ఎన్నిక ముగిసే వరకూ ఉత్కంఠే… బీఆర్ఎస్ విప్ జారీ చేసేనా..?

దిశ దశ, కరీంనగర్:

మరికొన్ని గంటల్లో జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతోంది. బీజేపీ వర్సెస్, కూటమి పార్టీలు వేర్వేరు క్యాంపులను ఏర్పాటు చేయడంతో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. 30 స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీకి మరో నలుగురి మద్దతు లభించినట్టయితే పీఠం దక్కించుకునేది. దీంతో స్వతంత్రుల మద్దతు కూడగట్టుకోవడంలో సఫలం అయిందనే చెప్పాలి. ఇద్దరు బీజేపీ రెబెల్స్, ఒక స్వతంత్ర, AIFB కార్పొరేటర్ బీజేపీకి అనుకూలంగా ఉండడంతో పక్కాగా గెలుస్తామన్న ధీమాతో కాషాయం శ్రేణులు ఉండిపోయారు. అయితే శనివారం వేకువజాము నుండి జరిగిన అనూహ్య పరిణామాలు బీజేపీకి ఊహించని షాకిచ్చాయనే చెప్పాలి. కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ సాధించిన సీట్లలో దరిదాపుల్లో కూడా ఏ పార్టీ లేకపోవడం, భావసారుప్యత లేని పార్టీలు ఏకం అయ్యే అవకాశం లేవన్న కారణంగా మరో అడుగు దూరంలో ఉన్నామన్న కాన్ఫిడెంట్ తో నడుచుకుంది కాషాయ దళం. కూటమిగా ఏర్పడి మ్యాజిక్ ఫిగర్ అందుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదపడం మొదలు పెట్టింది. మొదట అందుబాటులో ఉన్న అన్ని పార్టీలు, స్వతంత్రులను క్యాంపునకు తరలించి వ్యూహాలకు పదును పెట్టింది. బీజేపీ క్యాంపులో ఉన్న వారు కాకుండా మిగతా వారంతా కలిసి 32 మంది కూటమికి అనుకూలంగా మారిపోయారు. ఎస్ అఫీషియో సభ్యులతో కలిపి 34కు కూటమి బలం చేరుకుంది. అయితే బీజేపీకి 35 మంది సభ్యుల బలం ఉండడంతో తాము మరో సభ్యుని మద్దతు కూడగట్టుకుంటే సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించారు. అయితే బీజేపీ నాయకులు AIFB తరుపున గెలిచిన విప్పల సాయి జ్యోతిని కాకుండా ఆమె కుటుంబ సభ్యులను క్యాంపునకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదివారం ఉదయం నుండి 15వ డివిజన్ కార్పొరేటర్ సాయి జ్యోతితో పాటు ఆమె కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. చివరకు జ్యోతిని కాంగ్రెస్ క్యాంపునకు తరలించడంలో కాంగ్రెస్ శ్రేణులు సక్సెస్ అయ్యారు. దీంతో తమ సంఖ్యాబలం 35కు చేరింది కాబట్టి కార్పొరేషన్ ను తామే స్వాధీనం చేసుకుంటామన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది.

బీఆర్ఎస్ విప్..?

అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడం వల్లే కూటమి మ్యాజిక్ ఫిగర్ చేరుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్న ఈ కూటమికి అనుకూలంగా ఓటు వేయాలంటూ బీఆర్ఎస్ నాయకత్వం విప్ జారీ చేస్తుందా లేదా అన్నదే మిస్టరీగా మారింది. కూటమికి బలం పెరగిందన్న వెంటనే బీజేపీ ముఖ్య నేతలు కూడా రంగంలోకి దిగి బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో చర్చలు జరిపినట్టుగా ప్రచారం జరిగింది. కరీంనగర్ విషయంలో బీజేపీకి అనుకూలంగా మద్దతు ఇచ్చినట్టయితే మిగతా మునిసిపాలిటీల్లో బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుందన్న ప్రతిపాదన చేసినట్టుగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ పార్టీ తన నిర్ణయాన్ని మాత్రం ప్రకటించలేదు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే బీఆర్ఎస్ కార్పొరేటర్లకు విప్ జారీ చేయనట్టయితే కూటమికి అనుకూలంగా పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుందా లేదా అన్న అనుమానం మొదలయింది. బీఆర్ఎస్ పార్టీలో అత్యంత కరుడు గట్టిన ఒకరిద్దరు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించే అవకాశం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరో వైపున బీజేపీ శిబిరం నిర్వహిస్తున్న ముఖ్య నాయుకునితో కూటమి పార్టీలోని కొంతమంది కార్పొరేటర్లు టచ్ లోకి వెళ్లినట్టుగా ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ విప్ జారీ చేయనట్టయితే మాత్రం కూటమి సమీకరణాలు చివరి నిమిషంలో బెడిసికొట్టినట్టేనన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. AIFB జారీ చేసిన విప్ ను అనుకూలంగా మల్చుకోవడంలో సక్సెస్ అయిన కూటమి బీఆర్ఎస్ పార్టీ నుండి విప్ జారీ చేయించడంలో మాత్రం సఫలం కాలేకపోతోందని తెలుస్తోంది. దీంతో ఎన్నిక జరిగే సమయంలో సమీకరణాలు మారే అవకాశం లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విప్ జారీ చేయనట్టయితే బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ వృధాగా ప్రయాస పడి కరీంనగర్ సమాజంలో అబాసుపాలైందన్న వాదనలు కూడా వినిపించే అవకాశాలు లేకపోలేదు. కాంగ్రెస్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందన్న అపవాదును కూడా మూట గట్టుకోక తప్పదనిపిస్తోంది.