వెలుగు దివ్వెల సాక్ష్యం…. పత్రికా రంగంలో సరికొత్త సంచలనం…

దిశ దశ, హైదరాబాద్: 

సాధారణ మండల రిపోర్టర్ ను తొలగించినా అతను సంస్థ నుండి వెల్లిపోయినా సవాలక్ష సందేహాలు వస్తుంటాయి ఆయా సంస్థల్లో పని చేసే పెద్ద సార్లకు. డెస్క్, ఫీల్డ్ జర్నలిస్టు బాసులు ఈ అనుమానాల దొంతరల నడుమ సామాన్య జర్నలిస్టు వ్యక్తిత్వాన్ని శంకించి మరీ కించపరిచిన సందర్బాలు కోకొల్లలుగా జరిగాయి. సంస్థలకు ఆదాయ వనరులు తెచ్చిపెట్టే యంత్రాలుగా మారిపోయిన రిపోర్టర్ల విషయంలో శీల పరీక్షలు చేసి సుదీర్ఘమైన సమాలోచనలు చేస్తుంటాయి ఆయా మీడియా సంస్థలు. కాంట్రిబ్యూటర్లు, స్ట్రింగర్లు అంటూ వివిధ రకాలుగా పేర్లు పెట్టి పిలుచుకుంటూ వారి సేవలను అన్నింటా ఉపయోగించుకుంటూ… వారిపై చిన్న ఆరోపణ వస్తే బూతద్దంలో పెట్టి మరీ రంధ్రాన్వేషన చేయడం ఆనవాయితీగా వస్తోంది ఆయా సంస్థల్లో. కానీ తెలంగాణలోని రెండు ప్రధాన పత్రికల నడుమ జరిగిన ఓ వ్యవహారం గుట్టు తెలిస్తే నివ్వెరకపోక మానరు. 

రీసైక్లింగ్… 

కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణ ముంగిట వాలిన ఓ తెలుగు దినపత్రిక వేదికగా జరిగిన ఉద్యోగుల రీసైక్లింగ్ వ్యవహారం తెలిస్తే ఔరా అనాల్సిందే.  దశాబ్దంన్నరకు  పైగా తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న మరో పత్రిక నుండి కొత్తగా ఏర్పాటయిన పత్రికలోకి వలసలను ప్రోత్సహించి తిరిగి మాతృ సంస్థలోకి పంపించే తంతు కొనసాగించారు. సదరు పత్రిక యాజమాన్యం తెలంగాణలో అసలేం జరుగుతోంది అన్న విషయాలపై దృష్టి సారించకపోవడంతో కొంతమంది లాబీయింగ్ తో ఇష్టారీతిన వ్యవహరించినట్టుగా ప్రచారం జరుగుతోంది. జర్నలిజం చరిత్రలోనే అత్యంత వైవిద్యంగా కొనసాగిన రాజీనామాలు, పోటీ పత్రికలో చేరికలు, తిరిగి మాతృ సంస్థ అక్కున చేర్చుకున్న తీరు వెనక జరిగిన మర్మం ఏంటో ఇప్పటికీ యాజమాన్యానికి కూడా అంతు చిక్కలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. దశాబ్దంన్నర కాలంగా కొనసాగుతున్న పత్రికలోని జర్నలిస్టులకు తాయిలాలు ప్రకటిస్తూ కొత్తగా ఏర్పాటు అయిన పత్రికలో జాయిన్ చేసుకున్నారని, కొన్ని నెలలు తరువాత తమకు వేతనాలు, హోదా పెరిగిందని మాతృ సంస్థలోకి రావాలంటే తమకు ఆ స్థాయి ప్రాధాన్యత ఇప్పించాల్సి ఉంటుందన్న ప్రతిపాదన పోటీ పత్రికలో పనిచేస్తున్న పూర్వ ఉద్యోగుల నుండి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో సంస్థను కాదని వెళ్లిపోయిన వారిని తిరిగి తమ సంస్థలోకి చేర్పించుకునేందుకు చేసిన లాబీయింగ్ ద్వారా సదరు సంస్థకు వేతనాల రూపంలో అదనపు భారం పడిందని అక్కడ పని చేస్తున్నవారే నెత్తి నోరు బాదుకుంటున్నారు. తమ సంస్థలో పనిచేస్తున్న ముఖ్యమైన వారిని విశ్వసించిన యాజమాన్యం కొన్ని పెద్ద తలకాయల ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడమే వారికి అలుసుగా మారినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్తగా ఏర్పడిన సదరు సంస్థలోకి వలసలు వెళ్లడం కొంతకాలానిని పూర్వాశ్రమానికి చేరుకోవడం సాధారణంగా మారిపోయింది. ఆరు నెలల కింద  సాధారణ వేతనంతో ఉన్న ఉద్యోగి మరో సంస్థలోకి వెళ్లి  తిరిగి పాత సంస్థలోకి చేరిన  తరువాత అతని వేతనం రెండు నుండి మూడింతలు పెరగడంతో పాటు అతని హోదాను కూడా పెంచేశారు. కొత్తగా ఏర్పడిన పత్రికలో పనిచేసిన ఒకరిద్దరు, పూర్వాశ్రమంలో పనిచేస్తున్న బిగ్ షాట్స్ కొందరు చేతులు కలిపి ఈ తతంగాన్ని నడిపించారన్నది జర్నలిస్టు వర్గాల్లో బహిరంగ రహస్యమే. 

భారం తగ్గించడం… 

ఇకపోతే దశాబ్దంన్నర కాలం క్రితం ప్రారంభం అయిన సదరు పత్రికలో తెలంగాణలోని కొత్త జిల్లాల వారిగా స్టాఫ్ రిపోర్టర్లను నియమించుకున్నారు. కొంతకాలం తరువాత సంస్థపై ఆర్థిక భారం పడుతుందన్న బూచి చూపించి పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో స్టాఫ్ రిపోర్టర్లను నియమించాలన్న ప్రతిపాదనను తీసుకొచ్చి కూడా సక్సెస్ అయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే కొత్త పత్రికలకు వలసల పరంపర కొనసాగించి తిరిగే అదే ఉద్యోగులను పాత సంస్థలోకి తీసుకొచ్చినప్పుడు ఇబ్బడిముబ్బడిగా జీతాలు పెంచి ఇచ్చినప్పుడు పడని ఆర్థిక భారం కొత్త జిల్లా కేంద్రాల్లో స్టాఫ్ రిపోర్టర్లకు ఇచ్చే వేతనాల వల్ల మాత్రం నష్టాన్ని చవి చూస్తున్నామని లెక్కలు కట్టడం విచిత్రమనే చెప్పాలి. ఈ వ్యవహారం వెనక కూడా ఏదో మర్మం దాగి ఉందన్న అనుమానాలు కూడా వ్యక్తం అయినా… సంస్థలోని పెద్ద తలకాయల కనుసన్నల్లో తీసుకున్న నిర్ణయం కావడంతో కిందిస్థాయి వారు కిమ్మనకుండా ఉండిపోయారు. కొత్త జిల్లా కేంద్రాల్లో పని చేస్తున్న తమ అనూయుల సం‘క్షేమం’ కోసమే కొత్త జిల్లా కేంద్రాలకు కాకుండా పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాల్లో స్టాఫ్ రిపోర్టర్లను నియమించాలన్న ప్రతిపాదనను అమలు చేసినట్టుగా కూడా ఓ వర్గంలో చర్చ జరుగుతోంది. 

వెట్టి చాకిరీ… 

ఇకపోతే జిల్లా కేంద్రాలు, మండలాలు, పట్టణాల్లో పనిచేస్తున్న సామాన్య జర్నలిస్టు మాత్రం సంస్థకు అతి ఎక్కువ సార్లు భారంగా మిగిలిపోయారు.  వీరిచే చేయించుకుంటున్న వెట్టి చాకిరీ కంటే ఎక్కువగా లైన్ అకౌంట్ ఇస్తున్నామని కోతలు పెట్టిన సందర్బాలు కోకొల్లుగా ఉన్నాయి. పెద్ద తలకాయలకు ఇచ్చే వేతనంతో తక్కువలో తక్కువగా 10 నుండి 20 మంది స్ట్రింగర్లకు లైన్ అకౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ… క్షేత్ర స్థాయిలో పనిచేసే వీరికి అందించే లైన్ అకౌంట్ విషయంలో మాత్రం లెక్కలపై లెక్కలు కట్టి సంస్థకు భారీ లాభం చేకూర్చినట్టుగా యాజమాన్యానికి చూపించి భేష్ అనిపించుకుంటున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఫోటో ఛార్జీలు, టీఏ,డీఏలు ఇచ్చే విధానంలోనూ అడ్డగోలుగా కోతలు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో శ్రమించి పనిచేస్తున్న వారికి ఆకలి బాధను మిగిల్చే ప్రయత్నం చేశారన్న ఆవేదన కూడా వ్యక్తం అయిన సందర్బాలు లేకపోలేదు. సంస్థ అప్పగించే యాడ్ రెవెన్యూ, పత్రికల సర్క్యూలేషన్, తమపై పనిచేసే ఆర్సీ ఇంఛార్జీ నుండి ఎడిటర్ వరకు ప్రతి ఒక్కరికి జవాబుదారితనంగా ఉంటున్న కాంట్రిబ్యూటర్లు లేదా స్ట్రింగర్ల విషయంలో మాత్రం ఆర్థిక భారం తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మేనేజ్ మెంట్లను మేనేజ్ చేసే ప్రయత్నం చేశారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. అన్నింటా తామై పనిచేస్తూ ఏదో ఒక వార్త మిస్ అయితే క్రష్ అయన రిపోర్టర్లకు ఇచ్చే బోటాబోటి లైన్ అకౌంట్ విషయంలో మాత్రం ఆచూతూచి నిర్ణయాలు తీసుకుంటుంటారు. కానీ వేలు, లక్షల్లో వేతనాలు అందుకునే ఉద్యోగుల రీ సైక్లింగ్ వ్యవహారం ద్వారా సంస్థపై పడుతున్న ఆర్థిక బారం మాత్రం గమనించరన్న చర్చ కూడా జర్నలిస్టు వర్గాల్లో సాగుతోంది. 

You cannot copy content of this page