పోలీసుల్లో సాగుతున్న చర్చ
దిశ దశ, కరీంనగర్:
పోలీసు అధికార యంత్రాంగానికి సంబంధించిన ఆర్థిక వ్యవహరాలు, శాఖపరమైన చర్యలకు సంబంధించిన అంశాలకు సంబంధించిన ఫైళ్లు పర్యవేక్షించాల్సిన అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఉద్యోగులు పాతుకపోవడానికి కారణమేంటీ..? ప్రతి చోట రెండేళ్లకోసారి బదిలీల ప్రక్రియ సాగుతుంటే పోలీసు విభాగంలోని అడ్మినిస్ట్రేటివ్ వింగ్ లో మాత్రం అమలు కావడం లేదెందుకు..? ఒకేచోట లాంగ్ స్టాండింగ్ పని చేయడం వల్ల వారి ఇష్టారాజ్యంగా మారిపోయిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రతి విషయంలోనూ…
పొలీసు అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కదలాల్సిన ప్రతి ఫైల్ విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తారన్న ఆరోపణలు లేకపోలేదు. ప్రమోషన్ల ఫైళ్లే అయినా… ఇంక్రిమెంట్ల విషయమే అయినా, టీఏ, డీఏ ఇలా ప్రతి విషయంలో అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో పని చేసే యంత్రాంగం సిబ్బందిని ఇబ్బందులకు గురి చేస్తారన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడ పని చేసే సిబ్బంది ప్రాపకం పొందేందుకు కిందిస్థాయి ఉద్యోగులే కాదు అధికారులు కూడా శ్రమించాల్సిన సందర్భాలు లేకపోలేదు. LPC చేయాలన్నా, అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన మెడికల్ రియంబర్స్ మెంట్ తీసుకోవాలన్న పరిపాలన కార్యాలయం సిబ్బంది చుక్కలు చూపిస్తారన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో పోలీసు అధికారులు ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకుని బిల్లులు మంజూరు చేయించుకున్న సందర్భాలూ ఉన్నాయి. అయితే ఎస్సై ఆపై స్థాయి అధికారులు ఉన్నతాధికారులకు వినతి చేసుకునే పరిస్థితులు ఉంటాయి కానీ సాధారణ కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
లాంగ్ స్టాండింగ్…
వాస్తవంగా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లలో ఉన్న అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల్లో పని చేస్తున్న యంత్రాంగం అంతా కూడా సుదీర్ఘ కాలంగా ఒకే చోట పనిచేస్తున్నారని దీంతో వారు ఏం చేసినా చెల్లుతుందన్న వాదనలు పోలీసు విభాగంలో వినిపిస్తున్నాయి. జిల్లా లేదా కమిషనరేట్ కేంద్రాల్లో మాత్రమే ఉండే పరిపాలన కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు బదిలీలు జరగడం అన్నదే ఉండదన్నట్టుగా మారిపోయింది. దీంతో ఒకేచోట పాతుకపోయిన ఉద్యోగులు తాము ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతో విధులు నిర్వర్తిస్తున్నారన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. ఉమ్మడి జిల్లాలుగా ఉన్నప్పుడు బదిలీల ఊసేత్తలేదని ఇప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోందన్న ఆందోళన కనిపిస్తోంది. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ తరువాత కూడా అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల్లో పని చేస్తున్న వారికి స్థాన చలనం కల్పించడంపై అధికారులు దృష్టి సారించడం లేదు. రాష్ట్రంలో కొత్త జోన్లు, కొత్త జిల్లాల ఆవిర్భావం తరువాత హోంగార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల్లో పని చేసే వారి విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చారా అన్న చర్చ సాగుతోంది. ఏఆర్, లా అండ్ ఆర్డర్ ఇలా ప్రతి విభాగంలో పనిచేసే వారికి ప్రతి రెండేళ్ల కోసారి బదిలీలు చేసే ప్రక్రియ కొనసాగిస్తున్న నేపథ్యంలో అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయాల్లో పని చేస్తున్న AOల నుండి మినిస్టీరియల్ స్టాఫ్ కు కూడా బదిలీలు జరిపితే బావుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసుల్లోని సెక్షన్లను కూడా మార్చే పరిస్థితి లేకుండా పోయిందని దీంతో ఆయా సెక్షన్లను పట్టుకుని వేలాడుతున్న వారి ఇష్టారాజ్యం అన్నట్టుగా తయారైందన్న విమర్శలు కూడా ఉన్నాయి.