దండకారణ్యంలో కూంబింగ్… క్లైమాక్స్ దశలో ఆపరేషన్ కగార్…

దిశ దశ, దండకారణ్యం:

మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ దశకు చేరుకున్నట్టుగా ఉంది. సరిహధ్దు అటవీ ప్రాంతాల్లో బలగాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్విరామంగా చేపట్టాయి. మావోయిస్టు పార్టీకి చెందిన మరికొంత మంది ముఖ్య నేతలతో పాటు పీఎల్జీఏ టీమ్స్, దళాలు మిగిలే ఉన్నాయన్న సమాచారం మేరకు సీఆర్పీఎఫ్ కోబ్రా, డీఆర్జీ బలగాలు రెండు మూడు రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఇటీవల జరిపిన  ఏరియల్ సర్వేలో మావోయిస్టుల షెల్టర్ జోన్ లను గుర్తించినట్టుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహధ్దుల్లోని కర్రెగుట్టలను స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నమయిన బలగాలు ఇప్పటికే రెండు ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ (FOB)లను ప్రారంభించారు. తెలంగాణాలోని ములుగు జిల్లా పామ్నూరు సమీపంలోని కర్రెగుట్టలపై సీఆర్పీఎఫ్ 39 వ బెటాలియన్ FOBని ప్రారంభించింది. చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా తడపాల సమీపంలో CRPF బెటాలియన్ 196, కోబ్రా బెటాలియన్ 204ల ఆధ్వర్యంలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. కర్రెగుట్టలతో పాటు సమీపంలోని కీకారణ్యాలను జల్లెడ పట్టినట్టయితే మావోయిస్టుల షెల్టర్ జోన్ లను స్వాధీనం చేసుకోవచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. మార్చి 31 నాటికి ఆపరేషన్ కగార్ ద్వారా మావోయిస్టుల ఏరివేత పూర్తి చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తుది దశకు చేరుకున్న ఈ సమయంలో కూంబింగ్ ఆపరేషన్లను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే రెండు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్లను వేగవంతం చేసినట్టుగా తెలుస్తోంది.

ముఖ్య నేతలు…

మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఇంకా వనాలను వీడి బాహ్య ప్రపంచలోకి రావడం లేదు. కేంద్ర కమిటీ కార్యదర్శి తిపిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, మీసాల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ తో పటు పలువురు సీసీ మెంబర్లు, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (PLGA), ఇతర మావోయిస్టు పార్టీ క్యాడర్ అంతా కూడా జనజీవనంలోకి రాకపోవడంతో వారి ఆచూకి కోసం స్పెషల్ ఆపరేషన్ ప్రారంభించినట్టుగా విశ్వసనీయ సమచారం. బీజాపూర్ జిల్లా తడపాల, జెల్ల, డొలి గ్రామాల్లోని అడవుల్లో సెర్చింగ్ ఆపరేషన్ తీవ్రతరం చేశారు.

భాగమేనా..?

తెలంగాణలో మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేసే విధానానికి స్వస్తి పలికారు. అడవుల్లో ఉన్న నక్సల్స్ జనజీవనంలోకి రావాలన్న పిలుపుతోనే ముందుకు సాగుతున్నారు. ఏ స్థాయిలో ఉన్న ముఖ్య నేతల అయినా సరే సాదారణ జీవనం గడిపే పరిస్థితులు కల్పించేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. అయితే చత్తీస్ గడ్ సరిహధ్దుల్లో మావోయిస్టుల ఏరివేత కోసం స్పెషల్ ఆపరేషన్ చేపట్టడంతో తెలంగాణ బార్డర్ జిల్లాల్లో ఇక్కడి బలగాలు అప్రమత్తం అయ్యాయి. అటవీ ప్రాంతంలో నక్సల్స్ దళాల సంచారం ఉండడంతో పాటు చత్తీస్ గడ్ సరిహధ్దుల్లో కూంబింగ్ జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోకి మావోయిస్టులు చొరబడినట్టయితే వారిని అరెస్ట్ చేయడమో లేక జనజీవనంలో చేరినట్టు ప్రకటించడమో చేయాలన్న లక్ష్యంతోనే హై అలెర్ట్ ప్రకటించి ఉంటారన్న చర్చ సాగుతోంది. గత నాలుగు రోజులుగా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో తెలంగాణకు చెందిన స్పెషల్ టీమ్స్  సరిహద్దుల్లో పహారా కాస్తున్న సంగతి తెలిసిందే.