రక్షణ మంత్రి అమిత్ షా…! హోం మంత్రి ఎవరూ..?

దిశ దశ, హైదరాబాద్:

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పోర్టు పోలియో మారిందా..? ఆయన రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారా..? ఇంతకీ అమిత్ షా ఏ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు..? ఇప్పుడివే ప్రశ్నలు నెటిజన్ల నుండి ఎదురవుతున్నాయి.

ఖమ్మంలో…

రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వైఖరిని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. అయితే ఇందు కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో మాత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని ముద్రించకుండా రక్షణ మంత్రి అని ముద్రించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుతో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ నిరసనలో పాల్గొన్నారు. అయితే ఈ ఫ్లెక్సీలో ఏకంగా అమిత్ షా పోర్టుపోలియోనే మార్చేశారు ఫ్లెక్సీ ముద్రించిన వారు. నిరసనలు చెప్పేందుకు ముందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంత్రి ఏ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారో కూడా తెలియదా అన్న కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సోషల్ మీడియా వేదికల్లో ఈ ఫ్లెక్సీ వైరల్ అవుతుండడంతో అమిత్ షా పోర్టుపోలియోను మార్చివేసిన విషయం వెలుగులోకి వచ్చింది. నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన పార్టీ నాయకులు ఫ్లెక్సీలో ముద్రించే విషయంపై దృష్టి సారించకపోవడం వల్లే ఈ పొరపాటు జరిగి ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అమాత్యులు నేరుగా ఆందోళన వద్దకు రాగానే నిరసన చేపట్టారని, ఆర్గనైజ్ చేసిన వారు క్రాస్ చెక్ చేసుకోకపోయి ఉండవచ్చన్న వాదనలు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి తప్పిదాన్ని ఎత్తి చూపే ప్రయత్నంలో ఖమ్మం కాంగ్రెస్ పార్టీ నాయకులు తప్పులో కాలేశారన్న అభిప్రాయలు అయితే వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page