జగిత్యాల ఫోర్జరీ కేసు…
దిశ దశ, జగిత్యాల:
జగిత్యాల మునిసిపల్ పరిధిలోని ఇంటి అసెస్ మెంట్ కాపీ విషయంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓపెన్ ప్లేస్ కు ఇంటి నంబర్ ఉన్నట్టుగా చూపించి మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో కేవలం మునిసిపల్ కమిషనర్ సంతకం మాత్రమే ఫోర్జరీ చేయలేదని, లేని ఇంటికి పాత నంబర్ వేసి మ్యూటేషన్ చేసుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వీఎల్టీ ఎగవేత కూడా…
అయితే జగిత్యాల పట్టణంలోని సమిండ్ల మల్లయ్యకు సంబంధించిన ఇళ్లు ఉన్నప్పటికీ అది కూలిపోయిందని, దానిని ఇద్దరు అన్నదమ్ముల పేరిట మ్యూటేషన్ చేయాలంటే వెకెట్ ల్యాండ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ భూమికి సంబంధించిన డాక్యూమెంట్లు కూడా అందుబాటులో లేకపోవడంతో ఇంటి నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు పథకం రచించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఖాలీ స్థలానికి మునిసిపల్ అధికారులు కూడా ఇంటి నంబర్ ఉన్నట్టుగా సర్టిఫై చేసే అధికారం కూడా లేదని తెలుస్తోంది. మునిసిపల్ అధికారులు కూడా 2014 వరకు సమిండ్ల మల్లయ్య పేరిట ఇళ్లు ఉందని ఇందుకు సంబంధించిన పన్నులు చెల్లించారని, అయితే ఈ ఆస్తికి సంబంధించిన వివరాలు ఆన్ లైన్ కాలేదని, సాంకేతిక సమస్య కారణంగా అప్ లోడ్ కాలేదని లెటర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. దీని ఆధారంగానే ఇంటి మ్యూటేషన్ జరిగినట్టుగా తెలుస్తోంది. ఖాలీ స్థలం అని చూపించినట్టయితే ఎల్ఆర్ఎస్ చెల్లించాల్సిన అవసరం కూడా ఉంటుందని సమాచారం. ఫీల్డ్ విజిట్ చేసిన తరువాత ఆ స్థలంలో ఇళ్లు ఉన్నట్టయితే అసెస్ మెంట్ ఇవ్వవచ్చని, లేనట్టయితే ఖాలీ స్థలం ఉందని దృవీకరించాల్సి ఉంటుందని సమాచారం.
కేసు నమోదు
జగిత్యాల పట్టణంలోని హౌస్ నం. 3-5-128 కు సంబంధించిన అసెస్‌మెంట్ సర్టిఫికేట్‌ను నకిలీ (Forgery)గా తయారు చేసి, దానిపై మున్సిపల్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని మునిసిపల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. సదరు నకిలీ పత్రాన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆస్తి రిజిస్ట్రేషన్ నిమిత్తం ఉపయోగించినట్లు ఎస్ రాజేష్ పైన ఆరోపణలు రావడంతో కేసు నమోదు చేశామని జగిత్యాల టౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ఇందుకు బాధ్యులైన నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

