కరీంనగర్ బల్దియాలో సమస్యల నజర్…
పోటాపోటీగా పొలిటికల్ పార్టీల నేతలు
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ బల్దియాలో వార్డుల విభజన ప్రక్రియ ముగిసింది. మొత్తం 66 డివిజన్లు, సరిహద్దులను కూడా అధికారికంగా ప్రకటించారు. ఎప్పుడైనా రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సమరం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీలు కార్యరంగంలోకి దూకినట్టుగా స్పష్టం అవుతోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు కరీంనగర్ కార్పోరేషన్ లో పేరుకపోయిన సమస్యలే ప్రధాన ఏజెండాగా తీసుకున్నారు. నగర అభివృద్ది కోసం అవసరమైన నిధులు కెటాయించడంతో పాటు పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ అధికారులకు వినతి పత్రాలు అందించడం మొదలు పెట్టారు.

గంగుల నేతృత్వంలో…
సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కరీంనగర్ బల్దియాలో సమస్యలను పరిష్కరించాలంటూ మంగళవారం కమిషన్ ప్రపుల్ దేశాయ్ కి వినతి పత్రం అందజేశారు. నగరంలో పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, డంప్ యార్డులో 20 ఏళ్లుగా పేరకపోయిన చెత్త సమస్యను అధిగమించేందుకు బయోమైనింగ్ ద్వారా సెగ్రిగేషన్ చేసేందుకు గతంలో ప్రయత్నించినప్పటికీ అర్థాంతరంగా ఆగిపోయిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించి బయోమైనింగ్ ప్రక్రియకు సంబంధించిన అవాంతరాలు అధిగమించాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర పట్టణాభివృద్ది సంస్థ మంత్రి కరీంనగర్ పర్యటన సందర్భంగా కరీంనగర్ డంప్ యార్డ్ సమస్యకు పరిష్కారం చూపిస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ప్రకటన చేశారని ఈ మేరకు చొరవ తీసుకోవాలన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరీంనగరాన్ని గొప్ప నగరంగా తీర్చిదిద్దేందుకు వందలాది, వేలాది కోట్లు మంజూరు చేయించామన్నారు. స్వీపింగ్ మిషన్లు, ఫాగింగ్ మిషన్లు కూడా మూలకు పడ్డాయని వాటిని బాగు చేయించి వినియోగించాలని గంగుల కమలాకర్ కోరారు. కరీంనగర్ అభ్యున్నతి కోసం తాము చేసిన ప్రతిపాదనలకు కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కి విన్నవించగా 15 రోజుల్లో అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారన్నారు. నరగంలో పెండింగ్ లో ఉన్న అన్ని పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని లేనట్టయితే తాము పోరాటం చేయాల్సి వస్తుందని మాజీ మంత్రి హెచ్చరించామని ప్రకటించారు.

మాజీ మేయర్ ఆధ్వర్యంలో…
తాజాగా బుధవారం కరీంనగర్ మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఆధర్యంలో బీజేపీ నాయకులు జిల్లా కలెక్టర్, కార్పోరేషన్ స్పెషల్ ఆఫీసర్ పమేలా సత్పతికి వినతి పత్రం అంధజేశారు. నగరంలో అసంపూర్తిగా మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని, నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని సునీల్ రావు మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 100 కోట్లు విడుదల చేసి నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీగా ప్రకటించిన తరువాత రూ. 800 కోట్లు కెటాయించిందని, అమృత్ పథకం ద్వారా రూ. 279 కోట్లు, 15వ ఫైనాన్స్ ద్వారా రూ. 100 కోట్లు కెటాయించిందని తెలిపారు. గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ కరీంనగర్ అభ్యున్నతి కోసం నిధులు కెటాయించలేదని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే అభివృద్ది జరిగిందని సునీల్ రావు ప్రకటించారు. నగరంలో 70 చోట్ల పనులు మొదలు పెట్టి అర్థాంతరంగా కాంట్రాక్టర్లు వదిలేశారని దీనివల్ల నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వానాకాలం వచ్చినందున పెండిగ్ పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయించాలన్నారు. నగరాన్ని విస్తృత పరుస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కెటాయించకపోతే బల్దియాపై భారం పడుతుందని సునీల్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.

రంగంలోకి వెలిచాల…
కాంగ్రెస్ పార్టీ తరుపున కరీంనగర్ లోకసభ ఇంఛార్జి వెలిచాల రాజేందర్ రావు కార్యరంగంలోకి దిగారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మునిసిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ని కలిశారు. కరీంనగారన్ని రాష్ట్రంలోనే మోడల్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ల సహాకరంతో అభివృద్ది విషయంలో ముందుకు వెల్తున్నామని వెలిచాల రాజేందర్ రావు అన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి కూడా కరీంనగర్ కార్పోరేషన్ లో అభివృద్ది పనులు చేపట్టే విషయంలో కృత నిశ్చయంతో ఉన్నారన్నారు. వర్షాకాలం వచ్చన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు ఏర్పడకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ ప్రపుల్ దేశాయ్ కి సూచించారు. గత ప్రభుత్వ హాయంలో నిర్మాణం మొదలు పెట్టి అర్థాంతరంగా వదిలిపెట్టిన అన్ని పనులను పూర్తి చేసేందుకు చొరవ చూపాలని, నగర వాసులకు 24 గంటల పాటు తాగు నీరు అందించే విషయంలోనూ దృష్టి సారించాలని రాజేందర్ రావు కోరారు. ఈ పనుల విషయంలో నాణ్యాతా ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. బుధవారం డంప్ యార్డును కూడా సందర్శించిన వెలిచాల రాజేందర్ రావు ఇండోర్ తరహాలో కరీంనగర్ చెత్త సమస్యను చిత్త శుద్దితో పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటామని ప్రకటించారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పరికిపండ్ల నరహరి ఇండోర్ నగరంలో చేపట్టిన చర్యలపై అధ్యయనం చేసి కరీంనగర్ డంప్ యార్డు సమస్యను శాశ్వతంగా దూరం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. డంప్ యార్డ్ విషయంలో గత ప్రభుత్వం హయాంలో తీసుకున్న చర్యలు కార్యాచరణకు నోచుకోలేదని వెలిచాల రాజేందర్ రావు విమర్శించారు.
ఎన్నికల వాతావరణం…
నిన్న మొన్నటి వరకు రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వరకే పరిమితమైన ఆయా పార్టీల నాయకులు ఇఫ్పుడు నగారాభివృద్ది కోసం నిధులు కెటాయించాలన్న డిమాండ్ చేస్తుండడం గమనార్హం. శుక్రవారం రాత్రి కరీంనగర్ బల్దియాలో డివిజన్ల విభజన ప్రక్రియ ముగిసిన తరువాత నగరంలో పెండింగ్ సమస్యల అంశంపై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు దృష్టి సారించడం గమనార్హం.

