దిశ దశ, కరీంనగర్:
ఇరాన్ లో జరుగుతున్న యుద్దం కారణంగా గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు ఆందోళన చెందాల్సిన పని లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఆయా దేశాల్లో స్థిరపడ్డ భారతీయులు మస్కట్ వరకు రోడ్డు మార్గం గుండా చేరుకుని స్వదేశానికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇజ్రాయిల్, ఇరాన్ యుద్దం కారణంగా గల్ఫ్ దేశాలైన దుబాయి, ఖతర్, బహ్రేయిన్, కువైట్, సౌవి అరేబియా దేశాలలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించాయని బండి సంజయ్ వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు రోడ్డు మార్గం ద్వారా ఓమన్ కు చేరుకుని అక్కడి నుండి భారతదేశానికి చేరుకునేందుకు అనువైన వాతావరణం కల్పించినట్టుగా తెలిపారు. ఇందుకోసం మస్కట్ లోని భారతీయ రాయబార కార్యాలయం కూడా ఒక ప్రకటన విడుదల చేసిందని, దుబాయి నుండి మస్కట్ ఎయిర్ పోర్టుకు చేరుకోవాలంటే 450 కిలో మీటర్లు ప్రయాణించాల్సి ఉంటుందని, ఇతర గల్ఫ్ దేశాల నుండి మస్కట్ చేరుకోవాలంటే వెయ్యి కిలో మీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వివరించారు. అయితే ఓమన్ చేరుకునే ముందే విజిట్, టూరిస్ట్ విసా పొందాల్సి ఉంటుందని, ‘రాయల్ ఓమన్ పోలీస్ వెబ్ సైట్’ ద్వారా అనుమతించిన ట్రావెల్ ఏజెంట్ల ద్వారా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుందని తెలిపారు. అమెరికా, యూకే, కెనడా, జపాన్, షాంగై దేశాల్లో చెల్లుబాటు అయ్యే వీసా లేదా నివాస అనుమతి ఉన్న బారత పాసుపోర్టు దారులకు ‘‘ఆన్-అరైవల్ వీసా’’ సదూపాయం కూడా ఉంటుందని బండి సంజయ్ వివరించారు. రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్, ఆరోగ్య భీమా ఉన్నవారయితే ముందస్తు వీసా లేకుండా గరిష్ట్ంగా 14 రోజుల వరకు ఓమన్ లోకి ప్రవేశించే అవకాశం కూడా ఉంటుందని, గల్ఫ్ సహకార మండలి (GCC) దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఖతర్, సౌదీ అరేబియా, యూఏఈలో రెసిడెంట్ కార్డు కలిగిన భారత పౌరులు కూడా ‘ఆన్-అరైవల్ వీసా’’ అందుబాటులో ఉంటుందని తెలిపారు. వీసాకు దరఖాస్తు చేసే సమయంలో పాస్ పోర్టు కనీసం ఆరు నెలల పాటు చెల్లుబాటయ్యేలా ఉండాలని, స్వదేశానికి తిరిగి రావాలనుకునే గల్ఫ్ దేశాల్లోని ప్రవాస భారతీయులు పూర్తి వివరాల కోసం ఓమన్ లోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని బండి సంజయ్ సూచించారు.


