దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ లోని ఓ పేకాట కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. భారీ సంఖ్యలో జూదగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పలు రాజకీయ పార్టీల నాయకులు, అసోసియేషన్ల ప్రముఖులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సోమవారం రాత్రి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సభాష్ నగర్, ఆరెపల్లి రహదారిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారు. ఈ సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు పేకాటరాయుల్లు అడ్డాగా మార్చుకున్న ఇంటిపై దాడులు నిర్వహించారు. పెంట్ హౌజ్ లో మందు విందుతో పాటు జూదం ఆఢుతుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల దాడుల్లో భారీ సంఖ్యలో జూదగాళ్లు, మొబైల్ ఫోన్లు, భారీ వాహనాలు దొరికినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అధికార పార్టీ నాయకులు, కరీంనగర్ చెందిన పలువురు ప్రముఖులు ఉన్నట్టుగా సమాచారం. ఈ జూదం కేంద్రాన్ని ఓ మీడియా ప్రతినిధి నిర్వహిస్తున్నట్టుగా జూదగాళ్లు పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. జూదగాళ్ల నుండి రోజుకు ఇంత అని ఛార్జీలు వసూలు చేస్తున్నట్టుగా కూడా వారు వెల్లడించినట్టుగా సమాచారం. అయితే కరీంనగర్ రూరల్ పోలీసులు అధికారికంగా వివరాలు వెల్లడించడం లేదు. రాజకీయ నాయకులతో పాటు ప్రముఖులు కూడా ఉండడంతో గేమింగ్ యాక్ట్ కేసు నుండి తప్పించాలంటూ పోలీసులపై ఒత్తిళ్లు కూడా వస్తున్నట్టుగా తెలిసింది. ఈ జూదం కేంద్రం గురించి పోలీసు ఉన్నతాధికారుల దృష్టిలో కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది.

