పంచాయితీకి రూ. 30 లక్షలు… అభ్యర్థి విరాళం…

దిశ దశ, మానకొండూరు:

గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం అభ్యర్థులు శత విధాల ప్రయత్నిస్తుంటారు. గెలుపే లక్ష్యంగా సమీరణాలు నెరపడంతో పాటు గ్రామ పెద్దల మద్దతు కూడగట్టుకునేందుకు తల మునకలవుతుంటారు. అయితే ఓ పంచాయితీ అభ్యర్థి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గ్రామ అభివృద్ది కోసం తన సొంత నిధులు ఇస్తానంటూ ప్రమాణ పత్రంతో పాటు చెక్ ను పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రభావితం చేసే పనిలో నిమగ్నం అయ్యారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వెల్ది పంచాయితీ అభివృద్ది కోసం రూ. 30 లక్షలు విరాళం ఇస్తానని కోరుకంటి మధు సూధన్ రావు హామీ పత్రం అందిస్తూ గ్రామస్థుల మద్దతు కూడగట్టుకునే పనిలో పడ్డారుు. తాను విరాళంగా ప్రకటించిన డబ్బు గ్రామ అభివృద్ది కోసం వెచ్చిస్తానని, వీటితో పాటు ప్రభుత్వం నుండి కూడా మరిన్ని నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ప్రచారం చేస్తున్నారు. తనను గెలిపిస్తే అవినీతికి తావివ్వకుండా నిజాయితీతో పరిపాలన అందిస్తానని కూడా హామీ ఇస్తున్నారు కోరుకంటి మధు సూధన్ రావు. విరాళం ప్రకటించిన విషయం నెట్టింట వైరల్ అవుతుండడంతో సరికొత్త చర్చకు దారి తీసింది.