మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు…
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టు పార్టీకి పెట్టని కోటగా ఉన్న అడవుల్లో బలగాలు పై చేయి సాధిస్తున్నాయి. కీకారణ్యాలో కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు కేంద్ర కమిటీ ముఖ్య నేతలే లక్ష్యంగా ఎంచుకున్నట్టుగా స్పష్టం అవుతోంది. ముఖ్య నాయకత్వాన్ని ఏరివేసినట్టయితే క్యాడర్ అంతా బలహీన పడుతోందన్న యోచనతో ఉన్న పోలీసు అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర కమిటీ నాయకులతో పాటు అనుబంధ విభాగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నవారినే లక్ష్యంగా చేసుకుని బలగాలు సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. గత నెల 21న జరిగిన ఎదురు కాల్పుల్లో పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ మరణించగా, గురువారం జరిగిన ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు టి లక్ష్మీ నరసింహాచలం, అలియాస్ గౌతం, అలియాస్ సుధాకర్ ఉరఫ్ ఆనంద్, అలియాస్ చంటి బాల కృష్ణ, అలియాస్ రామరాజు, ఉరఫ్ ఆర్ఆర్, అలియాస్ అరవింద్, అలియాస్ సోమన్న మృతి చెందినట్టుగా పోలీసు అధికారులు తెలిపారు. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఫారెస్ట్ ఏరియాలో DRG, STF బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరానికి చెందిన నరసింహాచలం 40 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లిన గౌతం పీపుల్స్ వార్, మావోయిస్టు పార్టీలో ముఖ్య నాయకుల్లో ఒకరు. దండకారణ్యంలో జనతన్ సర్కార్ లో విద్యా వ్యవస్థ బాధ్యతలు చూస్తున్న గౌతం ఆయుర్వేద వైద్య విద్యనభ్యసించినట్టుగా సమాచారం.
భారీ లక్ష్యం…
చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా పోలీసు అధికారులు కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్ కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు గౌతం మరణించారని అధికారికంగా దృవీకరించారు. నేషనల్ పార్క్ ఫారెస్ట్ లో గౌతమ్ అలియాస్ సుధాకర్, సికాస ఇంఛార్జి బండి ప్రకాష్, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు పప్పారావులతో పాటు మావోయిస్టు పార్టీ బలగాలు పెద్ద సంఖ్యలో సచంరిస్తున్నాయన్న సమాచారం అందడంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టినట్టు బీజాపూర్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. గురువారం ఉదయం నుండి కొనసాగుతున్న గాలింపు చర్యలను మరింత ఉధృతంగా కొనసాగిస్తున్నామని వివరించారు. నేషనల్ పార్క్ ఏరియాలో పోలీసు బలగాలు మావోయిస్టు నేతల కోసం భారీగా గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టుగా వెల్లడించారు.
శాంతి చర్చల ప్రతినిధి…
2004లో ఉమ్మడి ఆంద్రప్రదేష్ రాష్ట్ర ప్రభుత్వంతో పీపుల్స్ వార్, జనశక్తి పార్టీలు శాంతి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. 2004 అక్టోబర్ నెలలో హైదరాబాద్ లోని మంజీరా గెస్ట్ హౌజ్ లో జరిగిన ఈ శాంతి చర్చల్లో పీపుల్స్ వార్ పార్టీ తరుపున పాల్గొన్న ప్రతినిధుల్లో గౌతమ్ అలియాస్ సుధాకర్ కూడా ఒకరు. ఆ సమయంలోనే పీపుల్స్ వార్ తో పాటు విప్లవ పార్టీలు అన్ని కూడా ఒకే గొడుగు కిందకు రావాలని నిర్ణయించుకున్నాయని అధికారికంగా ప్రకటించారు. మావోయిస్టు పార్టీ ఆప్ ఇండియాగా తమ పార్టీని పిలవాలని కోరుతూ ఓ మెమోరాండం కూడా శాంతి చర్చలకు హాజరైన అగ్రనేతలు అప్పటి ప్రభుత్వానికి ఇచ్చారు. అప్పుడు హోం మంత్రిగా ఉన్న జానా రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ శాంతి చర్చలకు హాజరైన పీపుల్స్ వార్ నేతలతో భేటీ అయింది. అప్పుడు జరిగిన శాంతి చర్చలకు హాజరైన అగ్రనేతల్లో చాలా మంది కూడా అనారోగ్యం బారిన పడో, ఎదురుకాల్పుల్లోనో మరణించగా చాలా కొద్ది మంది మాత్రమే ఇంకా విప్లవ పంథాలో కొనసాగుతున్నారు. వారిలో ఒకరైన గౌతమ్ అలియాస్ సుధాకర్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించారు.

