దిశ దశ, కరీంనగర్:
మునిసిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆదిక్యం ప్రదర్శించిన సందర్భాలు చాలా తక్కువే. చట్ట సభలకు ప్రతినిధిలు ఎన్నికయిన సందర్బాలు ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికల్లో బలాన్ని నిరూపించుకునేందుకు అవకాశం బీజేపీకి అంతగా రాలేదు. ఇటీవల కొన్ని కార్పొరేషన్ లలో బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తున్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదనే చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు టీడీపీతో పొత్తులో భాగంగా హైదరాబాద్ డిప్యూటీ మేయర్ స్థానాన్ని అందిపుచ్చుకున్న బీజేపీ ఇప్పటి వరకు కార్పొరేటర్లను గెలిపించుకోవడంతోనే సరిపెట్టుకుంటోంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా మెట్ పల్లి నుండి చెన్నమనేని విద్యాసాగర్ రావు ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు బీజేపీ అక్కడి మునిసిపాలిటీలో ఛైర్ పర్సన్ ను గెలిపించుకోగలిగారు. మునిసిపల్ హిస్టరీలో బీజేపీ నామమాత్రంగానే ఉనికిని చాటుకుంది తప్ప మునిసిపాలిటీలను స్వాధీనం చేసుకున్న ఘటనలు అంతంతే. గత ఎన్నికల్లో నిజామాబాద్ కార్పొరేషన్ లో 28 మందిని గెలిపించుకోవడంలో సఫలం అయిన అక్కడి ఎంపీ అరవింద్ ఈ సారి కూడా తీవ్రంగా శ్రమించినప్పటికీ అంతే మందిని గెలిపించుకోవడంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. అయితే కరీంనగర్ కార్పొరేషన్ లో మాత్రం బీజేపీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. తెలంగాణ రాష్ట్రంలో పరిపూర్ణమైన మెజార్టీతో బీజేపీ కైవసం చేసుకుని చరిత్ర రాసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ తన మార్క్ రాజకీయాలతో 66 డివిజన్లలో 30 మందిని గెలిపించుకున్నారు. ఇండిపెండెంట్లను పార్టీలో చేర్పించుకుని కరీంనగర్ లో కాషాయం జెండా ఎగురవేశారు.
మైనార్టీల ప్రభావం…
మైనార్టీల ప్రభావం తీవ్రంగా ఉండే కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుని అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుంది. ఎంఐఎం మద్దతు లేకుండా కరీంనగర్ లో జెండా ఎగురవేయడం కష్టమేనన్న అభిప్రాయంతో ఉన్నా బీజేపీ మాత్రం ఒంటరిపోరు చేసి కరీంనగర్ కార్పొరేషన్ పై కాషాయం జెండా ఎగురేసింది. మునిసిపల్ ఛైర్మన్ కు ప్రత్యక్షంగా జరిగిన ఎన్నికల్లో ఓ సారి ఎంఐఎం అభ్యర్థి రెండో స్థానంలో నిలిచారంటే ఇక్కడ మైనారీటల ప్రభావం ఏస్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓఢించి కార్పొరేషన్ ఎన్నికల్లో విజయ దుందిభి మోగించిన తీరు తెలంగాణ బీజేపీ హిస్టరీలో కొత్త రికార్డ్ క్రియేట్ చేసినట్టయింది.

