వైరల్ అవుతున్న లేఖ…
డికె సెక్రటరీగా మడావి హిడ్మా..?
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ నాయకత్వంలో మార్పులు చోటు చేసుకున్నాయా..? దండకారణ్యంలో స్థానికులకే బాధ్యతలు అప్పగించే వ్యవహారం తెరపైకి వచ్చిందా..? తెలుగు వారి ప్రాబల్యం తగ్గు ముఖం పట్టేందుకు ఈ మార్పులు సంకేతంగా భావించవచ్చా..? తాజాగా వైరల్ అవుతున్న ఓ లేఖ సంచలనంగా మారింది. అయితే మావోయిస్టు పార్టీ అధికారిక ప్రకటన కాకపోయినప్పటికీ లేఖను ఎవరు విడదల చేశారోనన్న విషయంపై స్పష్టత లేకున్నప్పటికీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో తెలుగు నాయకత్వం, స్థానిక నాయకత్వం మధ్య కోల్డ్ వార్ సాగుతోందన్న ప్రచారం మాత్రం విస్తృతంగా సాగుతోంది. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రింట్ చేసిన ఈ లేఖలు వైరల్ అవుతుండడం సరికొత్త చర్చకు దారి తీశాయి.
డికె కార్యదర్శి…
దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా మడావి హిడ్మా బాధ్యతలు తీసుకున్నట్టుగా ఆ లేఖలోని సారంశం. కట్ట రామచంద్రా రెడ్డి అలియాస్ రాజు దా బాధ్యతల నుండి తప్పించిన తరువాత సమర్ధుడిగా పేరున్న తక్కళ్లపల్లి వాసుదేవ రావు అలియాస్ ఆశన్నను కాదని మడావి హిడ్మాను డికె కార్యదర్శిగా నియమించారని, ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాలకు చెందిన విప్లవ నాయకత్వానికి మింగుడు పడడం లేదంటూ అందులో పేర్కొనడం గమనార్హం. సంచలనాత్మక మిలటరీ యాక్షన్ లలో గెరిల్లా పోరాటాలలో ఆశన్నకు పెట్టింది పేరని, బసవరాజ్, గణపతి, సోనూలాంటి ముఖ్య నాయకులకు సన్నిహితుడు కూడా అని అందులో పేర్కొన్నారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే శాంతి చర్చలకు ప్రతినిధిగా కేంద్ర కమిటీ పంపించిందని కూడా వివరించారు. అయితే మిలటరీ యాక్షన్లు పర్ ఫెక్ట్ గా అమలు చేయడంలో హిడ్మా కీలకంగా వ్యవహరిస్తారని, అయితే ఆయనకు దక్షిణ బస్తర్ ప్రాంతంలో మాత్రమే పని చేసిన అనుభవం మాత్రమే ఉన్నప్పటికీ డికె సెక్రటరీగా నియమించారని వివరించారు.
గార్డుల కారణంగానే..?
ఇదే లేఖలో తెలుగు నాయకత్వం ఎన్ కౌంటర్ లలో చనిపోవడానికి కారణం వారి ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన గార్డులు తమ ప్రాణాలు కాపాడుకునేందుకు పారిపోవడమేనని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారని పేర్కొనడం గమనార్హం. ఈ కారణంగానే కీలక నేతలైన బసవరాజ్, చలపతి, రేణుక వంటి వరు ఎన్ కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయారని కూడా వివరించడం సంచలనంగా మారింది. వీరి సెక్యూరిటీ వ్యవహారాలను పరిశీలించాల్సిన గార్డులంతా దండకారణ్య ప్రాంతానికి చెందిన వారు కావడమే ఇందుకు కారణమని కూడా పేర్కొనడం విస్మయం కల్గిస్తోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులను వారి వారి స్వస్థలాలకు పంపించివేస్తారని పార్టీ క్యాడర్ లో చర్చ జరుగుతోందంటూ కూడా అందులో వివరించడం విశేషం.
కార్యదర్శిగా ఎవరూ..?
తాజాగా వైరల్ అవుతున్న ఈ లేఖను బట్టి మావోయిస్టు పార్టీలో నాయకత్వ మార్పులు జరిగాయని స్పష్టం అవుతోంది. అయితే పార్టీ సుప్రీం బాధ్యతలు ఎవరికి అప్పగించారన్న విషయంపై మాత్రం అందులో పేర్కొనకపోవడం గమనార్హం. కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ ఎన్ కౌంటర్ లో చనిపోయిన తరువాత కొత్త నాయకుడిని ఇంకా ఎన్నుకోలేదన్నది వాస్తవం. పొలిట్ బ్యూరో సభ్యులు కానీ, మిలటరీ కమిషన్ సమావేశం కానీ కానట్టుగా తెలుస్తున్నది. కేంద్ర కమిటీ కార్యదర్శిగా మలోజ్జుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ దాదాకు బాధ్యతలు అప్పగించినట్టుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ పార్టీ మాత్రం అధికారికంగా ప్రకటన విడుదల చేయలేదు. దీంతో కేంద్ర కమిటీ కార్యదర్శి ఎన్నిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదనేది అందరికీ తెలిసిందే. అయితే కేంద్ర కమిటీ కార్యదర్శి ఎన్నిక ప్రక్రియను పక్కనపెట్టిన డికె ఏరియా కార్యదర్శిని నియమించే అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది.
గతంలోనూ…
గతంలో కూడా పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీకి సంబంధించి లేఖలు వెలుగులోకి వచ్చాయి. పుల్లూరి ప్రసాద రావు అలియాస్ చంద్రన్న షెల్టర్ తీసుకున్న ప్రాంతంపై రాళ్లతో దాడులు చేశారన్న ప్రచారం కూడా విస్తృతంగా సాగింది. కానీ ఈ విషయాన్ని పార్టీ వర్గాలు మాత్రం కొట్టిపారేశాయి. అంతేకాకుండా కర్రెగుట్టల సమీపంలో బంకర్ లో షెల్టర్ తీసుకున్న తెలంగాణ కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారవు ఎన్ కౌంటర్ లో మరణించారంటూ ఏకంగా పార్టీ దండకారణ్య అధికార ప్రతినిధి పేరిట ప్రకటన విడుదల అయింది. ఆ తరువాత తాను క్షేమంగా ఉన్నానని చొక్కారావు లేఖ విడుదల చేయడంతో మొదట విడుదల అయిన లేఖ నకిలీదని తేలిపోయింది. ఇప్పుడు కూడా వైరల్ అవుతున్న లేఖ ఎవరో కావాలనే విడుదల చేసి ఉంటారన్న అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దండకారణ్యంలో నాయకత్వ మార్పులపై మావోయిస్టు పార్టీ నాయకత్వం స్పందిస్తే తప్ప అసలు విషయం తెలిసే అవకాశం మాత్రం లేదు.



