Phone Tapping case: ఆయన రాజీనామాను ఆమోదించింది ఎవరూ..?

పోలీసు వర్గాల్లో సరికొత్త చర్చ…

దిశ దశ, హైదరాబాద్:

సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించాడని అభియోగాలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐజీ, ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విషయంలో మరో కొత్త అంశం తెరపైకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీసు వ్యవస్థ కూడా అత్యంత కీలకంగా భావించే స్పెషల్ ఇంటలీ జెన్స్ బ్యూరో (SIB) చీఫ్ గా పని చేసిన రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావు రాజీనామా చేసిన తరువాత ఏం జరిగిందన్నదే అంతు చిక్కకుండా పోతోంది. ఎన్నికల ఫలితాలకు ముందు తన బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్టుగా లేఖ రాసి అమెరికా వెల్లిపోయిన ప్రభాకర్ రావు విషయంలో ఉన్నతాధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారోనన్న విషయం కూడా తేల్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

కీలక బాధ్యతలు..?

ఉగ్రవాదులు, తీవ్రవాదుల, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని చట్టానికి పట్టించేందుకు మాత్రమే ట్యాపింగ్ చేసే సాంప్రాదాయం ఉండేది. ఈ వ్యవహారాల్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుండే SIB అత్యంత కీలకంగా వ్యవహరించింది. అత్యంత రహస్య సమాచారం సేకరించాల్సిన బాధ్యత ఈ విభాగంపై ఉండగా ఈ సమాచారాన్ని కూడా అంతే స్థాయిలో రహస్యంగా ఉంచాల్సిన ఆవశ్యకత కూడా ఈ శాఖలో పని చేసే వారిపై ఉంటుంది. అటువంటి ఈ విభాగానికి చీఫ్ గా రిటైర్డ్ పోలీస్ అధికారిని నియమించిన తీరుపై పోలీసు ఉన్నతాధికర వర్గాల్లో అప్పట్లోనే చర్చ జరిగింది. కొన్ని సందర్భాల్లో జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలతో కూడా సమన్వయం చేసుకుంటూ SIB అధికారులు ముందుకు సాగిన సందర్బాలు కూడా లేకపోలేదు. అటువంటి ఈ విభాగానికి చీఫ్ గా ఆయనను నియమించడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటీ..? అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనివల్ల భవిష్యత్తులో సవాళ్లు ఎదుర్కొవల్సి వస్తే ఎలా అన్న ఆందోళన కూడా వ్యక్తం అయింది. ముఖ్యంగా ఈ విభాగంపై అంతకుముందు రాజకీయ నాయకుల జోక్యం అంతగా ఉండకపోయేది కూడా. సంఘ విద్రోహ శక్తులు, నక్సల్స్ ఏరివేతపై ఆసక్తి ఉన్న అధికారులు మాత్రమే ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపే వారు. ఇందులో పోస్టింగ్ రావాలంటే కూడా అక్కడ పని చేస్తున్న ఉన్నతాధికారి అన్ని విధాలుగా క్రాస్ చెక్ చేసుకున్న తరువాతే అనుమతి ఇచ్చే ఆనవాయితీ కొనసాగేది. కానీ ప్రభాకర్ రావు హయంలో మాత్రం లాబీయింగ్ కే పెద్ద పీట వేసినట్టుగా స్పష్టం అవుతోంది. అనుభవం లేని అధికారులను, గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న వారిని తన విభాగంలో పోస్టింగ్ వేయించుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఎన్నికల తరువాత ఎస్ఐబీలో నెలకొన్న పరిణామాలు కూడా ఇందుకు బలాన్ని చేకూర్చాయి.

రాజీనామా ఎలా..?

అమెరికా నుండి హైదరాబద్ వచ్చిన ప్రభాకర్ రావును సిట్ ప్రత్యేకంగా విచారించింది. అయితే హార్డ్ డిస్కుల ధ్వంసంతో పాటు ఫోన్ ట్యాపింగుకు సంబంధించిన అంశాలపై సిట్ అధికారుల బృందం ఆయనను ప్రశ్నించింది. తాను పై అధికారుల సూచనల మేరకే నడుచుకున్నానని, గతంలో పని చేసిన వారు కూడా ఎస్ఐబీలో రికార్డులను ధ్వంసం చేసే వారని ప్రభాకర్ రావు వాంగ్మూలం ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. కీలకమైన ఈ విభాగానికి చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు తాను రాజీనామా చేసి అమెరికా వెల్లిపోయినట్టుగా కూడా వెల్లడించినట్టుగా తెలుస్తోంది. అయితే అప్పడాయన రాజీనామాను ఆమోదించింది ఎవరు..? SIBకి సంబంధించిన రికార్డులను, దాని బాధ్యతలను ఎవరికి అప్పగించి వెళ్లాలని సదరు పై అధికారి ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసే జరిగిందా లేక… గ్రౌండ్ లెవల్ ఆఫీసర్లు సాధారణ ఫైలుగానే పరిగణించి రాజీనామాను ఆమోదిస్తూ లేఖ విడుదల చేశారా అన్నది కూడా తేల్చాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఒక వేళ ఆపీసు సిబ్బంది రోటీన్ ఫైల్ గానే పరిగణించినట్టయితే కూడా వారు ఖచ్చితంగా తప్పు చేసినట్టే అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అత్యంత కీలకమైన SIB వ్యవహారాలు అన్ని కూడా డీజీపీ స్థాయి అధికారుల కనుసన్నల్లోనే కొనసాగుతుంటాయి. SIB చీఫ్ గా వ్యవహరించిన ప్రభాకర్ రావు రిటైర్డ్ ఐజీ కూడా కావడం, DGP కార్యాలయం నుండే రాజీనామాపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం మెండుగా ఉంటుంది. అయితే ఆయన రాజీనామా చేసిన తరువాత ఇందుకు సానుకూలత వ్యక్తం చేస్తూ ఆదేశాలు ఎవరు ఇచ్చి ఉంటారన్నది తేలాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన స్థానంలో ఇంచార్జిని నియమించారా లేక రాజీనామా చేయగానే తన బాధ్యతల నుండి ప్రభాకర్ రావు స్వచ్ఛందంగా తప్పుకుని వెల్లిపో్యారా అన్న విషయంపై కూడా సమగ్రంగా తెలుసుకోవల్సిన అవసరం ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. SIB చీఫ్ బాధ్యతల నుండి తప్పుకున్న తరువాత ఆ బాధ్యతలు ఎవరికి ఇచ్చారు..? ఇందుకు సంబంధించి ఆదేశాలు ఎవరు ఇచ్చారు అన్న విషయాలపై కూడా క్లారిటీ రావల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు నుండే SIB చీఫ్ ప్రభాకర్ లక్ష్యంగా ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలకు ముందు హుటాహుటిన రాజీనామా ఆమోదించే విషయంలో ఆచూతూచి నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందన్న విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఎలా విస్మరించారన్నదే పజిల్ గా మారింది. ఒకవేళ ప్రభాకర్ రావు రాజీనామా చేసిన తరువాత అధికారుల నిర్ణయం కోసం ఎదురు చూడకుండా బాధ్యతల నుండి తప్పుకుని వెల్లిపోయినట్టయితే దీని వెనక్ దాగి ఉన్న కుట్ర కోణం ఏంటన్నది కూడా తేల్చాల్సిన అవసరం ఉంటుంది. అత్యంత కీలకమైన విభాగానికి చీఫ్ గా పనిచేసిన అదికారి బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించి రాజీనామా లేఖ ఇచ్చేసి వెల్లిపోవడమూ సరైంది కాదన్న వాదనలు పోలీసు వర్గాల్లో వినిపిస్తున్నాయి. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన రికార్డుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరే అన్ని వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ఏది ఏమైనా పోలీసులు హార్డ్ డిస్కుల ధ్వంసం, ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారు..? అన్న విషయాలతో పాటు అసలు ప్రభాకర్ రావు రాజీనామా వ్యవహారం అప్పుడు ఎం జరిగింది అన్న కోణంలోనూ దర్యాప్తు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page