దిశ దశ, వరంగల్:
గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ బాధ్యులపై కేసు నమోదు అయింది. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం విషయంలో ఫిర్యాదు రావడంతో ఈ మేరకు కేసు నమోదు చేశారు సుబేదారి పోలీసులు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… హన్మకొండలోని గ్రేటర్ ప్రెస్ క్లబ్ భవనానికి సంబంధించిన పాత కంపౌండ్ వాల్ కూల్చివేత క్రమంలో దాదాపు 30 ఏళ్ల క్రితం అంబేడ్కర్ కాలనీ వాసులు, స్థానికుల సహకారంతో ఏర్పాటు చేసుకున్న అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని TUWJ (143) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బంటు రాజ్ లెనిన్ ఫిర్యాదు చేశారు. 2024 డిసెంబర్ లోనే పదవి కాలం ముగిసినప్పటికీ 18 నెలలుగా ప్రెస్ క్లబ్ అభివృద్ది పేరిట పనులు కొనసాగిస్తున్నారని వివరించారు. ఈ నెల 7వ తేదిన పాత కంపౌండ్ వాల్ కూల్చివేతతో పాటు అక్కడే ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి తాళ్లు కట్టి, మెడకు ఉచ్చులా బిగించి విగ్రహాన్ని ధ్వంసం చేశారని లెనిన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి బొల్లారపు సదయ్యలతో పాటు మరో ఇద్దరు భారతరత్న బీఆర్ అంబేడ్కర్ విగ్రహా ధ్వంసానికి కారకులని తెలిపారు. ఫిర్యాదు అందుకున్న సుబేదారి పోలీసులు ఎఫ్ఐఆర్ నంబర్ 456/2025లో సెక్షన్లు 324(4), 298, 299/rw, 3 (5), BNS, 3 PDPPA, 3 (1)(1)(T), 3(1)(V), SC ST POA ACT 2015లలో కేసు నమోదు అయింది.
పరస్పర ఫిర్యాదులు…
అయితే ప్రెస్ క్లబ్ బాధ్యులు బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారన్న సమాచారం తెలిసిన తరువాత జర్నలిస్టులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహం పట్ల వ్యవహరించిన తీరుపై తమ నిరసన వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే విగ్రహ ధ్వంసంపై కొంతమంది జర్నలిస్టులు ఫిర్యాదు చేయగా, తమ అనుమతి లేకుండా ప్రెస్ క్లబ్ లోకి వచ్చారంటు ఫిర్యాదు చేశారు. అయితే ప్రెస్ క్లబ్ అధ్యక్ష్య, కార్యదర్శులు వేముల నాగరాజు, సదయ్యలపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. మరో వైపున మరికొంత మంది జర్నలిస్టులు హెచ్ఆర్సీ, ఎస్సీ కమిషన్లను కూడా ఆశ్రయించేందుకు సమాయత్తం అవుతున్నారు. ఏది ఏమైనా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో గత కొంతకాలంగా సాగుతున్న అంతర్గత విబేధాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. పదవి కాలం ముగిసిన తరువాత ఎన్నికలకు వెళ్లకుండా కాలయాపన చేస్తున్న తీరు మెజార్టీ సభ్యుల వ్యతిరేకతకు కారణమైనట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రెస్ క్లబ్ గత ఎన్నికల సమయంలో బరిలో నిలిచిన అభ్యర్థులు అలవికాని హామీలు ఇచ్చి వాటిని ఆచరణలో పెట్టలేకపోయారన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. గత ప్రెస్ క్లబ్ బాధ్యుడిగా ఉన్న శ్రీధర్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారంటూ అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసిన నిబంధనలు విస్మరించడం కూడా సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అప్పుడు ప్రెస్ క్లబ్ ఆవరణలో అద్దెకు ఇచ్చిన విషయంలో అవకతవకలు జరిగాయని, నిధులు గోల్ మాల్ అయ్యాయని కొత్తగా బాధ్యతలు తీసుకున్న కమిటీ బాధ్యులు ఆరోపణలు చేశారు. వారి తప్పిదాలను ఎత్తి చూపిన కొత్త బాధ్యులు క్రమశిక్షణతో మెలగాల్సింది పోయి ఇష్టారీతిన నడుచుకున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత పాలకవర్గంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు చేసిన వారు తమ హయాంలో పారదర్శకత పాటించకపోవడానికి కారణం ఏంటని ప్రశ్నిస్తున్న వారూ లేకపోలేదు. ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటామని చెప్పినా ఆచరణలో పెట్టలేదని, ఐడీ కార్డులు ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకి తీసుకవస్తే వర్కింగ్, నాన్ వర్కింగ్ జర్నలిస్టులు అంటూ సభ్యుత్వాలను రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ప్రెస్ క్లబ్ బాధ్యులు చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చినప్పటికీ సానుకూల ధృక్ఫథంతో వ్యవహరించలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ధ్వంసం కేసు నమోదు కావడం, వారిపై వివిధ కమిషన్లకు కూడా వెళ్లాలని నిర్ణయించడంతో గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ మరో వివాదానికి వేదికగా మారింది.

