మావోయిస్టులతో సంబంధాలపై ఆరా…
దిశ దశ, దండకారణ్యం:
మావోయిస్టులతో శాంతి చర్చల అంశాన్ని తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. పీస్ కమిటీ శాంతి చర్చల కోసం కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయాలని డిమాండ్ చేస్తోంది. దండకారణ్య అటవీ ప్రాంతంలో ఆపరేషన్ కగార్ పేరిట బలగాలు మావోయిస్టులను ఏరివేసేందుకు ప్రదర్శిస్తున్న దూకుడు నేపథ్యంలో చర్చల అంశం తెరపైకి వచ్చిందని వాదిస్తున్న వారూ లేకపోలేదు. అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం ఆయుధాలు వదిలేసి జనజీవనం కలవాల్సిందేనని, మార్చి 2026 నాటికి మావోయిస్టు రహిత భారత్ నిర్మించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని పదే పదే స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర నిఘా వర్గాలు సునిశితంగా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టులతో సాన్నిహిత్యం కొనసాగించడానికి కారణమేంటీ..? ఈ వ్యవహారంలో రాయబారాలు ఎవరు నడుపుతున్నారన్న విషయాలపై ఇప్పటికే కేంద్ర హోంశాఖకు ప్రాథమిక నివేదిక చేరినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలతో టచ్ లో ఉంటున్న వారి పూర్తి వివరాలను సేకరించే పనిలో ఇంటలీజెన్స్ బ్యూరో పడినట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.
ముఖ్య నేతలు…
కేంద్ర హోంశాఖకు అందిన నివేదికలో తెలంగాణాలోని పలువురు ముఖ్య నేతలు మావోయిస్టు నాయకత్వంతో సంబంధాలు కొనసాగిస్తున్నారని పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర క్యాబినెట్ లో మంత్రిగా వ్యవహరిస్తున్న ఓ నేత మావోయిస్టు పార్టీతో సత్ సంబంధాలు కొనసాగిస్తూ రాష్ట్రంలో వారికి సానుకూల వాతావరణం ఏర్పడేందుకు తమవంతు పాత్ర పోషిస్తున్నారని గుర్తించినట్టుగా సమాచారం. రాజ్యంగాబద్దమైన బాధ్యతల్లో ఉన్న వారు ఇలా మావోయిస్టులతో రాయబారాలు కొనసాగిస్తున్న తీరుపై పూర్తి స్థాయిలో నివేదికలు తయారు చేసే పనిలో ఐబీ ప్రత్యేక బృందాలు నిమగ్నం అయినట్టుగా తెలుస్తోంది. మహారాష్ట్ర, చత్తీస్ గడ్, తెలంగాణ రాష్ట్రాలకు సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలపై సునిశితంగా పరిశీలిస్తున్న కేంద్ర నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు నివేదికలు ఢిల్లీకి పంపిస్తున్నట్టుగా సమాచారం.
నిఘా విఫలం..?
తెలంగాణాలో జరుగుతున్న కీలకమైన పరిణామాలపై ఎప్పటికప్పుడు రిపోర్ట్ చేయాల్సిన స్పెషల్ బ్రాంచ్, ఇంటలీ జెన్స్ వర్గాలు పూర్తిస్థాయిలో పనిచేయలేకపోతున్నాయన్న విషయాన్ని కూడా కేంద్ర నిఘా వర్గాలు గమనించినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టుల ఏరివేత నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరెవరితో నక్సల్స్ నేతలు సత్ సంబంధాలు కొనసాగిస్తున్నారన్న విషయాలపై దృష్టి సారించే పరిస్థితి లేకుండా పోయిందని కూడా ఈ నివేదికలో పేర్కొనట్టుగా తెలుస్తోంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మావోయిస్టులకు షెల్టర్ దొరకకుండా ఉండేవిధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన ఈ రెండు విభాగాలు పూర్తిస్థాయలో విఫలం అవుతున్నాయని కూడా కేంద్ర నిఘా వర్గాలు ఆ నివేదికలో వెల్లడించినట్టు సమాచారం. దీనివల్ల రానున్న కాలంలో తెలంగాణలో మావోయిస్టులు పట్టు బిగించే ప్రమాదం ఉందని దీనిని ఆదిలోనే కట్టడిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఐబీ వర్గాలు సూచించినట్టుగా తెలిసింది.
కలకలం…
మావోయిస్టుల విషయంలో సానుకూలతను ప్రదర్శిస్తున్న తీరుపై తాజాగా కేంద్ర నిఘావర్గాలు పంపిన నివేదికలో రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన మంత్రి, ముఖ్య నాయకుల పేర్లు ఊటంకించడం కలకలం సృష్టిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా కేంద్ర నిఘా వర్గాలు హోంశాఖకు పంపిన ఈ నివేదికలోని అంశాలు అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

