దిశ దశ, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అరెస్ట్ సంచలనంగా మారింది. రైతులను బెదిరించి రూ. 50వేలువసూలు చేసినందుకు ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది.
అసలేం జరిగిందంటే..?
తలమడుగు ఎస్సై డి రాధిక కథనం ప్రకారం… పోలీస్టేషన్ పరిధిలోని కజ్జర్ల గ్రామానికి చెందిన రైతులు కజ్జర్ల, దేవాపూర్ రోడ్డుకు ఇరువైపులా అటవీ శాఖ ఏర్పాటు చేసిన అవెన్యూ ప్లాంటేషన్ విస్తరించి ఉంది. ఈ అవెన్యూ ప్లాంటేషన్ పరిసరాల్లోనే వ్యవసాయ భూములు కూడా ఉన్నాయి. అయితే రైతులు తమ పంట పొలాల్లోని అవశేషాలను నాశనం చేసేందుకు నిప్పంటించారు. ఈ క్రమంలో మంటలు విస్తరించి అవెన్యూ ప్లాంటేషన్ కు కూడా అంటుకోవడంతో కొంతమేర నష్టం వాటిల్లింది. అయితే ఫారెస్ట్ బీట్ ఆపీషర్ కృష్ణ నాయక్ ఇందుకు బాధ్యులైన రైతులను బెదిరింపులకు గురి చేశారు. అవెన్యూ ప్లాంటేషన్ లోని మొక్కలు కాలిపోయాయని ఇందుకు పరిహారం చెల్లించాలని, లేనట్టయితే క్రిమినల్ కేసు నమోదు చేస్తానని హెచ్చరించాడు. రూ. 1.50 లక్షలు ఇవ్వాలని బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్ రైతులను అడిగాడు. దీంతో భయపడిపోయిన రైతులు రూ. 50 వేలు అతనికి ముట్టజెప్పారు. చింతలపెల్లి జైభరత్ రెడ్డి రూ.25,000, యెల్మ రఘువరన్ రెడ్డి రూ.10,000, తాండ్ర మహేష్ రూ.7,500, తాండ్ర నర్సింహులు రూ.7,500 చొప్పున రూ.50,000 అప్పగించారు. బాధిత రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కృష్ణ నాయక్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని ఎస్సై రాధిక తెలిపారు.

