దిశ దశ, కరీంనగర్:
ఉత్తర తెలంగాణలో రేషన్ బియ్యం స్మగ్లర్లు వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నారు. లోడింగ్ చేసినప్పటి నుండి గమ్యం చేరే వరకూ అధికారులకు దొరకకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుని సబ్సిడీ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. బియ్యం లారీలో ఎక్కించిన తరువాత ఎక్కడికక్కడ డ్రైవర్లను మారుస్తూ అక్రమ రవాణా చేస్తున్నట్టుగా సమాచారం. లోడ్ అయిన బియ్యం లారీలను మార్గ మధ్యలో పట్టుకునేందుకు సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగుతున్నారు. దీంతో ఎప్పటికప్పుడు డ్రైవర్లను మార్చినట్టయితే బియ్యం లారీ ఏ రూట్లో వెల్తుందోనన్న విషయంపై వారికి స్పష్టత లేకుండా పోతోందన్న అంచనాతో 40 నుండి 50 కిలో మీటర్ల దూరం వెల్లిన తరువాత మరో డ్రైవర్ కు లారీ అప్పగించడం, అక్కడి నుండి 50 కిలో మీటర్ల దూరం వెల్లిన తరువాత ఇంకో డ్రైవర్ ద్వారా రవాణా చేయించే విధంగా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. లారీ ఎక్కడి నుండి బయలు దేరింది, ఎక్కడికి వెల్తుంది అన్న విషయంపై డ్రైవర్లకు క్లారీటీ ఉండదన్న అంచనాతోనే డ్రైవర్లను మార్చే విధానాన్ని అవలంభిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒక వేళ లారీని పట్టుకున్నట్టయితే అధికారులకు లారీ గురించి సమగ్ర వివరాలు తెలియదని దీంతో తమ వ్యాపార మూల కేంద్రాల ఆచూకి లభ్యం కాదని అంచనా వేసిన బియ్యం స్మగ్లర్లు ఈ ఎత్తులు వేస్తున్నట్టుగా సమాచారం. అంతే కాకుండా డ్రైవర్ల మొబైల్ నంబర్లను ట్రాక్ చేసినట్టయితే లారీ ఎటు వైపు వెల్తుంది..? ఎక్కడి వరకు చేరింది అన్న విషయాలపై నిఘా అధికారులకు క్లారిటీ లేకుండా పోతుందని కొత్త తరహా వ్యూహంతో స్మగ్లింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
రూట్ మ్యాప్…
బియ్యం లోడ్ చేసే వ్యాపారికి వాటిని దింపుకునే వ్యాపారికి మధ్య మాత్రమే లారీ ఎలా వెల్తుంది అన్న విషయంపై స్పష్టత ఉండేవిధంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. సీక్రెట్ ఆపరేషన్ ను మరిపిస్తున్నట్టుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ముఠాలు తమ దందాను దర్జాగా కొనసాగిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. లోడింగ్ పాయింట్ వద్ద నుండి లారీని తీసుకెళ్లే డ్రైవర్ ఎక్కడి వరకు వెళ్లాలోనన్న రూట్ మ్యాప్ ఇచ్చి పంపిస్తున్న స్మగ్లర్లు అక్కడకు చేరుకున్న తరువాత మరో డ్రైవర్ కు లారీ అప్పగించి వెల్లిపోవాలని చెప్తున్నారు. అక్కడి నుండి ఆ డ్రైవర్ ఎక్కడి వరకు లారీని తీసుకెళ్లాలో అందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇలా గమ్యం చేరే వరకు పలు మార్లు లారీ డ్రైవర్లను మారుస్తూ మార్చిన డ్రైవర్లను వేరే రూట్ కు డైవర్ట్ చేస్తూ దందా కొనసాగిస్తున్నట్టుగా సమాచారం. అధికారుల కళ్లుగప్పడలమే లక్ష్యంగా బియ్యం దందాగాళ్ళు వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ తమ వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. కొన్ని లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటి వెల్తుంటే మరికొన్ని లారీలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. బియ్యం అక్రమ రవాణా చేయడంలో భాగస్వాములు అవుతున్న డ్రైవర్లకు స్పెషల్ అలవెన్సులు ఇస్తూ తమ ఉనికి ఏ మాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్టుగా కూడా సమాచారం.