అంచనాల్లో అన్ని పార్టీలు… అంతు చిక్కని ఓటరు నాడి…

కరీంనగర్ మేయర్ పీఠం ఏ పార్టీదో..?

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ మేయర్ పీఠం టార్గెట్ గా పావులు కదుపుతున్న ప్రధాన పార్టీల నేతలు ఎవరి అంచనాల్లో వారు మునిగి తేలుతున్నారు. అంతర్గత సర్వేలు చేస్తూ ఓటరు నాడి పట్టుకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఖచ్చితంగా గెలిచే స్థానాలపై ఆయా పార్టీల నేతలు బేరీజు వేసుకుంటూ ఒంటరిగానే కరీంనగర్ లో జెండా ఎగురవేయాలన్న సంకల్పంతో వ్యూహాలకు పదును పెడుతున్నారు. భారీగా కార్పొరేటర్ స్థానాలను గెలుస్తామని భావిస్తున్న ప్రధాన పార్టీలకు ఇప్పటి వరకు అందుతున్న సర్వే రిపోర్టులు మాత్రం అంచనాలను తలకిందులు అయ్యేలా ఉన్నాయన్న సంకేతాలు ఇస్తున్నట్టుగా సమాచారం.

సర్వేలు ఇలా…

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎప్పటికప్పుడు ఓటర్ల సానుకూలత ఎలా ఉందో అంచనా వేస్తు ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికకు ముందు జరిగిన సర్వేలు, నామినేషన్ల తరువాత జరిపిస్తున్న సర్వే రిపోర్టులను ఆధారం చేసుకుని ఎప్పటికప్పుడు సమీకరణాలు చేస్తున్నాయి. బీజేపీకి 37 స్థానాలు వస్తాయని సర్వే రిపోర్టులు చెప్తుండగా, బీఆర్ఎస్ 25 నుండి 30 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశం ఉందన్న అంచనాల్లో ఉన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా విజయ ఢంకా మోగించనుందని సర్వేల ఆధారంగా అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే మూడు పార్టీలు కూడా పోలింగ్ సమీపిస్తున్నా కొద్ది ఓటరు నాడి పట్టుకునేందుకు తలమునకలవుతున్నాయి. 0కరీంనగర్ లో ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుందని అంచనా వేసినప్పటికీ చాలా చోట్ల ద్విముఖ పోరే ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా ఉందని సర్వే సంస్థలు నివేదిక సారాంశం.

పొత్తులే కీలకమా..?

అయితే కరీంనగర్ ఓటరు నాడిని బట్టి మాత్రం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు పొత్తులు తప్పేలా లేవని కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. ఎన్నికలకు ముందు వైరుద్యంగా వ్యవహరిస్తున్న ఆయా రాజకీయ పార్టీలు కరీంనగర్ లో జెండా ఎగురవేయాలంటే ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోక తప్పని పరిస్థితులే మెండుగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయా పార్టీలు వేసిన తప్పడగుల ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నట్టుగా తేలుస్తున్నాయి. కొన్ని పార్టీల మధ్య అంతర్గత ఒప్పందాలు జరిగాయన్న ప్రచారం కూడా తీవ్రంగా జరుగుతుండడం కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని సమాచారం. కొన్ని డివిజన్లలో ఆల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్, జనసేన అభ్యర్థులు, స్వతంత్రులు పోటీ చేస్తుండడం వల్ల అభ్యర్థుల తలరాతలు మారే ప్రమాదం ఉంటుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలిస్తే ఎంఐఎం, ఇండిపెండెంట్ అభ్యర్థుల సహకారం తీసుకోకతప్పదన్న అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ మెజార్టీ స్థానాలు గెలిస్తే ఇతర పార్టీలు, స్వతంత్రుల సహాకారం తీసుకోవల్సి ఉంటుందని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచినా మరో పార్టీ సహాకారం లేకుండా కరీంనగర్ పీఠాన్ని అందుకునే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో ఆయా పార్టీల నాయకులు మ్యాజిక్ ఫిగర్ దాటించేందుకు అవసరమైన కార్యాచరణతోనే ముందుకు సాగాల్సి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. 34 స్థానాలకు పైగా సాధించుకునేందుకు ఆయా డివిజన్లలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అవసరమైన వ్యూహ రచనతో ముందుకు సాగాల్సిన ఆవశ్యకత అన్ని పార్టీలపై ఉందని మాత్రం స్పష్టం అవుతోంది.

2026 elections2026 Municipal Electionskarimnagarmuncipal electionstelangana news
Comments (0)
Add Comment