న్యాయం చేయాలంటున్న భార్య… రికార్డుల్లో చంపేసిందంటున్న భర్త…

కరీంనగర్ ప్రజా వాణిలో వైవిద్యమైన ఘటన…

దిశ దశ, కరీంనగర్:

నా భర్త నన్నొదిలి వెల్లిపోయి చాలా కాలం అవుతోంది… గ్రామంలోని చెరువును అభివృద్ది చేయడంతో నాకున్న కొద్ది పాటి వ్యవసాయ భూమి ముంపునకు గురవుతోంది. నాకు గతంలో ఇచ్చిన ఉద్యోగం నా కొడుక్కు ఇవ్వండి అంటూ ఓ మహిళ కరీంనగర్ ప్రజావాణిలో ఆందోళనకు దిగింది. అధికారులు ఆమెకు సముదాయించే ప్రయత్నం చేసినా వినకుండా భీష్మించుకుని కూర్చుంది. మహిళా పోలీసులు రంగంలోకి దిగినా వారిని వారించే ప్రయత్నం చేసింది.

తాను బ్రతికుండగానే నా భార్య నన్ను చంపేసింది. తప్పుడు సమాచారంతో తన మరణ ధృవీకరణ పత్రం తీసుకుని తనకు చెందిన 10 ఎకరాల వ్యవసాయ భూమిని తన పేరిట మార్చుకుంది. ఆమెతో నాకు ప్రాణ భయం ఉంది నా ఆస్తి నాకు ఇప్పించి తనను రక్షించాలని వేడుకున్నాడా భర్త.

కరీంనగర్ కలెక్టరేట్ లో సోమవారం చోటు చేసుకున్న ఈ పరిణామం అటు అధికారులను, ఇటు వినతి పత్రాలు అందించేందుకు వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. భార్య చెప్పిన విషయాలు భర్త చేస్తున్న ఆరోపణలు విన్న అధికార యంత్రాంగానికి అసలేం జరిగిందోనన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. చివరకు అధికారులు శాఖ పరంగా విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఇద్దరిని పంపించేశారు.

సంఘటనా వివరాల్లోకి వెలితే… కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం పోచంపల్లికి చెందిన పిల్లి భారతి, ఆమె భర్త సోమవారం నాటి ప్రజావాణిలో అధికారులను గందరగోళంలో పడేశారు. తనకు న్యాయం చేయాలంటూ పిల్లి భారతి ప్రజావాణిలో ఆందోళనకు దిగారు. తనకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి గ్రామంలోని చెరువును విస్తరించడంతో ముంపునకు గురవుతోందని 22 ఏళ్ల క్రితం తన భర్త వదిలేసి వెళ్లిపోయాడని పేర్కొంది. తనకు అటెండర్ గా ఉద్యోగావకాశం కల్పించినప్పటికీ పిల్లలను చూసుకోవల్సి ఉన్నందును తాను ఉద్యోగం వదులుకున్నానని తన కొడుక్కి ఆ ఉద్యోగం ఇప్పించాలని భారతి కోరింది. అయితే తనకు కరీంనగర్ లో మూడు గుంటల స్థలం కెటాయించిన అప్పటి అధికారులు ఇంటి నిర్మాణం చేసి ఇస్తామని చెప్పి ఆచరణలో పెట్టలేదని తనకు ఇళ్లు కట్టివ్వాలని భారతి అభ్యర్థించింది. తనకు న్యాయం జరిగే వరకూ కూడా ఇక్కడి నుండి వెళ్లేది లేదని భారతి ప్రజావాణిలో కలెక్టర్ పోడియం ముందు బైఠాయించింది. కలెక్టర్ ఎండార్స్ మెంట్ చేసిన కాపీని సంబంధిత అధికారికి చూపించాలని ప్రజావాణిలో అధికారులు ఆమెకు నచ్చచెప్పినా వినకుండా నిరసన వ్యక్తం చేయడంతో మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా అక్కడి నుండి బయటకు తీసుకెళ్లారు.

భర్త ప్రత్యక్ష్యం…

ఓ వైపున భారతి ఆందోళన చేపట్టిన క్రమంలోనే ప్రజావాని కార్యక్రమం వద్దకు ఆమె భర్త రాజమౌళి అక్కడ ప్రత్యక్ష్యం అయ్యారు. తన భార్య భారతి బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్ తీసుకుందని భర్త రాజమౌళి ఆరోపించారు. ప్రభుత్వం నుండి ఫించను కూడా తీసుకుంటోందని ఈ విషయం తెలిసి తాను ఫిర్యాదు చేశానన్నారు. తనకు ఉన్న పది ఎకరాల వ్యవసాయ భూమిని భారతి తన పేరిట మార్చుకుని తనకు అన్యాయం చేసిందని, తన తల్లిదండ్రులపై కూడా దురుసుగా ప్రవర్తించిందని రాజమౌళి ఆరోపించారు. తన భూమిని తనకు ఇప్పించాలని భార్య ద్వారా తన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశాడు. మొక్క జొన్న కంకులు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నానని ఆయన వివరించారు. తాను చనిపోయినట్టుగా రెవెన్యూ అధికారులు తప్పుడు ధృవీకరణ పత్రం ఇచ్చిన విషయంపై కూడా విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణిలో చోటు చేసుకున్న ఈ పరిణామం సరికొత్త చర్చకు దారి తీసింది. తాను బ్రతికుండగానే మరణ దృవీకరణ పత్రం తీసుకుందని భార్యపై భర్త ఆరోపిస్తుండగా, తన భర్త 22 ఏళ్ల క్రితం తనను వదిలేసి వెల్లిపోయాడని భారతి వినతి పత్రంలో పేర్కొనడంతో అధికార యంత్రాంగం అోమయానికి గురయ్యారు. రాజమౌళి, భారతి కుటుంబంలో అసలేం జరిగింది అన్న విషయంపై అధికారులు సమగ్రంగా తెలుసుకోవల్సిన ఆవశ్యకత ఏర్పడింది. రాజమౌళి ఆరోపిస్తున్నట్టుగా నిజంగానే సర్టిఫికెట్ జారీ చేశారా అన్న విషయంపై స్పష్టత రావల్సిన అవసరం ఉంది. ఒక వేళ ఇదే నిజమైతే క్షేత్ర స్థాయిలో విచారణ చేపట్టకుండా తప్పుడు మరణ ధృవీకరణ పత్రం ఇచ్చిన అధికార యంత్రాంగంపై విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి.

karimnagar newsPRJAVANItelangana newstelugu newsTG NEWS