దోపిడీలకు పాల్పడేందుకు నయా స్కెచ్…

అరెస్ట్ చేసిన కొత్తపల్లి పోలీసులు

దిశ దశ, కరీంనగర్:

‘‘హాయ్ అయాం పూజ’’ అంటూ ఓ వ్యక్తికి వాట్సప్ మెసెజ్ వచ్చింది… ఎవరో అమ్మాయి తన లైన్లోకి వచ్చిందని భావించిన సదరు వ్యక్తి ఆ నంబర్ కు ఛాటింగ్ చేయడం ప్రారంభించాడు. ఓ రోజు కరీంనగర్ రావాలని, నీ కోర్కెలు తీర్చుతానంటూ పూజ వాట్సప్ మెసెజ్ చేసింది. తనకు జాక్ పాట్ తగిలిందని కలలు కంటూ కరీంనగర్ చేరుకున్న ఆ యువకుడిని ట్రాప్ చేసింది ఎవరూ..? ఆ తరువాత ఏం జరిగింది..?

కోర్కెలు తీరుస్తానంటూ…

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కొత్తపల్లి పోలీసులు కొత్త తరహా దోపిడీ ముఠాను శుక్రవారం అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడ్డ ఓ ముఠా గుట్టు రట్టు చేశారు. కరీంనగర్ రూరల్ సీఐ ఏ నిరంజన్ రెడ్డి కథనం ప్రకారం… మంచిర్యాల ప్రాంతానికి చెందిన హరిబాబు అనే వ్యక్తికి ఈ నెల 6న ‘హాయ్ అయాం పూజ’ అంటూ వాట్సప్ మెసేజ్ వచ్చింది. మెసెజ్ చూసిన హరిబాబు రిప్లై ఇచ్చాడు. దీంతో పూజ పేరిట ఛాటింగ్ చేస్తున్న వ్యక్తి కరీంనగర్ కు వస్తే ‘ఆ’ కోర్కెలు తీరుస్తానంటూ మెసెజ్ చేయడంతో మే 11న హరిబాబు కరీంనగర్ చేరుకున్నాడు. తనతో ఛాటింగ్ చేసిన మొబైల్ నంబర్ కు కాల్ చేసి కరీంనగర్ వచ్చినట్టు చెప్పగా కొత్తపల్లికి రావాలని సూచించడంతో అక్కడకు చేరుకున్నాడు హరిబాబు. ఇద్దరు యువకులు బైక్ పై హరిబాబు వద్దకు వచ్చి వెళ్లాల్సిన ప్రాంతానికి రవాణా సౌకర్యం ఉండదని చెప్పి ద్విచక్క వాహనంపైనే వెల్దామని చెప్తారు. వారితో పాటు హరిబాబు కూడా బైక్ పై ఎక్కగా అతన్ని వెలిచాల గ్రామ శివార్లలోకి తీసుకెళ్లారు. అక్కడకు చేరుకున్న తరువాత బైక్ పై తీసుకెళ్లిన ఇద్దరితో పాటు అప్పటికే అక్కడ ఉన్న మరో యువకుడు హరిబాబును చిత్రహింసలకు గురి చేసి రూ. 50 వేలు ఇవ్వాలని బెదిరిస్తారు. డబ్బులు ఇవ్వనట్టయితే చంపేస్తామని హెచ్చరించడంతో భయపడిపోయిన హరిబాబు తన వద్ద ఉన్న రూ. 10 వేలు వారికి అప్పగించడంతో పాటు అతని స్నేహితులకు ఫోన్ చేసి రూ. 12 వేలు తెప్పించుకుని వారికి బదిలీ చేశాడు. బాధితుడు హరిబాబు తనకు జరిగిన అన్యాయం గురించి కొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూపీ లాగడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతకుంట శాంతి నగర్ కు చెందిన సరళ సందీప్, మల్కాపూర్ లక్ష్మీపూర్ కు చెందిన పొన్నాల ప్రణయ్ కుమార్ (18), ఎండీ రెహ్మాన్ లు తమ జల్సాల కోసం ఓ ముఠాగా ఏర్పడి అమ్మాయిల పేరిట ఛాటింగ్ చేసి దోపిడీకి పాల్పడాలని స్కెచ్ వేశారని కొత్తపల్లి పోలీసులు విచారణలో తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన సందీప్ మైనర్ గా ఉన్నప్పుడు కూడా నేర ప్రవృత్తి కలిగి ఉండడంతో అతన్ని జువైనల్ హోంకు కూడా పోలీసులు పంపించారు. కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి విభిన్న కోణాల్లో దర్యాప్తు జరిపి ఆధారాలు సేకరించడంతో కేసు చిక్కుముడి వీడింది. మహిళల పేరిట ఛాటింగ్ చేసి ముగ్గులోకి దింపి వారిని దోపిడీ చేసినా బయటకు చెప్పుకుంటే తమ పరువే పోతుందన్న భయంతో ఉంటారని… దీంతో తమ పని సులువు అవతుందని భావించిన ముగ్గురి ముఠా గుట్టును రట్టు చేయడంలో కొత్తపల్లి పోలీసులు సక్సెస్ అయ్యారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

You cannot copy content of this page