అరెస్ట్… విడుదల… కౌశిక్ రెడ్డి విషయంలో అనూహ్య పరిణామాలు…

దిశ దశ, హుజురాబాద్:

హుజురాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం, కోర్టులు వెంటనే బెయిల్ మంజూరు చేయడం చకాచకా జరిగిపోతున్నాయి. ఆరు నెలల్లో రెండు సార్లు అరెస్ట్ అయిన కౌశిక్ రెడ్డి విషయంలో ఒకేరకమైన ఫలితాలు రావడం చర్చనీయాంశంగా మారింది.

నాడు అలా…

కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురి మధ్య నెలకొన్న పరిణామాలు కాస్తా సమావేశాన్ని రసాభసాగా మార్చేశాయి. దీంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కౌశిక్ రెడ్డిని సమావేశం నుండి బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆయనపై కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు మూడు ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసిన పోలీసులు జనవరి 12న హైదరాబాద్ లోని ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో నుండి బయటకు వస్తుండగా కరీంనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుటాహుటిన కరీనంగర్ త్రీ టౌన్ కు తరలించిన పోలీసులు ఆయనకు అక్కడే బస ఏర్పాటు చేశారు. మరునాడు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కరీంనగర్ కోర్టులో హాజరు పర్చగా వ్యక్తిగత పూచికత్తుపై బెయిల్ వచ్చింది. దీంతో ఆయన జ్యుడిషియల్ రిమాండ్ కు తరలిస్తారన్న ఉహాగానాలకు తెరపడింది. కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పీఏ గిరి ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు. అయితే కోర్టు రిమాండ్ రిపోర్టును తిరస్కరించి బెయిల్ మంజూరు చేయడంతో ఆయన వెంటనే బయటకు వచ్చేశారు.

తాజాగా…

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని గ్రానైట్ క్వారీ యజమాని మనోజ్ రెడ్డిని బెదిరింపులకు గురి చేస్తున్నారని, రూ. 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్న ఫిర్యాదు మేరకు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై వరంగల్ కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని, బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభ ఉందని కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా సభ ముగిసే వరకు అరెస్ట్ చేయవద్దని, పోలీసులు యధావిధిగా విచారణ జరుపుకోవచ్చని ఆదేశించింది. తిరిగి ఇటీవల విచారించిన కోర్టు ఆయన అరెస్టును నిలిపివేయాలని ఆదేశించలేమని వెల్లడించడంతో పోలీసులు శనివారం తెల్లవారు జామున శంషాబాద్ ఎయిర్ పోర్టులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి వరంగల్ కు తరలించారు. శనివారం సాయంత్రం కాజీపేట రైల్వే కోర్టులో అతన్ని హజరు పర్చగా ముందుగా జ్యుడిషియల్ రిమాండ్ విధించిన కోర్టు, ఆ తరువాత బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీమ్ వాదనలు వింది. అనంతరం బెయిల్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో రెండో సారి కూడా కౌశిక్ రెడ్డి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించకముందే బెయిల్ అందుకున్నారు.

రాజకీయ రంగు…

అధికార కాంగ్రెస్ పార్టీ కావాలనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసులు బనాయిస్తోందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అరెస్ట్ చేసేందుకు వెల్లిన పోలీసుల ముందు కూడా కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాగరాజులపై ఆరోపణలు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కేసుల పరంపర కొనసాగినప్పుడు, అరెస్ట్ అవుతున్న ప్రతిసారి కూడా రాజకీయ రంగు అంటుకుంటోంది. ఏది ఏమైనా పోలీసులు అరెస్ట్ చేసిన కౌశిక్ రెడ్డిని కోర్టు మెట్లు ఎక్కించడం ఆ తరువాత కోర్టు బెయిల్ ఇస్తుండడం గమనార్హం. వరసగా రెండు సార్లు కూడా ఇదే పరిస్థితి ఎదురు కావడం గమనార్హం.