హరీష్ రావుపై మేడిపల్లి సత్యం ఫైర్…
దిశ దశ, హైదరాబాద్:
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో వైఫల్యాలను ఒప్పుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వంపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని, మాజీ మంత్రి హరీష్ రావు తీరు చూస్తుంటే హంతకుడే సంతాప సభ పెట్టినట్టుగా ఉందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వ్యాఖ్యానించారు. సోమవారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎల్లంపల్లి గేట్లు ఎత్తి నీరు వదిలితే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల మీదుగా సముద్రంలో కలుస్తున్నాయని హరీష్ రావు ఒప్పుకున్నారన్నారు. పంపులు, లిఫ్టుల పేరిట దుర్మార్గాలకు పాల్పడ్డారని, నీటిని ఎత్తిపోసేందుకు వేల కోట్లు ఖర్చు చేశారని అయితే చివరకు ఆ నీరంతా కూడా ఎల్లంపల్లి నుండి తిరిగి నీటిని దిగువకే వదిలేశారన్నారు. వంద టీఎంసీల నీరు ఎగువకు ఎత్తిపోసిన తరువాత ఎల్లంపల్లి నుండి దిగువకు వదిలేయడం క్రిమినల్ నెగ్లిజెన్సీ అవుతుందని మేడిపల్లి సత్యం దుయ్యబట్టారు. లక్ష కోట్ల ప్రజా ధనాన్ని లుటీ చేయడంతో పాటు వేల కోట్ల విద్యుత్ బిల్లుల కోసం వెచ్చించి తిరిగి నీటిని వదిలేయాల్సి రావడం క్రిమినల్ ఇంటెన్షన్ అవుతుందన్నారు. ఆ నాడు తెలంగాణ ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారని, హరీష్ రావు చెప్తున్న నీతులు వింటుంటే పసి పిల్లవాడు కూడా నవ్వుకునే పరిస్థితి ఏర్పడిందని చొప్పదండి ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దారుణాలు వెలుగులోకి వచ్చాయని, దీనివల్ల బీఆర్ఎస్ నేతలు ప్రజల్లో దోషులుగా నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్వహాణ, వ్యవసాయ రంగానికి నీటిని అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని గుర్తుపెట్టుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎద్దు తెలుసు… ఎవుసం తెలుసని, మీలా వేల కోట్ల దోపిడీ చేసుకోవడం మాత్రం తెలియదన్నారు. రైతులను, పంటలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసన్నారు. కాళేశ్వరం విషయంలో చేసిన తప్పిదాలను ఒప్పుకుని ముక్కు నేలకు రాయాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హితవు పలికారు.
అందుకోసమే…
చొప్పదండి నియోజకవర్గంలో నీరందక 12 వేల ఎకరాల్లో వరి నార్లు ఎండిపోతున్నాయని రైతుల తన దృష్టికి తీసుకరాగానే మంత్రులు ఉత్తం కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, పొన్నం ప్రభాకర్ ల దృష్టికి తీసుకెళ్లానని మేడిపల్లి సత్యం తెలిపారు. అప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో సమృద్దిగా జలాలు లేకున్నప్పటికీ చొప్పదండి రైతాంగం కోసం నీటిని తరలించడం జరిగిందన్నారు, చొప్పదండి నియోజకవర్గంలో బాహుబాలి మోటార్లు పెట్టి వారి ప్రాంతాలకు నీటిని దోచుకెళ్లారని, కానీ తాను మాత్రం చొప్పదండి నియోజకవర్గ భూములకు నీటిని ఇప్పించేందుకు చొరవ తీసుకున్నానని స్పష్టం చేశారు. ఆనాడు బాహుబలి మోటార్లు ఏర్పాటు చేసిన సమీప ప్రాంతం నుండే ఏడారిని తలపించే విధంగా ఉండేదన్నారు. నాడు ఎల్లంపల్లి నుండి నారాయణపూర్ రిజర్వాయర్ కు నీటిని తరలించేందుకు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పైపులైన్ల వేయిస్తే అధికారంలోకి వచ్చిన తరువాత ఆ ప్రాజెక్టు అంశాన్నే మరుగున పడేసిన నీచ చరిత్ర మీదని మేడిపల్లి సత్యం మండిపడ్డారు. నారాయణ పూర్ ప్రాజెక్టు భూ సేకరణకు నిధులు ఇవ్వకుండా అదనపు టీఎంసీ పేరిట కొత్తగా భూ సేకరణ జరిపి నియోజకవర్గాన్ని నిండా ముంచిన చరిత్ర కేటీఆర్, హరీష్ రావు, కేటీఆర్ లదేనన్నారు. అటువంటి వారు కరీంనగర్ జిల్లా ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని, కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించిన ఎస్సారెస్పీ, వరద కాలువ, ఎల్లంపల్లి, కాకతీయ కెనాల్ ద్వారా మాత్రమే వ్యవసాయం సాగుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరందించలేదన్నారు. చొప్పదండి నియోజకవర్గంలో సాగు కోసం ఎంత మేర నీరందించారోనన్న విషయంపై చర్చకు సిద్దంగా ఉన్నామన్నారు. ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలను, పిచ్చి ప్రేలాపనలు చేయడం మానుకోవాలన్నారు.

