సన్న బియ్యాన్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు..!

సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ దాడులు

దిశ దశ, పెద్దపల్లి:

రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నా అక్రమార్కులు మాత్రం తమ దందాను నిలిపివేయనట్టుగా ఉంది. దొడ్డు బియ్యాన్ని రేషన్ దుకాణాల్లోనే కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినట్టుగానే సన్న బియ్యాన్ని కూడా స్మగ్లింగ్ చేయడం ఆరంభించినట్టుగా స్పష్టం అవుతోంది. బుధవారం తెల్లవారు జామున సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ బృందం అక్రంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

మంచిర్యాల నుండి…

బుధవారం తెల్లవారు జామున పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం కాపు కాసి ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఎస్పీ శశిధర్ రాజు నేతృత్వంలోని నాలుగో టీమ్ ఇన్చార్జి ఓఎస్డీ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ సన్న బియ్యాన్ని పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. రేషన్ అక్రమ రవాణాతో సంబంధం ఉన్న వారిపై సివిల్ సప్లై యాక్టు ప్రకారం కేసులు నమోదు చేసినట్టుగా సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ ఓఎస్డీ ప్రభాకర్ తెలిపారు. లారీ నంబర్ కూడా లేకుండా దర్జాగా హైవే మీదుగా రేషన్ సన్న బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తున్న తీరు పలువురిని విస్మయ పరుస్తోంది. ఈ దాడుల్లో ఎస్ఓ లక్ష్మారెడ్డి, ఎస్సై జంగయ్య, హెడ్ కానిస్టేబుల్ శ్రీనవాస్, పీసీలు బాల్ సింగ్, శ్రీనివాసులు పాల్గొన్నారు. వీరిని టాస్క్ ఫోర్స్ కమిషనన్ డిహెచ్ చౌహన్ అభినందించారు. పేదల కోసం ప్రభుత్వం సరఫరా చేస్తున్న సన్నబియ్యాన్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారన్న విషయాన్ని మొదట్లోనే గుర్తించి పట్టుకోవడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

నాడు అటు… నేడు ఇటా..?

ఇంతకాలం రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం సరఫరా చేయగా వాటిని ఆసిఫాబాద్ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాలకు తరలించిన స్మగ్లర్లు ఇప్పుడు సన్న బియ్యం కావడంతో ఇదే రాష్ట్రంలో ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నం అయినట్టుగా తాజా ఘటన ద్వారా స్పష్టం అవుతోంది. ధర్మారం మండలంలో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం పట్టుకున్న రేషన్ బియ్యం ఎక్కడికి తరలిపోతున్నాయోనన్న విషయంపై ఆరా తీయాల్సిన అవసరం ఉంది. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ ప్రాంతాలకు తరలిస్తున్నారా లేక ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారాన్న విషయంపై విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి రానున్నాయి. అంతేకాకుండా ఇవి మంచిర్యాలలో ఎక్కడ లోడ్ అయ్యాయి. ఏ రేషన్ షాపుల ద్వారా ఇవి లారీలోకి చేరాయి అన్న వివరాలను కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. ఆదిలోనే సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ అధికారులు సన్న బియ్యం స్మగ్లింగ్ గుట్టును రట్టు చేయడంతోనే సరిపెట్టకుండా దీని వెనక ఉన్న నెట్ వర్క్ ను కూడా పట్టుకుని అరెస్ట్ చేసినట్టయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు అవకాశం ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page