కరీంనగర్ జూదం కేంద్రాల తీరు…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ జిల్లా కేంద్రంలో పోలీసుల కళ్లుగప్పి జూదం ఆడించే బడాబాబులు ఎక్కువయినట్టుగా తెలుస్తోంది. మూడు రోజుల క్రితం త్రిటౌన్ లిమిట్స్ లో పేకాట కేంద్రంపై పోలీసులు దాడులు చేసిన తరువాత సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేకాడే వారిని జమ చేసి వారికి ఎలాంటి ఇబ్బందులు కలగవన్న ధీమా కల్పిస్తూ ప్యత్యేకంగా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులో ఓ చోట, మరికొన్ని రోజులు మరో చోట జూదం నడిపిస్తున్న ‘‘కేటు’’గాళ్లు ఆడిందే ఆట పాడిందే అన్నట్టుగా మారిపోయింది. పోలీసుల కనుసన్నల్లో పడ్డామని ఏ మాత్రం అనుమానం వచ్చినా అక్కడి నుండి అడ్డా మార్చి మరో చోట ఇళ్లు అద్దెకు తీసుకోవడం అక్కడ జూదం ఆడించడం పరిపాటిగా మారినట్టుగా స్పష్టం అవుతోంది. కరీంనగర్ లోని వివిధ ప్రాంతాల్లో భవనాలను ఎంచుకుని వాటిని అద్దెకు తీసుకునేందుకు ఓ నెట్ వర్క్ ఏర్పాటు చేసుకుని వివిధ ప్రాంతాలకు చేందిన వారిని జమ చేసి అడ్డాలు కొనసాగిస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. నిర్వాహాకులు జూదం కేంద్రాలను నిర్వహించేందుకు సూటబుల్ బిల్డింగులను పరిశీలించి అక్కడ గేమింగ్ నడుపుతూ రావల్సిన కేటు వసూలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇంటి అద్దె, మందు, నాన్ వెజ్ వంటి అన్ని సౌకర్యాలను పేకాట ఆడేవారికి అందుబాటులో ఉంచుతూ ఆదాయాన్ని గడిస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. గతంలో హౌజింగ్ బోర్డు కాలనీలోని ఓ భవనాన్ని ఎంచుకున్న నిర్వాహాకులు ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లేందుకు మెట్లు లేకున్నా జూదం కేంద్రం నిర్వహించినట్టుగా తెలుస్తోంది. పేకాట ఆడే వారి కోసం పై అంతస్తుకు చేరేందుకు ఓ నిచ్చెన ఏర్పాటు చేసుకుని పేకాట రాయుళ్లంతా పైకి చేరుకోగానే నిచ్చెన తీసేసేవారని అక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త పడేవారని తెలుస్తోంది. చివరకు అక్కడ జూదం నడుస్తున్న విషయం పోలీసుల వరకూ వెల్లిందన్న సమాచారం అందగానే అక్కడి నుండి అడ్డా మార్చేసినట్టుగా తెలిసింది. భగత్ నగర్ ప్రాంతంలో కూడా ఇదే విధంగా పేకాట ఆడిస్తున్న క్రమంలో పోలీసుల వరకూ ఈ విషయం చేరడం, దాడులు కూడా చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. పోలీసుల దృష్టి జూదం కేంద్రంపై పడిందంటే చాలు అడ్డాలు మార్చడం మొదలు పెట్టినట్టుగా సమాచారం. మూడు రోజుల క్రితం సుభాష్ నగర్, ఆరెపల్లి రోడ్డులోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్టుగా పోలీసు అధికారులకు సమాచారం అందడంతో దాడులు చేయడంతో ప్రముఖులు పట్టుబడడంతో ఒక్కొక్కటిగా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గేమింగ్ కోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు వెనుకాడని చాలా మందిని సదరు అడ్డా వద్దకు చేర్చినట్టుగా స్పష్టం అవుతోంది. ఆ తరువాత పోలీసులు పట్టుకున్న పేకాటరాయుళ్ల జాబితా విడుదల చేయగా అందులో సిద్దిపేట, హన్మకొండ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారని తేలింది. వివిధ ప్రాంతాలకు చెందిన వారిని పేకాట కోసం నిర్వాహకులు తాము ఏర్పాటు చేసిన అడ్డాలకు రావాలన్న సమాచారం ఇస్తున్నట్టుగా దీనిని బట్టి అర్థం అవుతోంది. తాము ఫలానా ప్రొఫెషన్ లో ఉన్నందున పోలీసుల నుండి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న ప్రచారం చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. పోలీసు వ్యవస్థతో సాన్నిహిత్యంగా ఉండే ప్రొఫెషన్ కావడంతో నిజమని నమ్మిన పేకాటరాయుళ్లు కరీంనగర్ పోలీసులకు రెడ్ హైండెడ్ గా పట్టుబడడంతో అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనా పేకాట కేంద్రాలను నడిపించే నిర్వాహాకులపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

