క్రిప్టో కరెన్సీ కేసులో కట్ల సతీష్ అరెస్ట్…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ మాజీ కార్పోరేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కట్ల సతీష్ అరెస్ట్ అయ్యాడు. నకిలీ క్రిప్టో కరెన్సీ కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు వివరించారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే మూడింతలు లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన నిందితుల్లో ఒకడైన కట్ల సతీష్ ను కోర్టులో హాజరు పరిచామని కరీంనగర్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి తెలిపారు. తీగలగుట్టపల్లికి చెందిన నునావత్ భాస్కర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమెదు చేసినట్టుగా వివరించారు. మెటా ఫండ్ క్రిప్టో స్కీమ్ ద్వారా పెట్టుబడి పెట్టాలని కట్ల సతీష్ సూచించాడని, రూ. 50 లక్షలు పెడితే మూడింతల లాభాలు వస్తాయని నమ్మించాడని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కట్ల సతీష్ మాటలు నమ్మి 2024 జూన్ నెలలో రూ. 15 లక్షలు ఇచ్చానని, తన ద్వారా మరికొంత మందిని జాయిన్ చేయాలని సూచించడంతో తన పరిచయస్తులైన 17 మంది ద్వారా రూ. 1.20 కోట్లు సతీష్ వసూలు చేశాడని భాస్కర్ వివరించాడు. తాము చెల్లించిన మొత్తానికి మూడు నెలల్లో మూడింతలు ఇస్తానని హఆమీ ఇచ్చినప్పటికీ ఒక్క రూపాయి కూడా తిరిగి ఇవ్వలేదన్నారు. తమ డబ్బులు ఇవ్వాలని అడిగినప్పుడల్లా బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపించాడు. భాస్కర్ ఫిర్యాదు మేరకు నిందితుడు కట్ల సతీష్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టుగా వివరించారు. కట్ల సతీస్ అరెస్ట్ లో కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి, సీసీఎస్ సీఐ ప్రకాష్ గౌడ్, ఎస్సైలు నరేష్, తిరుపతిలు కీలకంగా వ్యవహరించారు. ఆయన వద్ద ఒక ఐపాడ్, రెండు మొబైల్ ఫోన్లు, కొన్ని బ్యాంకు అకౌంట్ల వివరాలను స్వాధీనం చేసుకున్నారు.
సీపీ ప్రకటన…
కరీంనగర్ కేంద్రంగా సాగుతున్న క్రిప్టో కరెన్సీ వ్యవహారంపై సీపీ గౌష్ ఆలం మీడియాతో మాట్లాడిన మూడు రోజుల్లోనే పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడం గమనార్హం. మంగళవారం మెటా క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడిన సీపీ చాలా వరకు ఆధారాలు దొరకడం లేదని, రుజువులు లభ్యం అయినట్టయితే తప్పకుండా నిందితులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అయితే మెటా క్రిప్టో కరెన్సీ ద్వారా వందల కోట్లలో టర్నోవర్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది కానీ అంత మొత్తంలో ఉండకపోవచ్చని సీపీ అన్నారు. సీపీ వెల్లడించిన మూడో రోజునే కరీంనగర్ మాజీ కార్పోరేటర్ కట్ల సతీష్ ను పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం.

యాక్టివ్…
కొంతకాలంగా రాజకీయాలకు అంటీ ముట్టనట్టుగా వ్యవహరించిన కట్ల సతీష్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా తిరగడం మొదలు పెట్టారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం వెలుగులోకి రాగానే కట్ల సతీష్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ ప్రదర్శించడం మొదలు పెట్టారు. ప్రముఖలతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికలపై షేర్ చేస్తూ తన ఇమేజ్ ఇది అని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం కట్ల సతీష్ ను అరెస్ట్ చేయడంలో మాత్రం వెనుకడుగు వేయలేదు.

