మామూళ్ల ‘‘మత్తు’’లో ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్: ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు…

దిశ దశ, కరీంనగర్:

అక్రమ మార్గాల ద్వారా లంచాలు తీసుకున్నా వదిలేది లేదని ఏసీబీ అధికారులు తేల్చి చెప్తున్నారు. లంచం కోసం అర్రులు చాచిన ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండెటి రాముపై మరో కేసు కూడా నమోదు చేశారు. అడ్డదారుల గుండా లంచాలు తీసుకుంటున్న ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ను ఇప్పటికే అరెస్ట్ చేయగా తాజాగా ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు కూడా నమోదు చేశారు. మార్చి 17న ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాముపై Criminal misconduct కేసు నమోదు చేశారు. ఓ బెల్లం వ్యాపారి నుండి తన స్నేహితుడైన ప్రభుత్వ టీటర్ ఖాతాలకు UPI ద్వారా లంచం నగదు బదిలీ చేయించుకున్నాడు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న కరీంనగర్ రేంజ్ ఏసీబీ అధికారులు అతనితో పాటు ఒబులాపూర్ లో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పని చేస్తున్న జక్కని వేణులపై కేసు నమోదు చేశారు. 2022 నుండి 2024 వరకు జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించి ఇద్దరిని అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరిచారు.

ఆదాయానికి మించి…

తాజాగా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ గుండేటి రాముపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు కూడా నమోదు చేశామని ఏసీబీ అధికారులు వెల్లడించారు. రాము జగిత్యాలలో అద్దెకు ఉంటున్న ఇంట్లో సోదాలు జరపగా రూ. 20,67,850 నగదు లభ్యం కాగా, ఆయనకు చెందిన SBI ఖాతాలో రూ. 29,88,317 , ఆయన తండ్రి శంకర్ UBI ఖాతాలో రూ. 16,77,978, రూ. 11,97,000 విలువైన వస్తువులు, కరీంనగర్ లో రూ. 6,05,000 విలువైన ఒక ఖాళీ స్థలం, సిరిసిల్లలో రూ. 2,18,484 విలువైన వాణిజ్య భూమి, మొత్తం రూ. 87,44,629 విలువైన ఆస్తులు, నగదును గుర్తించారు ఏసీబీ అధికారులు. స్థిరాస్థుల విలువ బహిరంగ మార్కెట్ లో అంతకన్న ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే గుండేటి రాముకు సంబంధించిన ఆస్తులతో పాటు చరస్థుల గురించి ఇంకా సోదాలు నిర్వహిస్తున్నామని ఏసీబీ అధికారులు ప్రకటించారు.