దిశ దశ, దండకారణ్యం:
బీజాపూర్, ములుగు జిల్లాల సరిహధ్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో సెర్చింగ్ ఆపరేషన్ నిర్విరామంగా కొనసాగుతోంది. బీజాపూర్ జిల్లాలోని నంబి అటవీ ప్రాంతం మీదుగా సెర్చింగ్ ఆపరేషన్ ప్రారంభం అయింది. దాదాపు 2 వేల మంది కోబ్రా బలగాలు మావోయిస్టుల ఏరివేత కోసం తడపాల, డోలి పరిసర అటవీ ప్రాంతాలతో పాటు కర్రె గుట్టలపై కూంబింగ్ నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఓ సారి, గురువారం తెల్లవారు జామున రెండు సార్లు మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది. కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా లేకపోవడంతో అక్కడి అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరావడం లేదు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు కానీ ముఖ్య నాయకుడు కానీ ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

