దిశ దశ, జగిత్యాల:
అనూహ్య పరిణామాల నేపథ్యంలో మంత్రివర్గంలో అవకాశం దక్కించుకున్న ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంతర్మథనం చెందుతున్నట్టుగా తెలుస్తోంది. విద్యార్థి దశ నుండి కాంగ్రెస్ పార్టీతోనే అనుబంధం పెనవేసుకున్న తన పట్ల సహచర మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై చాలా రోజులుగా మధనపడిపోతున్నట్టుగా సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జడ్పీ ఛైర్మన్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా మంత్రివర్గంలో చోటు దక్కింది. అయితే ఆయన బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి కూడా ఒకరిద్దరు సహచర మంత్రుల నుండి ఎదుర్కొన్న పరాభవాలను గమనిస్తూ అంతర్మథనానికి గురవుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగిన మీడియా సమావేశంలో ‘‘దున్నపోతు’’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించడం, మరో మంత్రి వివేక్ వెల్లిపోతానన్న విషయంపై బాహాటంగా తన ఆవేదనను వ్యక్తం చేయడానికి గతంలో జరిగిన ఘటనలు కూడా ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇంతకాలం పట్టించుకోనట్టుగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన ఆక్రందనను బయటకు చెప్పక తప్పని పరిస్థితుల్లోనే వీడియో విడుదల చేసినట్టుగా అర్థం అవుతోంది. అయితే అత్యంత సన్నిహితులతో ఆయన జరిపిన చర్చల సారాంశాన్ని బట్టి మాత్రం పీసీసీ చీఫ్ కు తనపై జరిగిన వివక్షకు సంబంధించిన ప్రతి విషయాన్ని వివరించేందుకు మంత్రి అడ్లూరి సమాయత్తం అయినట్టుగా తెలుస్తోంది. సెప్టెంబర్ 17న కరీంనగర్ లో జాతీయ జెండా ఎగుర వేసేందుకు లక్ష్మణ్ కుమార్ కు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. దీంతో ఆయన కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జాతీయ జెండా ఎగురవేయాల్సి వచ్చింది. అంతకుముందు కరీంనగర్ శాతవాహన యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో మంత్రిగా అడ్లూరికి అవకాశం కల్పించకపోవడంపై దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. కరీంనగర్ లో తాను పట్టు బిగిస్తున్నానన్న ఉద్దేశ్యంతో తనను అవమానాలకు గురి చేశారని లక్ష్మణ్ కుమార్ ఆవేదనతో ఉన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా సహచర మంత్రిగా ఉన్న మరో మంత్రి కనీసం తనకు శుభాకాంక్షలు తెలపలేదని, షేక్ హైండ్ కూడా ఇవ్వలేదంటే తనను ఏ స్థాయిలో వివక్షకు గురి చేస్తున్నారో అర్థం చేసుకోవాలని అడ్లూరి వ్యాఖ్యానించినట్టుగా సమాచారం.
పీసీసీ చీఫ్…
రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి అడ్లూరికి అండగా ఆందోళనలు మొదలయ్యాయి. దళిత సంఘాలు, గిరిజన సంఘాలన్ని కూడా లక్ష్మణ్ కుమార్ కు బాసటగా నిలవడంతో పాటు పొన్నం ప్రభాకర్ ను మంత్రి వర్గం నుండి తొలగించాలని కూడా డిమాండ్ చేశాయి. రాష్ట్రంలో రచ్చ రచ్చగా మారిన ఈ విషయానికి బ్రేకులు వేయాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఆయన మంత్రలతో మాట్లాడారు. అయితే బుధవారం నార్సింగిలోని తన ఇంట్లో మంత్రులిద్దరితో భేటీ అయి సమస్యకు పరిష్కారం చూపించాలని నిర్ణయించారు. అయితే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తన పట్ల చూపుతున్న నిరాదరణ విషయాన్ని పీసీసీ చీఫ్ కు వివరించిన తరువాత ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది తేలాల్సి ఉంది. నివురుగప్పిన నిప్పులా ఇంతకాలం ఉన్న ఈ విషయం ‘‘దున్నపోతు’’ వ్యాఖ్యలతో బట్ట బయలు కావడంతో గతంలోని అంశాలను కూడా పీసీసీ చీఫ్ పరిగణనలోకి తీసుకుని ఇరువురు మంత్రులను బుజ్జగించి సద్దుమణిగేలా చేస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది. అయితే అధిష్టానం ఆదేశాల మేరకు సరే అని ఇద్దరూ ఒప్పుకున్నప్పటికీ భవిష్యత్తులో వీరిద్దరి మధ్య సమన్వయం ఉండేలా అధిష్టానం సయోధ్య కుదర్చాల్సిన అవసరం కూడా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కాబట్టి తరుచూ కలుసుకునే అవకాశాలు ఉంటాయని వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఇలాగే కొనసాగితే ఎడమొఖం పెడమొఖంగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెల్తాయని అంటున్న వారూ లేకపోలేదు.