దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీలో న్యాయ కళాశాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతి లభించింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏప్రిల్ 1వ తేదిన కేంద్ర న్యాయ శాఖామంత్రి అర్జున్ రామ్ మెఘావాల్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, శాతవాహన వైస్ ఛాన్సలర్ ఉమేష్ కుమార్, కరీంనగర్ మాజీ మేయర్ వై సునీల్ రావులు కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం శాతవాహనలో లా కాలేజీ అనుమతికి ఇస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు రాలేదు. దీంతో ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి అనుమతి ఇచ్చినట్టయితే కరీంనగర్ శాతవాహన పరిధిలోని పట్టభద్రులు లా కాలేజీలో చదువుకునే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రిని అభ్యర్థించారు. రానున్న విద్యా సంవత్సరంలో 120 మంది విద్యార్థులు లా చదువుకునేందుకు అనుమతి ఇప్పించాలని తాను గతంలోనే కోరిన విషయాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి బండి సంజయ్ గుర్తుచేశారు. వర్చువల్ ద్వారా శాతవాహన లా కాలేజీలో లా కోర్సు ప్రవేశపెట్టే విషయంలో తనఖీ చేపట్టిందని, ఇందుకు సంబంధించిన సమగ్ర వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని సూచించినట్టుగా వివరించారు. బార్ కౌన్సిల్ చెప్పినట్టుగా వివరణాత్మకమైన నివేదికను కూడా పంపించామని అనుమతి ఇవ్వడమే తరువాయి అని కేంద్ర న్యాయశాఖ మంత్రికి బండి సంజయ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసి రానున్న విద్యా సంవత్సరంలో కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీలో లా కోర్సులను ప్రారంభించేందుకు వేగవంతంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈనెల 5న ఉత్తర్వులు జారీ చేసింది. శాతవాహనలో 3 ఏళ్ల లా కోర్సు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వడంతో పాటు 2025-27 సంవత్సరం మూడేళ్ల కోర్సులో 60 సీట్ల చొప్పున రెండు సెక్షన్లలో కాలేజీ నిర్వహించుకోవచ్చని తెలిపింది. ఇందులో భాగంగా శాతవాహన లా కాలేజీలో స్మార్ట్ తరగతి గదులు, ప్రొఫెసర్ల నియామకం, మోడ్రన్ లైబ్రరీ, ఈ జర్నల్స్, స్మార్ట్ ఇన్ ఫ్రాస్టక్చర్స్ ను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటి వరకు కరీంనగర్ లో ప్రైవేటు లా కాలేజీలపైనే ఆధారపడడమో లేక ఉస్మానియా, కాకతీయ యూనివర్శిటీలలో చదువుకోవల్సిన పరిస్థితులు ఉండేవి. తాజాగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన అనుమతి ఇవ్వడంతో శాతవాహన పరిధిలోని ఆయా జిల్లాలకు చెందిన వారు ఇక్కడే న్యాయ శాస్త్ర విద్యను అభ్యసిించే అవకాశం లభించినట్టయింది.