దిశ దశ, వరంగల్:
మావోయిస్టు పార్టీ కే్ంద్ర కమిటీ కార్యదర్శి ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన నంబళ్ల కేశవరావు అలియాస్ బసవరాజ్ అనుచరుడు వరంగల్ పోలీసుల ముందు లొంగిపోయాడు. దండకారణ్యంలోని వివిధ ప్రాంతాల్లో పని చేసి ప్రస్తుతం సీనియర్ డివిజన్ కమిటీ కార్యదర్శి, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ డివిజనల్ కమిటీ సభ్యుడు మంద రూబెన్ అలియాస్ కన్నన్న అలియాస్ మంగన్న అలియాస్ సురేష్ (67) మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సమక్షంలో లొంగిపోయారు. హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం వంగపాడుకు చెందిన రూబెన్ 1979లో అప్పటి ఆర్ఈసీ హాస్టల్ మెస్ లో పనిచేస్తుండే వాడు. అదే సమయంలో ఇదే కాలేజీలో చదువుకుంటున్న నంబళ్ల కేశవరావు అనచరుడిగా విప్లవ పంథాలో ముందుకు సాగాడు. 1981 నుండి 1980 వరకు లంక పాపిరెడ్డి నాయకత్వంలో కొనసాగుతున్న కుంట, బస్తర్ స్క్వాడ్ లో సభ్యునిగా, 1987లో ఏరియా కమిటీ సభ్యునిగా పని చేశాడు. 1991లో వైద్య చికిత్స కోసం వెలుతున్న క్రమంలో చత్తీస్ గడ్ పోలీసులకు చిక్కడంతో అరెస్ట్ అయ్యారు. జగ్దల్ పూర్ జైలులో రూబెన్ తో పాటు మరో ఇద్దరు నక్సల్స్ కూడా ఉండగా వీరంతా కలిసి తప్పించుకునేందుకు పథకం పన్నారు. ఏడాది పాటు జైలు జీవితం గడిపిన రూబెన్ సహచర ఖైదీలు అశోక్, రాజన్న, నందులతో కలిసి జైలు పై కప్పును తొలగించి టవల్స్, బెడ్ షీట్స్ సాయంతో కంపౌండ్ వాల్ దూకి పారిపోయి కుంట దళంలో చేరాడు. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనను ‘‘జగదల్ పూర్ జైల్ బ్రేక్’’ గా చెప్పుకునే వారు. కుంట దళం నుండి కేష్కల్ దళంలో చేరిన ఆయన 1998 వరకు పని చేశారు. ఈ ప్రాంతంలోని ఉత్తర్ బస్తర్, అభూజామఢ్ దళాల్లో పనిచేయడంతో పాటు మాఢో ఏరియా కమిటీ కూడా పని చేశాడు. 1999లో తిరిగి కుంట ఏరియా కమిటీలో జాయిన్ అయిన రూబెన్ 1999లో పోడియం భీమేను వివాహం చేసుకున్నాడు. 2005లో డివిజనల్ కమిటీ సభ్యునిగా బాధ్యలు చేపట్టిన ఆయన అనారోగ్యానికి గురి అయ్యాడు. దీంతో పార్టీని వీడాలని భావించిన ఆయన కేంద్ర కమిటీ సభ్యులు రామన్న, మల్ల రాజిరెడ్డిలతో చర్చలు జరిపారు. అయితే గుండ్రాయిలో కుటుంబ సభ్యులతో నివాసం ఉండాలని సీసీ కమిటీ బాధ్యులు సూచించడంతో ఆయన అప్పటి నుండి అక్కడే నివాసం ఉన్నాడు. ఈ సమయంలో పార్టీ వ్యవసాయ క్షేత్రాలు, కోళ్లు, గొర్రెల ఫారాల నిర్వహణ బాధ్యతలు చూసేవాడు. కిష్టారం ఏరియా కమిటీ, దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ, పీఎల్జీఏ బెటాలియన్స్, తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రతినిధులకు డెన్ కీపర్ గా వ్యవహరించారు. పలు కేసుల్లో నిందితునిగా ఉన్న రూబెన్ పార్టీలో నెలకొన్న విబేధాల కారణంగానే లొంగిపోతున్నట్టు ప్రకటించాడు. ఇతనికి రివార్డు అందజేస్తున్నామని సీపీ సన్ ప్రీత్ సింగ్ వెల్లడించారు.

సోనూ దాదా బాటలో…
మరో వైపున దండకారణ్య ప్రాంతానికి చెందిన మాఢ్ డివిజనల్ కమిటీ కార్యదర్శి రాణిత సనిత పేరిట ప్రకటన కూడా విడుదలైంది. కేంద్ర కమిటీ సభ్యుడు, పొలిట్ బ్యూరో మెంబర్ సోను దాదా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పార్టీ రూపాంతరం చెందలేకపోయిందని, సోనూ దాదా విడుదల చేసిన ప్రకటనకు తాము సానుకూలంగా ఉన్నామని వెల్లడించారు. ఈ నెల 15లోగా తాము ఆయుధాలను విడిచిపెట్టనున్నామని మాఢ్ ఏరియాలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు తావివ్వమని కూడా ప్రకటించారు. ప్రస్తుత ప్రతికూల పరిస్థితులను అర్థం చేసుకుని తమ నిర్ణయాన్ని ప్రజలు కూడా మద్దతు పలకాలని కోరారు.

