దిశ దశ, కరీంనగర్:
దొంగతనాలకు పాల్పడుతున్న వారే కాదు… చోరీ సొత్తు కొనుగోలు చేసిన వారిపైనా క్రిమినల్ కేసులు పెడుతున్నారు. తక్కువ ధరకు వస్తుందని ఆశపడి కొన్నవారిని కూడా అరెస్ట్ చేసి తీరుతామని తేల్చి చెప్తున్నారు. అంతర్ జిల్లా దొంగతో పాటు అతని వద్ద చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశామని కరీంనగర్ సీపీ గౌష్ ఆలం వెల్లడించారు. సోమవారం కరీంనగర్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లికి చెందిన టేకు చిరంజీవి (22) గత కొంతకాలంగా ఆర్మూర్ మండలం ఏసపల్లిలో నివాసం ఉంటున్నాడు. హార్వెస్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ జల్సాలకు అలవాటు పడిన చిరంజీవి ఈజీగా మనీ సంపాదించాలని తాళం వేసిన ఇండ్లను పగటి పూట గుర్తించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. మారుతీ ఫ్రాంక్స్ కారు నంబర్ TG-16-A-7015లో సంచరిస్తూ కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్చల నడ్కుడలో ఓ ఇంట్లో 66 గ్రాముల బంగారం, కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలానికి చెందిన ఓ ఇంట్లో 5 తులాల బంగారు హారాన్ని ఎత్తుకెళ్లాడు. మానకొండూరు మండలం గంగిపల్లిలో ఒక తులం బంగారం చైను, 6 తులాల వెండి, రూ. 30 వేల నగదు దొంగలించాడు. తిమ్మాపూర్ మండలం పోరండ్లలోని మూడు ఇండ్లలో చోరీలకు పాల్పడిన చిరంజీవి 2.75 తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 1.65 లక్షల నగదు చోరీచేశాడు. చిగురుమామిడి మండలం బొమ్మనపల్లిలో బంగారం షాపుతో సహా మూడు చోట్ల చోరీకి పాల్పడి 5.5 తులాల బంగారం, 90 తులాల వెండి ఎత్తుకెళ్లాడు. గన్నేరువరం మండలం చీమలకుంటపల్లిలో చోరీకి పాల్పడి 3 తులాల బంగారం, 25 తులాల వెండిని దొంగలించాడు. దొంగలించిన బంగారాన్ని తన తండ్రి గంగ సాయిలు సహకారంతో నందిపేట సమీపంలోని కొండూరుకు చెందిన బంగారు నరసయ్య అనే వ్యక్తికి విక్రయించాడని పోలీసుల విచారణలో తేలింది. పచ్చల నడ్కుడ గ్రామంలో చోరీ చేసిన బంగారాన్ని కొనుగోలు చేసిన బంగారు నరసయ్య రూ. 1.14 లక్షలు నిందితునికి చెల్లించినట్టుగా పోలీసులు గుర్తించారు. దీంతో వ్యాపారి బంగారు నరసయ్యను కూడా అరెస్ట్ చేశామని సీపీ గౌష్ ఆలం తెలిపారు. నిందితుల నుండి 18 తులాల బంగారం, 164 తులాల వెండి, రూ లక్ష నగదు, ఒక మొబైల్ ఫోన్, చోరీలు చేసేందుకు వినియోగించిన కారు, ఇనుప రాడ్లు, గ్లౌజులు స్వాధీనం చేసుకున్నారు. చోరీ కేసులకు పాల్పడుతున్న దొంగను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్ ఏసీపీ జాన్ నర్సింహులు, సీఐలు జి సదన్ కుమార్, ప్రకాష్, ఎస్సై శ్రీకాంత్, కానిస్టేబుళ్లు నరేష్, జైపాల్, రాజశేఖర్, వేణుగోపాల్, అనీల్, అవినాష్ లను సీపీ అభినందించారు.

