దిశ దశ, మంథని:
మేధావుల పుట్టినిల్లు… స్వాతంత్ర్యోద్యమ పోరాట స్పూర్తికి వేదికగా నిలిచిన మంథని ఇప్పుడు ఆరోపణలకు కేంద్ర బిందువుగా మారింది. మంథని అనగానే ఖండంతరాలు దాటిన చరిత్ర గురించి చర్చకు వచ్చేది. స్వాతంత్ర్య పోరాటంలో అయినా విప్లవోద్యమంలో అయినా తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్న మంత్రపురి… స్వాతంత్య్రానంతరం కూడా తన స్పెషాలిటినీ ప్రదర్శిస్తూనే ఉంది. ఘనమైన కీర్తిని మూటగట్టుకున్న మంథనికి సంబంధించిన రెండు ముఖ్య అంశాలపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేయాల్సిరావడం గమనార్హం.
వామన్ రావు…
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, పివి నాగమణిల హత్య కేసుపై సీబీఐ విచారణ చేపట్టనుంది. 2021 ఫిబ్రవరి 17న రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని కల్వచర్ల వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయింది. వామన్ రావుపై హత్యాయత్నం జరిగిన తరువాత రోడ్డుపై పడి ఉన్నప్పుడు దాడి ఎలా జరిగిందని వీడియో తీస్తున్న వ్యక్తి ఒకరు అడిగారు. తనపై ఫలానా వ్యక్తి హత్యకు పాల్పడ్డాడని వామన్ రావు చివరగా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. రామగుండం కమిషనరేట్ పోలీసులు కూడా ఈ వీడియో ఆధారంగా దర్యాప్తు చేసినట్టుగా కోర్టుకు నివేదిక అందించారు. అయితే వీడియోలో తన కొడుకు ప్రస్తావించిన వారిని విడిచిపెట్టారని హత్య వెనక కుట్ర కోణం దాగుందని వామన్ రావు తండ్రి కిషన్ రావు మీడియా ముందు వాపోయారు. అనంతరం హై కోర్టును ఆశ్రయించిగా ఆయన పిటిషన్ ను తిరస్కరించడంతో సుప్రింకోర్టులో దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ కేసుపై విచారణ చేసిన సుప్రీం కోర్టు విచారణ బాధ్యతలు సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. దీంతో ఈ కేసు విచారణ చేపట్టేంది సీబీఐ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. సెక్షన్ 120బి, 341, 302, 34 ఐపీసీలో కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ దర్యాప్తు చేపట్టేందుకు రంగం సిద్దం చేసింది. గట్టు వామన్ రావు మాట్లాడిన వీడియోలో పుట్ట మధు పేరు ప్రస్తావనకు వచ్చిందన్న విషయంపై ఫోరెన్సిక్ లాబోరేటరీ రిపోర్టులో తేలిందని కూడా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకుకు తెలిపింది. దీంతో కేసు విచారణ బాధ్యతలు సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీబీఐ ఎస్పీ భరత్ భూషన్ భట్ ఆగస్టు 25న ఎఫ్ఐఆర్ జారీ చేశారు. రామగుండం కమిషనరేట్ పోలీసులు చేపట్టిన దర్యాప్తుకు సంబంధించిన అంశాలను పరిశీలించనున్న సీబీఐ అధికారులు బృందం ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులను విచారించే అవకాశం ఉంది. అలాగే అనుమానితులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసే అవకాశం ఉండడంతో పాటు సైంటిఫిక్ ఎవిడెన్స్ లను కూడా ఎనాలిసిస్ చేయనున్నట్టుగా సమాచారం.
కాళేశ్వరం…
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు సంబంధించిన విషయంలోనూ సీబీఐ ఎంట్రీ ఇవ్వనుంది. జస్టీస్ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం అక్రమాలపై విచారణ చేపట్టేందుకు సీబీఐకి అప్పగించేందుకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మాణం చేసింది. దీంతో నేడో రేపో కాళేశ్వరం అవకతవకలపై సీబీఐ అధికారుల బృందం దర్యాప్తు చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి అధికారికంగా లేఖ అందిన తరువాత సీబీఐ అధికారులు జస్టీస్ ఘోష్ కమిషన్, సాంకేతిక నిపుణులు, తెలంగాణ విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (NDSA)లు ఇచ్చిన నివేదికలు అధ్యయనం చేయనున్నట్టుగా తెలుస్తోంది. వీటన్నటింటిన క్రోడీకరించుకుని సీబీఐ అధికారుల బృందం సాంకేతిక నిపుణుల అభిప్రాయాలు తీసుకోవడం, డ్యాంల నిర్మాణ స్థలాల ఎంపిక నుండి మొదలు నిర్మాణం పూర్తయ్యే నాటికి చేపట్టిన చర్యలు, డీపీఆర్, ఎస్టీమేట్ తదితర అంశాలపై కూడా సీబీఐ ఆరా తీసే అవకాశాలు లేకపోలేదు.
మంథనికే…
రాష్ట్రంలోకి సీబీఐ రాకూడని గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే ఉత్తర్వులను యథావిధిగా కొనసాగిస్తున్నప్పటికీ రెండు అంశాల్లో మాత్రం సీబీఐ దర్యాప్తు చేసేందుకు రాష్ట్రంలో అడుగుపెట్టనుంది. గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణ చేయాలని సుప్రీంకోర్గ్ ఆదేశించగా, కాళేశ్వరం దర్యాప్తు బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వమే సీబీఐకి బదిలీ చేసింది. దీంతో ఈ రెండు కేసుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టనుండగా రెండు అంశాలు కూడా మంథని నియోజకవర్గానికి చెందినవే కావడం గమనార్హం.

