ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్… రివ్యూ కమిటీ అనుమతి ఇచ్చిందా..?

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభాకర్ రావు కేంద్రీకృతంగానే ఈ తంతు సాగిందని విచారణ అధికారుల దర్యాప్తులో తేలినప్పటికీ ఆయన కోర్టుకు సమర్పించిన పిటిషన్ అత్యంత కీలకంగా మారిందని చెప్పాలి. ఆ పిటిషన్ లో పేర్కొన్న అంశాలను కూడా అధ్యయనం చేస్తున్న దర్యాప్తు బృందం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ప్రభాకర్ కోర్టులో సమర్పించిన పిటిషన్ లో రివ్యూ కమిటీ ఆమోదంతోనే ట్యాపింగ్ రికార్డులు ధ్వంసం చేశానని పేర్కొనడం గమనార్హం. దీంతో రివ్యూ కమిటీలో ఉన్న అధికారుల నుండి కూడా వాంగ్మూలాలు తీసుకునే పనిలో దర్యాప్తు అధికారుల బృందం ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పని చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగం (GAD) కార్యదర్శులు రివ్యూ కమిటీలో ఉన్నారు. వీరిని విచారించేందుకు దర్యాప్తు అధికారుల బృందం రంగం సిద్దం చేసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఇప్పటి వరకు కేవలం పోలీసు విభాగం, ఓ మీడియా సంస్థ ఎండీకే పరిమితం అయిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సీనియర్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ల వరకు చేరడం విశేషం. రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, ఎస్ఐబీలో ఓఎస్డీగా పనిచేసిన ప్రభాకర్ రావు కోర్టులో వేసిన పిటిషన్ ఆదారంగానే దర్యాప్తు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

అదెలా సాధ్యం..?

ఎస్ఐబీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (OSD)గా బాధ్యతలు నిర్వర్తించిన ప్రభాకర్ రావుకు కీలకమైన బాధ్యతలు అప్పగించడం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయిందని పోలీసు అధికారుల్లో జరుగుతున్న చర్చ. అయితే రిటైర్డ్ అధికారికి కీలకమైన వ్యవహారాలను చక్కబెట్టేందుకు బాధ్యతలు అప్పగించినప్పటికీ ఆ స్థాయిలో కేవలం వారం రోజుల పాటు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేసే అధికారం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ చాలా రోజుల పాటు రాజకీయ నాయకులు, న్యాయ మూర్తులకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేయడం ఎలా సాధ్యం అయిందన్నదే అంతుచిక్కకుండా పోయింది. 7 రోజులకు మించి ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన రివ్యూ కమిటీ అనుమతి తీసుకోవల్సి ఉంటుంది. అయితే ప్రభాకర్ రావు పిటిషన్ ను బట్టి అయితే రివ్యూ కమిటీ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు… అదే నిజమైతే రివ్యూ కమిటీలోని అధికారులు ఇచ్చే వాంగ్మూలాలు, ఆయా కార్యాలయాల్లో లభ్యం అయ్యే లేఖలు కీలకంగా మారే అవకాశం ఉంటుంది. ప్రబాకర్ రావు తెలిపిన వివరాలను బట్టి 2023 డిసెంబర్ లో ట్యాపింగ్ చేసిన రికార్డులను ధ్వంసం చేశామని మాత్రమే పేర్కొన్నట్టయితే ఏఏ నంబర్లు ట్యాపింగ్ చేయాల్సి ఉంది..? ఆ ఫోన్ నంబర్ల వివరాలతో కూడిన లేఖను రివ్యూ కమిటీకి పంపించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో SIB కార్యాలయం నుండి పంపిన లేఖలు లభ్యం అయినట్టయితే ఎవరెవరి కాంటాక్టు నంబర్లు ట్యాప్ చేశారోనన్న విషయంపై స్పష్టత వస్తాయన్న యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక వేళ రివ్యూ కమిటీ అనుమతి లేకుండానే ట్యాపింగ్ చేసినట్టయితే ఇందుకు బాధ్యులుగా ప్రభాకర్ రావును చేసే అవకాశం పక్కాగా ఉంటుందని తెలుస్తోంది. ఒకవేళ రివ్యూ కమిటీతో సంబంధం లేకుండా కొంతమంది కాంటాక్టు నంబర్లను ట్యాప్ చేయడానికి ట్రాయ్ కానీ, సర్వీస్ ప్రొవైడర్లు కానీ తెలంగాణ పోలీసు అధికారులు ఎలా సహకరించాయి అన్న విషయంపై కూడా ఆరా తీయాల్సి రానుంది. ట్రాయ్, సర్వీస్ ప్రొవైడర్లతో సంబంధం లేకుండానే విదేశాల నుండి తెప్పించిన ప్రత్యేకమైన డివైజెస్ ఏమైనా వినియోగించినట్టయితే అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణించే అవకాశాలు లేకపోలేదు. మరో వైపున TRAI కానీ సర్వీస్ ప్రొవైడర్ల సహకారంతో ట్యాపింగ్ చేసినట్టయితే అక్కడ కూడా ట్యాపింగ్ కు సంబంధించిన డాటా ఉండే అవకాశం కూడా లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెయిల్స్ ద్వారా కానీ, ఇతరాత్రా మార్గాల ద్వారా కానీ ట్యాపింగ్ కోసం అనుమతులు తీసుకున్నా, TRAI లేదా సర్వీస్ ప్రొవైడర్ల సహకారం తీసుకున్న వాటిని రికవరీ సాఫ్ట్ వేర్ ద్వారా కూడా రికవరీ చేసే అవకాశాలతో పాటు సంబంధిత మెయిల్ కంపెనీల సహకారం ద్వారా కూడా డాచా సేకరించే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. అయితే TRAI, సర్వీస్ ప్రొవైడర్లు సహకరించినట్టయితే ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారిని కూడా బాధ్యులుగా చేయాల్సిన పరిస్థితి కూడా దర్యాప్తు అధికారుల ముందు ఉంటుంది. రివ్యూ కమిటీ సిఫార్సులకు అనుగుణంగానే నడుచుకున్నారా లేక లోపాయికారిగా సహకరించారా అన్న విషయం తేల్చేందుకు కూడా దర్యాప్తు అధికారులు రంగంలోకి దిగాల్సిన ఆవశ్యకత కూడా ఉంటుందని తెలుస్తోంది. మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిట్రైవ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ అవే మొబైల్స్ ఇప్పటికీ వాడే అవకాశం అయితే ఉండకపోవచ్చని దీనివల్ల కీలకమైన ఆధారాలు లభ్యం అయ్యే అవకాశాలు అంతగా లేవన్న సమాలోచనలు కూడా దర్యాప్తు అధికారులు చేసినట్టుగా తెలుస్తోంది.

సంఘ విద్రోహ శక్తులా..?

ఒకవేళ తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కాంటాక్టు నెంబర్ల డాటా దొరికితే మాత్రం బాధ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేసులో ఇరుక్కోక తప్పని పరిస్థితులే ఉంటాయి. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుపుతున్న అధికారులు అరెస్ట్ అయిన పోలీసు అధికారులు, మీడియా సంస్థ ఎండీ శ్రవణ్ రావుల వాంగ్మూలాల ఆధారంగానే దర్యాప్తు చేస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. ప్రభాకర్ రావును స్వస్థలానికి రప్పిస్తే కీలకమైన అంశాలు బయట పడుతాయని అంచనా వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన ఇచ్చే వాంగ్మూలం ద్వారా మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్టుగా విచారణ అధికారుల తీరును బట్టి అర్థం అవుతోంది. ఒక వేళ ట్యాపింగ్ చేసిన కాంటాక్టు నంబర్లు దొరికితే మాత్రం ఆ నెంబర్లు ఎవరివి..? వారు సంఘ విద్రోహ శక్తులా కాదా అన్న విషయంపై స్ఫష్టమైన నివేదిక కూడా కోర్టు ముందు ఉంచనున్నారు. సాధారణ వ్యక్తులకు సంబంధించిన నంబర్లు ఆ జాబితాలో ఉన్నట్టయితే మాత్రం కఠినమైన చట్టాలు అమలు చేసే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

You cannot copy content of this page