మహారాష్ట్రలో వరద బీభత్సం… జగిత్యాల వాసుల గల్లంతు…

దిశ దశ, జగిత్యాల:

మహారాష్ట్రలో భారీ వరదల్లో జగిత్యాలకు చెందిన వారు గల్లంతయ్యారు. గల్లంతయిన సమాచారం అందుకున్న ఆయా కుటుంబాలకు చెందిన వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ కు చెందిన నలుగురు నిజామాబాద్ జిల్లా బోధన్ కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామానికి వెల్లి వస్తున్నారు. తిరుగు ప్రయాణంలో మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా మక్హేడ్ తాలుకా దెగ్లూరుకు 30 కిలోమీటర్ల దూరంలో వరద నీటి ఉధృతితో కారు గల్లంతయ్యింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, కారు డ్రైవర్ అందులోనే చిక్కుుకపోయారు. ఆదివారం అర్థరాత్రి 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ రావడంతో సమాచారం తెలిసిందని వివరించారు. టీఆర్ నగర్ కు చెందిన అఫ్రీనా, హసీనా, సమీనా అనే ముగ్గురు మహిళలతో పాటు సోహెబ్ అనే యువకుడు కూడా ఉన్నారు. కారులో వస్తుండగా వరదలకు కారు కొట్టుకపోతున్న క్రమంలో సోహెబ్ క్షేమంగా బయటపడ్డాడు. కారు డ్రైవర్ తో పాటు టీఆర్ నగర్ కు చెందిన మహిళలు అఫ్రినా, హసీనా, సమీనాలు గల్లంతయ్యారు.

ఆ పరిస్థితిలోనూ…

మహారాష్ట్ర సరిహధ్దు ప్రాంతంలో వరద బీభత్సంలో కొట్టుకపోతున్న క్రమంలో కూడా షేక్ అఫ్రీన్ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ప్రాణాలతో బయట పడతానో లేదోనన్న ఆందోళన ఆమెను వెంటాడింది. వరద ఉధృతి గల్లంతువుతున్న క్రమంలో పిల్లలు, భర్త గుర్తుకు రాగానే వెంటనే భర్త సలీంకు ఫోన్ చేసి మాట్లాడిన తీరు విన్న స్థానికులను కంటతడి పెట్టించింది. వరద ప్రవాహంలో కొట్టుకపోతున్నామని పిల్లలను బాగా చూసుకోవాలని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ అఫ్రీన్ తనకు ఫోన్ చేసి చెప్పిందని భర్త రోధిస్తు వివరించాడు. ఆ తరువాత అఫ్రీన్ ఫోన్ కు కాల్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తోందని కుటుంబ సభ్యులు తెలిపారు. టీఆర్ నగర్ కు చెందిన ముగ్గురు మహిళలు వరద నీటిలో గల్లంతు కావడంతో స్థానికంగా విషాద చాయలు అలుముకున్నాయి. మహారాష్ట్ర సరిహద్దుల్లో వచ్చిన వరదల్లో గల్లంతయిన అఫ్రిన్ కు చిన్న పిల్లలు ఉండడం స్థానికులను కలిచివేస్తోంది.

చొరవ తీసుకోండి…

టీఆర్ నగర్ కు చెందిన ముగ్గురు మహిళలు మహారాష్ట్రలో వచ్చిన వరదల్లో గల్లంతయిన విషయంపై తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని స్థానికులు కోరుతున్నారు. వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.