బీసీ కమీషన్ లేఖ… కలెక్టర్ ఆదేశాలు…
దిశ దశ, భూపాలపల్లి:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ‘‘రెడ్డిగాండ్ల’’ సామాజికవర్గానికి బీసీ సర్టిఫికెట్లు జారీ చేయకూడదని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశాలు జారీ చేశారు. బీసీ కమిషన్ జారీ చేసిన లేఖ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని జిల్లాలోని మీ సేవా, రెవెన్యూ కార్యాలయాల ద్వారా రెడ్డిగాండ్ల కులానికి బీసీ సర్టిఫికెట్లు ఇచ్చే ప్రక్రియను కొనసాగించవద్దని సూచించారు. గతంలో ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా కూడా కొత్త దృవీకరణ పత్రాలు కూడా ఇవ్వకూడదని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ వెనకబడిన తరగతుల కమిషన్ సభ్య కార్యదర్శి Lr.No.B2/168/2025, తేదీ: 17.01.2026న పంపిన లేఖ ఆధారంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ Rc.No.C2/58/2026, తేదీ: 20.01.2026ని విడుదల చేశారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీసీయేతరులు వెనుకబడిన తరగతుల వారిగా సర్టిఫికెట్లు పొంది సర్పంచులుగా ఎన్నికయిన విషయం తమ దృష్టికి వచ్చిందని బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి తన లేఖలో వివరించారు. ఇది రిజర్వేషన్ విధానాన్ని ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించిన బీసీ కమిషన్ గతంలో జారీ అయిన బీసీ సర్టిఫికెట్ల ఆధారంగా కొత్తగా సర్టిఫికెట్లు జారీ చేయడం కూడా నిబంధనలకు విరుద్దమని బీసీ కమిషన్ స్పష్టం చేసింది. రాష్ట్ర వెనుకబడిన కులాల జాబితాలో లేనందున రెడ్డిగాండ్ల కులానికి బీసీ సర్టిఫికెట్లు జారీ చేయకూడదని తేల్చిచెప్పింది. బీసీ కమిషన్ ఇచ్చిన లేఖ ఆధారంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తహసీల్దార్లు, మీ సేవా కేంద్రాలు తాజా ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

