బీజాపూర్ TO భద్రాద్రి
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీ ఏరివేతలో రెండు రాష్ట్రాల్లో వైవిద్యమైన పరిస్థితులు నెలకొన్నాయి. పొరుగు రాష్ట్రంలో నక్సల్స్ ఏరివేతలో భాగంగా బలగాలు ఉక్కుపాదం మోపుతుంటే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం లొంగుబాట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. మంగళవారం భద్రాద్రి, ములుగు జిల్లాలను ఆనకుని ఉన్న చత్తీస్ గడ్ లోని కర్రెగుట్టల్లో ఎన్ కౌంటర్ లో ఓ మావోయిస్టు నక్సల్ చనిపోగా, తెలంగాణాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ముందు 14 మంది జన జీవన స్రవంతిలో కలిశారు.
కర్రె గుట్టల్లో…
చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా సరిహధ్దు ప్రాంతంలో విస్తరించిన కర్రెగుట్టలపై సెర్చింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాయి అక్కడి బలగాలు. 12 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ ఆపరేషన్ లో మావోయిస్టులకు అత్యంత పట్టున్న ప్రాంతంపై పట్టు బిగించే పనిలో బలగాలు నిమగ్నం అయ్యాయి. DRG, STF, COBRA, CRPF
బలగాలు జాయింట్ ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటి వరకు కర్రెగుట్టతో పాటు అనుసంధానంగా ఉన్న గుట్టల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు చనిపోయారు. సోమవారం జరిగిన మరో ఘటనలో ఓ మహిళా నక్సల్ మృతదేహాన్ని, 303 రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. అయితే గత 12 రోజులుగా సాగుతున్న కూంబింగ్ ఆపరేషన్ కారణంగా మావోయిస్టు పార్టీకి చెందిన కీలకమైన నాయకులు, దళ సభ్యులు చనిపోవడమో లేక గాయాల బారిన పడి ఉంటారని బస్తర్ రేంజ్ పోలీసు అదికారులు అంచనా వేస్తున్నారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటూ బలగాలు మావోయిస్టులను ఏరివేసేందుకు సెర్చింగ్ ఆపరేషన్ నిర్విరామంగా కొనసాగిస్తున్నాయని చెప్తున్నారు. ఈ గుట్టలపై నక్సల్స్ ఏర్పాటు చేసుకున్న వందలాది స్థావరాలను, బంకర్లను బలగాలు ధ్వంసం చేశాయని పోలీసు అధికారులు వెల్లడించారు. కర్రె గుట్టలపై టన్నుల కొద్ది పేలుడు పదార్థాలు, పెద్ద ఎత్తున నిత్యవసరాలు, మందులను స్వాధీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు. ఈ ఏరివేతలో DRG, STF, COBRA, CRPF జవాన్లు మందుపాతరల పేల్చివేతలో గాయపడ్డారని వారంతా క్షేమంగానే ఉన్నారని కూడా తెలిపారు.
భద్రాద్రి జిల్లాలో…
కర్రె గుట్టలు విస్తరించి ఉన్న సరిహధ్దు ప్రాంతమైన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చత్తీస్ గడ్, మహారాష్ట్ర తెలంగాణలకు చెందిన మావోయిస్టు నక్సల్స్ లొంగిపోయేందుకు ముందుకు వస్తూనే ఉన్నారు. ఈ ఏడాదిలో ఆయా రాష్ట్రాలకు చెందిన 227 మంది మావోయిస్టులు ఒక్క భద్రాద్రి జిల్లాలోనే లొంగిపోయారని జిల్లా ఎస్పీ బి రోహిత్ రాజు మీడియాకు వెల్లడించారు. మంగళవారం ఎస్పీ ముందు లొంగిపోయిన వారిలో ఇద్దరు ACMలు, నలుగురు పార్టీ సభ్యులు, ముగ్గురు RPC మిలీషియా సభ్యులు, ఒక KMS సభ్యుడు, ఒక VCM మెంబర్ ఉన్నారు. వీరంతా కూడా చత్తీస్ గడ్, మహారాష్ట్రలలోని దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాల్లో పని చేస్తున్నారని ఎస్పీ వెల్లడించారు. భద్రాద్రి జిల్లా పోలీసులు, CRPF 81, 141 బెటాలియన్ అధికారుల ముందు ఆపరేషన్ చేయూత కార్యక్రమానికి ఆకర్షితులై సరెండర్ అయ్యారు. వీరంతా కూడా లొంగుబాట పట్టిన మావోయిస్టు శ్రేణులకు అందిస్తున్న సహకారాన్ని గుర్తించి ముందుకు వచ్చారని ఎస్పీ తెలిపారు. లొంగిపో్యిన వారికి తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాసం అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, సాధారణ జీవనం సాగించేందుకు అవసరమైన పరిస్థితులు కల్పిస్తామన్నారు.