు, వెలుగులోకి వచ్చిన విషయాలను పరిశీలించినట్టయితే ఎన్నికల సమయంలో మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్న వారి జాబితా పెద్దు ఎత్తున తయారయినట్టుగా స్పష్టం అవుతోంది. ఇతర సమాయాల్లో కూడా ఇలాంటి జాబితా తయారు చేసిన ఫోన్ ట్యాపింగుకు పాల్పడినట్టుగా గుర్తించినప్పటికీ… ఎన్నికల సమయంలో మాత్రమే ఈ అబ్జర్వేషన్ మరింత తీవ్రంగా జరిగినట్టుగా స్పష్టం అవుతోంది. 2018, 2023 ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో కూడా ట్యాపింగ్ చేసినట్టుగా తేలిపోవడం గమనార్హం. తాజాగా ఎంపీ ఈటల రాజేందర్ వాంగ్మూలం ఇచ్చిన తరువాత మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. SIB వాట్సప్ ఛాటింగ్ చేసిన వివరాలను సిట్ గుర్తించిందని తన కుటుంబ సభ్యులు, తన వద్ద పనిచేస్తున్న వారి నంబర్లు కూడా ట్యాపింగ్ చేశారని ఆయన ఆరోపించారు. ప్రభాకర్ రావు ద్వారా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్యాపింగ్ చేయించారని కూడా ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రస్తుత కేంద్ర మంత్రి, అప్పటి ఎంపీ, బండి సంజయ్ కుమార్, అతని ముఖ్య అనుచరుడు బోయినపల్లి ప్రవీణ్ రావుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టుగా గుర్తించడం విశేషం. మరో వైపున మండల, గ్రామ స్థాయి నాయకుల కాంటాక్టు నంబర్లు కూడా ట్యాప్ అయ్యాయని సిట్ నోటీసులు ఇవ్వడం కూడా సంచలనంగా మారింది. ఎన్నికల సమయంలో మాత్రం మావోయిస్టు సానుభూతి పరులు పెద్ద సంఖ్యలో పుట్టుకవచ్చారని, మిగతా సమయాల్లో ఇతరులపై నిఘా వేశారని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో భారీ కుట్రకు స్కెచ్ వేసి ఉంటారా అన్న చర్చ సాగుతోంది. అయితే ఈ విషయంలో ప్రభాకర్ రావు మాత్రమే కీలక పాత్రధారా లేక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ఆరా తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్యాపింగ్ చేయాల్సిన కాంటాక్టు నంబర్ల జాబితా తయారు చేయడంలో ముఖ్య నాయకులు కానీ, ఉన్నతాధికారులు కూడా ఉన్నారన్న అనుమనాలు కూడా జోరుగా సాగుతున్నాయి.