బీఆర్ఎస్ లో ఉండడమా… కాంగ్రెస్ లో చేరడమా..? సందిగ్దంలో సంజయ్ అనుచరులు…

దిశ దశ, జగిత్యాల:

స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఆ నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు సందిగ్దంలో కొట్టుమిట్టాడుతున్నారు. నమ్ముకున్న నాయకుడి వెంట వెలితే అవకాశం దక్కుతుందా..? పూర్వ పార్టీలో కొనసాగితే గుర్తింపు లభిస్తుందా అన్న సంశయంలో కాలం వెల్లదీస్తున్నారు.

జగిత్యాల ఖిల్లాలో…

జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయనపై ఫిరాయింపుల చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో తాము చేరలేదని బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాయని ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు. అసెంబ్లీలో ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితవ్యం ఎలా ఉంటుందో ఏమో కానీ తమ భవిష్యత్తు ఏంటన్నదే అంతుచిక్కకుండా పోతోందోన్న ఆందోళన ద్వితీయ శ్రేణి నాయకుల్లో నెలకొంది. ఇంతకాలం కొనసాగిన బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ నాయకత్వం తమను పూర్తి స్థాయిలో విశ్వసించే అవకాశం లేదన్న వేదన కూడా వారిని వెంటాడుతోంది. ఇప్పటికే జగిత్యాల రూరల్ మాజీ ఎంపీపీ రాజును పార్టీ నుండి సస్పెండ్ చేయడంతో తమ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారనుందా అన్న చర్చ మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్గంగా ముద్ర పడిన తమకు గులాభి పార్టీ గుర్తించి టికెట్లు ఇస్తారా లేక పక్కన పెడతారా అన్న తర్జనభర్జన పడుతున్నారు చాలామంది నాయకులు.

కాంగ్రెస్ పార్టీ…

ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి కూడా తమకు ఆశాజనకంగా ఉంటుందా లేదా అన్న మీమాంస కూడా వారిని వెంటాడుతోంది. సీనియర్ నేత తాటిపర్తి జీవన్ రెడ్డి తన అనుచరులకే టికెట్ల ఇప్పించుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఇంతకాలం పార్టీతో అనుబంధం పెనవేసుకుని ఉన్న వారిని కాదని కొత్త వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులను కూడా బాహాటంగానే వ్యతిరేకిస్తున్న జీవన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన వర్గానికే ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని అధిష్టానంపై ఒత్తిడి తీసుకవచ్చే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని తప్పుపట్టిన ఆయన లోకల్ బాడీ ఎన్నికల్లో తన పట్టు నిలుపుకునే అవకాశాలు లేకపోలేదు. తన అనుచర వర్గానికి ప్రాధాన్యత ఇవ్వనట్టయితే పార్టీ ముఖ్య నాయకత్వంతో అమీతుమీకి సిద్దమయ్యే పరిస్థితులే మెండుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే అనుచరులుగా ఉంటున్న తమ భవితవ్యం ఏంటన్నదే మిస్టరీగా మారిపోయిందని మదనపడిపోతున్నారు సెకండ్ క్యాడర్ లీడర్లు.

సంజయ్ పైనే భారం…

తమ ఆశలన్ని కూడా డాక్టర్ సంజయ్ పైనే ఉన్నాయని ఆయన ఎలాంటి నిర్ణయం తీసకుంటురన్నాదే తేలాల్సి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఆయన అనుచరుల్లో. సొంతపార్టీలో ఇమడలేక, కొత్త పార్టీలో చేరే పరిస్థితులు కానరాకపోవడంతో తాము ఎలా ముందుకు వెళ్లాలోనన్నదే అంతుచిక్కకుండా పోతోందన్న చర్చ కూడా సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా అని కొట్టుమిట్టాడుతున్న నాయకులు ఎమ్మెల్యే సంజయ్ పైనే భారం వేసినట్టుగా తెలుస్తోంది.

BRS NEWSCongressJAGITIAL NEWSLocal Body ElectionsT JEEVAN REDDY