సరికొత్త డాక్టర్లు పుట్టుకొచ్చారు తస్మాత్ జాగ్రత్త…

మెడికల్ కౌన్సిల్ దాడుల్లో కొత్త విషయాలు…

దిశ దశ, జగిత్యాల:

ఎంబీబీఎస్, పీజీ పట్టాలు పొందిన డాక్టర్ల గురించి అందరికీ తెలుసు. ఆర్ఎంపీ, పీఎంపీల గురించి కూడా తెలుసు. కానీ రాష్ట్రంలో కొత్త డాక్టర్లు కూడా పుట్టుకొచ్చారు. నిజమని నమ్మి చికిత్స చేయించుకునేందుకు వెళ్లారో ప్రాణాలకయితే గ్యారెంటీ ఉండదన్న విషయం గుర్తు పెట్టుకోండి. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రారర్ లాలయ్య, ఛైర్మన్ కె మహేష్ కుమార్ ల నేతృత్వంలో గురువారం పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో 10 మందిపై క్రిమినల్ కేసులు నమెదు చేసింది TGMC. జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో దాడులు చేసినట్టుగా TGMC అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. వీరిలో చాలా మంది కూడా వార్డ్ బాయ్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, కంపౌండర్లు గా పని చేసి బయటకు వచ్చి ఆర్ఎంపీలుగా అవతారం ఎత్తారని TGMC పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్ కుమార్ వి తెలిపారు.

డ్రగ్స్ రాయడంలోనూ…

కొంతకాలం ప్రైవేటు దవఖానాల్లో ఉపాధి కోసం పనిచేసి మిడిమిడి జ్ఞానం సంపాదించుకున్న తరువాత డాక్టర్లుగా చెప్పుకుంటే ఏకంగా క్లినిక్ లనే తెరిచేశారు. కొత్త కొత్త డిగ్రీలను చదివినట్టుగా బోర్డలపై రాసుకుని దర్జాగా చికిత్స చేస్తున్నారు. వీరు రాస్తున్న మందులు కూడా ప్రొఫెషనల్ డాక్టర్స్ తరహాలోనే ఉంటున్నాయని గుర్తించారు అధికారులు. యాంటీ బయెటిక్స్, స్థెరాయిడ్స్, పెయిన్ కిల్లర్స్ వంటి డ్రగ్స్ రాస్తూ ప్రజలను అనారోగ్యానికి చేరువకు పంపిస్తున్నారని తేల్చారు. కొన్ని చోట్ల లింగ నిర్దారణ పరీక్షులు, అబార్షన్లు కూడా చేస్తున్నారని గుర్తించినట్టు TGMC పబ్లిక్ రిలేషన్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ నరేశ్ కుమార్ తెలిపారు. TSMPR చట్టం 22, BNS 18,19 ప్రకారం నకిలీ వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు కూడా వెల్లడించారు.

జగిత్యాల జిల్లాలో…

జగిత్యాల జిల్లా కేంద్రంలో తనిఖీ అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, విజిలెన్స్ ఆఫీసర్ రాకేష్ లు తనిఖీలు చేపట్టారు. పట్టఏణంలోని విద్యానగర్ బైపాస్ రోడ్డులో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నడుపుతున్న అడుల గణేష్, వినాయక ఫస్ట్ ఎయిడ్ నడుపుతునర్న రాజారామ్, మిషన్ కంపౌండ్ సమీపంలో భారత క్లీనిక్ నడుపుతున్న అమానుల్లాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

కామారెడ్డిలో…

జిల్లాలోని గాంధారి పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీ అధికారులు డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ శిరీష్ కుమార్ ల నేతృత్వంలో దాడులు జరిగాయి. గాంధారి ప్రధాన రహదారిపై గురుకృప క్లీనిక్ నడుపుతున్న కె కస్తూరి అంజరయ్, అంబేడ్కర్ చౌరస్తా సమీపంలోని అక్షయ మెడికల్ స్టోర్ అండ్ క్లీనిక్ నిర్వహిస్తున్న ఎం అంజనేయులు, గాంధారి ప్రధాన రహదారిపై హేమ్ సింగ్ ఫస్ట్ సెంటర్ నడుపుతున్న కెతావత్ హేమ్ సింగ్, సోమేశ్వర్ ప్రాంతంలో సుదర్శన్ క్లినిక్ నిర్వహిస్తున్న జాదవ్ సుదర్శన్, బాన్సువాడలో వెంకటేశ్వర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అండ్ క్లీనిక్ నిర్వహిస్తున్న పరమేశ్వర్ లపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టుగా అధికారులు తెలిపారు.
ప్రజల ఆరోగ్యాన్ని రక్షించేందుకు TGMC విశేషంగా కృషిచేస్తోందని నకిలీ వైద్యులు చికిత్స అందించినట్టయితే 91543 82727కు వాట్సప్ చేయాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని వెల్లడించారు.

You cannot copy content of this page