సర్కారు పాఠశాలల విద్యార్థులకు కాంపిటీషన్…
అధికారులకూ పోటీ పరీక్షలు..
దిశ దశ, కరీంనగర్:
పరిపాలనా పరంగా ఫైల్స్ పై సంతకాలు చేయాడానికే ఎక్కువ సమయం వెచ్చిస్తుంటారు. కంప్యూటర్ యుగం కావడంతో ప్రింట్ చేసిన లేఖలపైనే సిగ్నేచర్స్ చేస్తుంటారు. కానీ క్లాస్ రూంలో కూర్చుని చేతులకు పని చెప్పిన వీరంతా ప్రభుత్వ అధికారులే. సాంకేతికతను అందిపుచ్చుకున్న ఈ కాలంలోనూ అధికారులు ఇలా చేస్తున్నారెందుకని అనుకుంటున్నారా..? ఆఫీసర్లంతా ఒకే గదిలో కూర్చుని ఏ చేస్తున్నారని ఆలోచిస్తున్నారా..? అసలు విషయం ఏంటంటే..?
కలెక్టర్ మరో ప్రయత్నం…
వినూత్న ఆలోచనలకు వేదికగా నిలుస్తున్న కరీంనగర్ జిల్లా అధికార యంత్రాంగం ఇప్పుడు కాలిగ్రఫీపై దృష్టి పెట్టింది. టెక్నాలజీతో పోటీ పడుతున్న ఈ కాలంలోనూ చేతి రాతతో ఉన్న అనుబంధాన్ని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి భావించారు. ఇందుకోసం జిల్లా అధికారులంతా కూడా చేతిరాతపై దృష్టి సారించాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం జిల్లాలోని ఉన్నతాధికారులతో పాటు వివిధ మండలాలకు చెందిన పలు శాఖల అధికారులు, విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. వీరితో పాటు కలెక్టర్ పమేలా సత్పతి కూడా చేతిరాత పోటీలకు హాజరు కావడం గమనార్హం. ఇంగ్లీష్ హైండ్ రైటింగ్ లో విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు కలెక్టర్.
విద్యార్థుల కోసం…
సర్కారు బడులంటే చట్టుబండలు కాదు… సంస్కరణల కేంద్రాలని నిరూపించాలన్న తపనతో కలెక్టర్ పమేలా సత్పతి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కాలీగ్రఫీపై మక్కువ పెంచుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని గుర్తించిన ఆమె జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు కార్యాచరణ రూపొందించారు. చదువులు, ఆటాపాటల్లోనే కాకుండా చేతి రాతలోనూ విద్యార్థుల్లో పోటీతత్వం పెంచాలన్న యోచనతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో బాగంగా కరీంనగర్ పారమిత విద్యా సంస్థల సహకారంతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఆగస్టు 20న హైండ్ రైంటింగ్ పోటీ పరీక్షలను పాఠశాలల వారిగా నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఆగస్టు 25న మండల స్థాయిలో కాంపిటీషన్ ఏర్పాటు చేశారు. జిల్లాలోని 16 మండలాల్లో 584 మంది విద్యార్థుల్లో 48 మందిని జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయగా వారికి కరీంనగర్ పారమిత విద్యా సంస్థలో పోటీలను నిర్వహించారు.
ప్రోత్సాహకాలు ఇలా…
జిల్లా స్థాయిలో ఎంపికయిన వారిలో మొదటి ఇద్దరి విద్యార్థులకు రూ. 5 వేలు, రెండో స్థానంలో నిలిచిన ఇద్దరికి రూ. 4 వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ. 3 వేలు, నాలుగో స్థానం వారికి రూ. 2 వేలు, ఐదో స్థానంలో నిలిచిన వారికి రూ. వెయ్యి చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. ఐదుగురికి కన్సోలేషన్ బహుమతులు అందజేయనున్నారు. అలాగే మండల, పాఠశాలల స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేయనున్నారు.

అధికారులూ…
ఇందులో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా ఇంగ్లీష్ హైండ్ రైటింగ్ పోటీలకు హాజరు కావడం గమనార్హం. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. చేతిరాతకు దూరం కావడం వల్ల ఎన్నో ప్రయోజనాలను కోల్పోతున్నారని, ప్రతి రోజూ కొంత సమయం హైండ్ రైటింగ్ చేయడం వల్ల వయసు పైబడిన తరువాత మతిమరుపుకు దూరం అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు నిపుణులు. దీనివల్ల అర్థవంతంగా తమలోని భావాలను వ్యక్తీకరించే అవకాశం కూడా ఉంటుందని పేర్కొంటున్నారు. విద్యా ప్రమాణాలు కూడా మెరుగు పడతాయని భావించిన కరీంనగర్ కలెక్టర్ తన మదిలో మెదిలిన ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. హైండ్ రైటింగ్ మెరుగు పర్చుకున్నట్టయితే ఎన్నో లాభాలు ఉంటాయని గుర్తించే కాలిగ్రఫీపై పట్టు బిగించాలన్న తపనతో కలెక్టర్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. హైండ్ రైటింగ్ పోటీలు నిర్వహించినట్టయితే విద్యార్థుల్లో నూతన ఒరవడి మొదలవుతుందని భావిస్తున్నారు.

