20 కిలో మీటర్ల ట్రాఫిక్ జాం…
కిక్కిరిసిన కాళేశ్వరం…
3 లక్షలకు పైగా భక్తులు…
దర్శనానికి 3 గంటల సమయం…
దిశ దశ, కాళేశ్వరం:
‘‘సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్దిర్భవతుమే సదా, పద్మపత్ర విశాలక్షి పద్మ కేసరవర్ణినీ నిత్యం పద్మాలయా దేవీ సా మాం పాతు సరస్వతి’’
ముచ్చటగా మూడో రోజున సరస్వతి నది పుష్కరాలకు లక్షలాది మంది భక్త జనం కాళేశ్వరాన్ని సందర్శించారు. శనివారం తెల్లవారు జాము నుండే వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. మద్యాహ్నం వరకూ దాదాపు 20 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం ఏకంగా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్సీ కిరణ్ ఖరేలు రంగలోకి దిగాల్సి వచ్చిందంటే కాళేశ్వరానికి ఏస్థాయిలో భక్తులు వచ్చారో అంచనా వేసుకోవచ్చు.
కిక్కిరిసిన త్రివేణి సంగమం…
కాళేశ్వరంలోని త్రివేణి సంగమం భక్త జనంతో కిక్కిరిసి పోయింది. తెల్ల వారే సరికే లక్ష మంది వరకు భక్తులు కాళేశ్వరం చేరుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణాలోని వివిధ జిల్లాలు, ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు మహదేవపూర్ మీదుగా కాళేశ్వరం చేరుకుంటుండగా, ఒడిశా, చత్తీస్ గడ్, మహారాష్ట్రతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన భక్తులు మంచిర్యాల, చెన్నూరు, సిరొంచల మీదుగా కాళేశ్వరంలోని పుష్కర ఘాట్ వద్దకు చేరుకుని పుణ్య స్నానాలు చేశారు. శుక్రవారం అర్థరాత్రి నుండి ఈదురు గాలులు బీభత్సం సృష్టించగా వరుణుడు కూడా తన ప్రతాపాన్ని చూపించాడు. దీంతో త్రివేణి సంగమానికి వెల్లే రహాదారి అంతా బురదమయం కావడంతో భక్తులు త్రివేణి సంగమానికి చేరుకోవడం ఇబ్బందికరంగా మారింది. అయితే భానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో ఉదయం 10 గంటల తరువాత రహదారి మెరుగు అయింది. జలమయమై సాక్షాత్కరించాల్సిన త్రివేణి సంగమం రద్దీ తీవ్రంగా పెరగడంతో జనమయంగా మారిపోయింది.
పితృ తర్పణాలు…
సరస్వతి అంతర్వాహిని నదికి జరుగుతున్న పుష్కరాల్లో భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేయడమే కాకుండా పితృ తర్పణాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. గతించిన తమ పూర్వీకులను స్మరించుకుంటూ వారికి పిండ ప్రధానం చేయడం అత్యంత శ్రేయస్కరమని భావిస్తుంటారు. పూర్వ కాలం నుండి కూడా పుష్కర నదీ తీరాల్లో శ్రాద్ద కర్మలు చేసే ఆనవాయితీ కొనసాగుతోంది. ఈ సమయంలో తీర్థ విధి పెట్టుకోవడం వల్ల చనిపోయిన తమ పూర్వీకుల ఆశీస్సులు తమ కుటుంబాలపై ఉంటాయని భావించి తీర్థవిధులు నిర్వహించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ షెడ్డునే నిర్మించారంటే పుష్కర నది తీరంలో పితృ తర్పణాలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అర్థం చేసుకోవచ్చు.
బారులు తీరిన భక్తులు…
సరస్వతి సన్నిధానంలో సాగుతున్న సరస్వతి పుష్కరాలు కావడంతో కాళేశ్వరానికి ఒక్క శనివారమే 3 లక్షలకు పైగా భక్తులు వచ్చారని అంచనా. త్రివేణ సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు శ్రీకాళేశ్వర, ముక్తీశ్వర స్వామి, శుభానంద దేవి, సరస్వతి అమ్మవారి ఆలయాలను దర్శించుకున్నారు. శనివారం భారీగా తరలి వచ్చిన భక్తజనంతో ఆలయాలన్ని కూడా కిక్కిరిసిపోయాయి. దీంతో ఆయా ఆలయాల్లో దైవ దర్శనాలకు దాదాపు 3 గంటల సమయం పట్టింది.
ట్రాఫిక్ జాం …
ఇకపోతే కాళేశ్వరానికి వెల్లే రహదారి అటవీ ప్రాంతం మీదుగా ఉండడంతో ఈ రోడ్ల మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలు వనాలతో పోటీ పడ్డాయన్నట్టుగా మారిపోయింది. ఏకంగా 20 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జాం కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ట్రాఫిక్ క్రమ బద్దీకరణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవల్సి వచ్చింది. మహదేవపూర్ నుండి కాళేశ్వరం ప్రధాన రహదారి 17 కిలో మీటర్లు ఉండగా రోడ్డుతో పాటు అటవీ ప్రాంతమంతా భక్తుల వాహనాలతో నిండిపోయింది. అప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టడం వల్ల కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ భక్తులకు కొంతమేర ఉపశమనం దొరికినట్టయింది. కొన్ని చోట్ల అయితే గంటకుపైగా ట్రాఫిక్ జాం అయ్యిందంటే కాళేశ్వరానికి చేరుకున్న భక్తుల సంఖ్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
టోల్ ఫ్రీ…
కాళేశ్వరానికి వస్తున్న భక్తుల నుండి వసూలు చేస్తున్న టోల్ వసూళ్లను నిలిపి వేశామని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల వాహనాల నుండి ఎలాంటి రుసుం వసూలు చేయకూడదని ఆదేశించారు.