బాధితుల వినూత్న నిరసన
దిశ దశ, భూపాలపల్లి:
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులోకి బర్రెలను తీసుకొచ్చారు బాధితులు. బర్రెల కోసం నిర్మించిన షెడ్డును కూల్చేయడంతో వాటికి నిలువ నీడ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటన చర్చనీయాంశంగా మారింది. బాధితుల కథనం ప్రకారం… భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని మంజూర్ నగర్ లో 30 ఏళ్లుగా బర్రెల ఫామ్ ఏర్పాటు చేసుకున్న కూరాకుల ఓదెలు, లలితలు వాటి పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ పాఠాశాలకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని బర్రెల కోసం నిర్మించిన షెడ్డును కూల్చి వేశారు అధికారులు. స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకే షెడ్డు తొలగించామని మునిసిపల్ అధికారులు చెప్పారని బాధితులు అంటున్నారు. అయితే పాఠశాల వెనక భాగంలో ఉన్న తమ ఇంటి ఆవరణలోని బర్రెల షెడ్డును కూల్చడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూర్ నగర్ లో ప్రభుత్వ పాఠశాలతో పాటు రోడ్డు కోసం భూస్వామి మోహినోద్దీన్ స్థలాన్ని ఇచ్చినప్పటికీ పాఠశాల వెనక ప్రాంతంలో ఉన్న బర్రెల షెడ్డును కూల్చివేయడం అన్యాయమని వారు వాపోయారు. రహదారి కోసం 12 ఫీట్ల మేర భూమిని భూస్వామి ఇచ్చినప్పటికీ తమ స్వంత స్థలంలోని షెడ్డును ఎలా కూల్చివేస్తారని ప్రశ్నిస్తున్నారు. తమ బర్రెల షెడ్డు నిర్మించే వరకూ కూడా వాటిని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ఆవరణలోనే ఉంచుతామని కూరాకుల ఓదెలు, లలితలు స్పష్టం చేశారు. పశువుల కొట్టాన్ని దుర్మార్గంగా కూల్చివేయించారని దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్నామని అన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని, షెడ్డు నిర్మాణం చేయించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఓదెలు, లలితలను అదుపులోకి తీసుకున్నారు.

మాజీ ఎమ్మెల్యే ఎంట్రీ…
బర్రెల షెడ్డు కూల్చివేతపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తప్పు పట్టారు. అధికార యంత్రాంగం అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్న తీరు ఆక్షేపణీయమన్నారు. పోలీసులు కూడా ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అలాంటి అధికారులు యూనిఫాం వదిలే్యాలని లేనట్టయితే విధులు సక్రమంగా నిర్వర్తించాలని గండ్ర వెంకట రమణా రెడ్డి సూచించారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న పోలీసు అధికారులు ఎమ్మెల్యే చెప్పినట్టుగా నడుచుకోవడం సరైంది కాదని, ప్రైవేటు వ్యక్తులకు చెందిన భూమిలో దౌర్జన్యంగా రోడ్డు వేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకునేందుకు బాధితులు బర్రెలను ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు తీసుకొస్తే వారిని అరెస్ట్ చేసి అర్థరాత్రి 12 గంటలకు వదిలిపెట్టడం దేనికి సంకేతమో చెప్పాలన్నారు. బాధితులకు బీఆర్ఎస్ పార్టీ తరుపున బాసటగా నిలుస్తామని వారికి అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించించిన మాజీ ఎమ్మెల్యే మునిసిపల్ అధికారుల తీరుపై కూడా అసహనం వ్యక్తం చేశారు. వెంటనే బర్రెల షెడ్డును నిర్మాణం జరిపించాలన్నారు. మునిసిపాలిటీలో జరిగిన అక్రమాల విషయంలో సరెండర్ చేయాలని అప్పటి పాలక వర్గం నిర్ణయిస్తే లాంగ్ లీవులో వెల్లిపోయిన అధికారికి తిరిగి భూపాలపల్లి మునిసిపాలిటీకి తీసుకరావడం ఎంతవరకు సమంజసమని ప్రశ్రించారు. మునిసిపల్ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని గండ్ర వెంకట రమణా రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాస్తారోకో చేపట్టి అధికారుల తీరును తప్పుబట్టారు.


