బ్యారేజీ దిగువన ఎందుకు..?
దిశ దశ, మహదేవపూర్:
కాళేశ్వరం బ్యారేజీలకు ఎగువ దిగువన పేరుకపోయిన ఇసుక నిలువలను తొలగించి పరిశోధన సంస్థల పరీక్షలకు అనువుగా ఉండే విధంగా చొరవ తీసుకోవలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇంజనీర్ ఇన్ చీఫ్ పర్యవేక్షించి మైనింగ్ నిబంధనల ప్రకారం ఇసుక నిలువ చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు అన్నారం బ్యారేజీ ఎగువ దిగువ భాగంలో ఇసుక సేకరించేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేయగా తెలంగాణ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (TGMDC) కాంట్రాక్టు అప్పగించింది. ఇంత వరకు బాగానే ఉన్నా అసలు పరిశోధనా సంస్థలు బ్యారేజీకి సామర్ధ్య పరీక్షలు ఎగువ భాగాన నిర్వహిస్తారా లేక దిగువ భాగాన నిర్వహిస్తారా అన్నదే అంతు చిక్కకుండా పోయింది. కాళేశ్వరం బ్యారేజ్ లలో లోపాలను గుర్తించేందుకు NDSA సిఫార్సు చేయడంతో CWPRS, Pune సంస్థ పరిశోధనల్లో నిమగ్నం అయింది. దాదాపు పది రకాల పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఇప్పటికే మేడిగడ్డ వద్ద కొన్ని పరీక్షలు చేస్తున్నారు CWPRS, Puneకు చెందిన నిపుణులు. ఇందులో బాగంగా అన్నారంలో కూడా పరీక్షలు చేయాల్సి ఉన్నందున ఇక్కడ భారీ స్థాయిలో ఉన్న ఇసుక మేటలను గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్టుగా ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. ఒక్క అన్నారంలోనే లక్షలాది క్యూబిక్ మీటర్ల మేర ఇసుక మేటలు వేసిందని నీటి పారుదల అధికారులు గుర్తించారు. NDSA అధికారులు బ్యారేజీలలో నీటిని నిలువ ఉంచకూడదని చెప్పిన తొలి సంవత్సరం నుండే ఇసుక మేటలు భారీగా పేరుకపోయాయని ఇరిగేషన్ అధికారులు నివేదికలు ఇస్తూనే ఉన్నారు. ఇందులో బాగంగా గతంలో కూడా అన్నారంలో ఇసుక తొలగించేందుకు అనుమతులు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ సారి మాత్రం CWPRS, Pune నిపుణుల సూచనల మేరకు ఇసుక తొలగిస్తున్నామని అధికారులు చెప్తున్నారు.
ఎంత వరకో..?
అన్నారం బ్యారేజ్ ఎగువ ప్రాంతంలోని వెంట్స్ లలో పేరుకపోయిన ఇసుక తొలగించేందుకు ఓ రీచ్, దిగువన కోసం మరో రీచ్ ఏర్పాటు చేశారు. అయితే దిగువన బ్యారేజ్ బెడ్ కూ దాదాపు 150 నుండి 200 మీటర్ల దూరం నుండి ఇసుకను తొలగిస్తున్నారు. బ్యారేజీ బెడ్స్ వద్ద లోపాలు ఉంటే నిపుణులు గుర్తించేందుకు అవకాశం ఉంటుంది కానీ నిర్మాణానికి ప్రాంతానికి వంద మీటర్లకు దిగువన ఇసుక తవ్వకాలు జరపడం వల్ల కలిగే లాభం ఏంటన్నదే అంతు చిక్కకుండా పోతోంది. గతంలో కూడా ఈ బ్యారేజీ వద్ద సీఫేజ్ కారణంగా లీకేజ్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గ్రౌటింగ్ చేసి కెమికల్ ద్వారా సీఫేజ్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారని ఇరిగేషన్ అధికారులు ప్రకటించారు. అయితే తాజాగా CWPRS, Pune నిపుణుల సూచనల మేరకు మళ్లీ పరిక్షలు చేయాల్సి ఉందని చెప్తున్నారు. అయితే సదరు సంస్థకు చెందిన నిపుణులు ఎంతమేర ఇసుక తొలగించాలన్న విషయంపై స్పష్టత లేకుండా పోయింది. అంతేకాకుండా ఎంత లోతు వరకు ఇసుకను తొలగించాల్సి ఉందోనన్న విషయంపై కూడా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మైనింగ్ రూల్స్…
ఇప్పటికే TGMDC నిర్వహిస్తున్న రీచుల్లో అమలవుతున్న నిబంధనలకు, అన్నారం రీచుల్లో నడుచుకుంటున్న తీరుకు ఏ మాత్రం సంబంధం లేకుండా పోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. స్టాక్ యార్డుకు ఇసుకను తలరించకుండా నేరుగా గోదావరి నదిలోనే లోడింగ్ ప్రక్రియ కొనసాగిస్తుండడం విస్మయం కల్గిస్తోంది. అన్నారం వైపు నుండి మంచిర్యాల జిల్లా వైపు వరకూ గోదావరి నదిలో రోడ్డు నిర్మాణం వేసి లారీలను నేరుగా నదిలోకే తీసుకెల్తున్న తీరు అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తోంది. మైనింగ్ రూల్స్ మేరకు నడుచుకోకుండా అన్నారం విషయంలో సపరేట్ విధానం ఎందుకు అమలు చేస్తున్నారన్నదే మిస్టరీగా మారింది. సమీపంలో భూములు లేకపోవడం వల్ల స్టాక్ యార్డ్ ఏర్పాటు చేసే అవకాశం లేకుండా పోయిందన్న ప్రచారం జరుగుతోంది. ఎన్విరాన్ మెంట్ నిబంధనలకు విరుద్దంగా భారీ వాహనాలను నేరుగా నదిలోకి అనుమతించడం సరైందేనా కాదా అన్న విషయంపై అధికారులు క్లారిటీ ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం అక్రమ మైనింగ్ జరగడం లేదని కౌంటర్ ఇస్తున్న అధికారులు పర్యావరణ విభాగం నుండి అనుమతులు ఉన్నాయా లేవా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. మిగతా ఇసుక రీచుల మాదిరిగానే అన్నారం అప్, డౌన్ స్ట్రీమ్ లలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నందున ఆయా రీచుల్లో అమలు చేస్తున్న నిబంధనలు ఇక్కడ అమలు చేయకుండా మినహాయింపులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటన్నదే పజిల్ గా మారింది.
మరో వాదన…
లక్షలాది క్యూసెక్కుల నీటిని తట్టకునే సామర్థ్యం ఉన్న బ్యారేజీకి ఎగువ దిగువ భాగాన నేరుగా ఇసుక లోడింగ్ చేసేందుకు లారీలను నడిపిస్తే తట్టుకునే శక్తి ఉండదా అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. అలాంటప్పుడు దిగువ భాగాన పేరుకపోయిన ఇసుక వరద నీటికి కొట్టుకపోయే అవకాశం కూడా ఉంటుందని, అక్కడి ఇసుకను తరలించేందుకు భారీ వాహనాలను అనుమతించడం ఎందుకన్న ప్రశ్న కూడా తలెత్తుతోంది. అంతేకాకుండా CWPRS, Pune నిపుణుల సూచనల మేరకు ఇరిగేషన్ అదికారులు సూచించిన ప్రాంతంలో ఇసుకను తొలగించేందుకు కూడా ప్రత్యేకంగా TGMDC హద్దులు నిర్దారించాల్సి ఉన్నప్పటికీ అలాంటి ఆనవాళ్లు మాత్రం గోదావరి నదిలో కనిపించడం లేదు.