పొలిమేరల్లో ఆగిపోయిన వరుడు…
దిశ దశ, గన్నేరువరం:
మంగళవాయిద్యాల నడుమ జరగాల్సిన పెళ్లికి వరద నీరు అడ్డొచ్చింది. గ్రామ పొలిమేరల వరకు చేరుకున్న వరుని తరుపు వారిని ఊర చెరువు నిలువరించింది. మత్తడి మీదుగా పొంగిపొర్లుతున్న నీటిని దాటుకుంటూ గ్రామంలోకి చేరుకోవడం ఇబ్బందికరంగా మారడంతో స్థానికులు వరున్ని ఎత్తుకుని లోలెవల్ కాజ్ వే దాటించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా గుంజపడుగు గ్రామానికి చెందిన కొముర మల్లుకు, గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన టేకు భాగ్యకు వివాహం నిశ్చయమైంది. బుధవారం జరగాల్సిన పెళ్లి తంతు కోసం వరుని తరుపు వారంతా కూడా వాహనాల్లో వెంకట్రావుపల్లి, పొత్తూరు మీదుగా గన్నేరువరం పొలిమేరల వరకు చేరుకున్నారు. గ్రామంలోని ఊర చెరువు మత్తడి మీదుగా వరద నీరు పొంగిపొర్లుతుండడంతో గ్రామంలోకి వెళ్లడం కష్టతరంగా మారింది. వరుడు ఊర చెరువు వద్దకు చేరుకుని దాదాపు నాలుగు గంటల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది. చివరకు స్థానికులు వరున్ని ఎత్తుకుని మత్తడి దాటించడంతో వరుడు వధువు ఇంటికి చేరుకున్నాడు.
జల దిగ్భంధనమే…
కొత్త జిల్లాల ఆవిర్భావంతో కొత్తగా ఏర్పడిన గన్నేరువరం మండలం పరిస్థితి దయనీయంగానే ఉంది. ఓ వైపున లోయర్ మానేరు డ్యామం మరో వైపున మానేరు నది ప్రవహిస్తుండగా గ్రామాల్లోని చెరువులు, కుంటలు మండల వాసులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. గన్నేరువరం ఊర చెరువు పొంగినప్పుడల్లా పొత్తూరు, వెంకట్రావుపల్లి మీదుగా ప్రయాణించడం కష్టతరమేనని స్థానికులు చెప్తున్నారు. వానాకాలంలో గర్భిణీలు, పేషెంట్లను తరలించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న హైలెవెవల్ వంతెన నిర్మించినట్టయితే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు. ఇకపోతే మండలంలోని పారువెల్ల శివార్ల మీదుగా ప్రవహిస్తున్న వరద నీటితో లోలెవల్ వంతెన నిండిపోయింది. దీంతో మండల, జిల్లా కేంద్రానికి రాకపోకలు స్తంభించిపోయాయి. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వంతెన వద్ద హై లెవల్ బ్రిడ్జి నిర్మించినట్టయితే రాకపోకలు యథావిధిగా సాగుతాయని గ్రామస్థులు అంటున్నారు. మరోవైపున రాజీవ్ రహదారి మీదుగా వెల్లే మార్గంలోనూ అవాంతరాలు తప్పడం లేదని గన్నేరువరం మండల వసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాలు పడినట్టయితే గుండ్లపల్లి గ్రామం నుండి వెల్లే పరిస్థితి ఉండదని, కొండాపూర్, జంగపల్లి వద్ద కూడా వరద ఉధృతి పెరిగిపోయినట్టయితే మండలం అంతా కూడా జలదిగ్భంధనంలో చిక్కుకోవల్సిందే తప్ప ప్రత్యామ్నాయం మాత్రం లేదని మండల వాసులు అంటున్నారు. వరద నీరు వచ్చి చేరుతున్న ప్రాంతాల్లో బ్రిడ్జిలను నిర్మించాలని కోరుతున్నారు స్థానికులు.

