దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల ముందు రిటైర్డ్ పోలీసు అధికారి ప్రభాకర్ రావు వాంగ్మూలం ఇస్తున్న తీరు సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ఓ రోజు మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారన్న కారణంతో ఆయా రాజకీయ పార్టీల నాయకుల ఫోన్లు ట్యాప్ చేశామని చెప్పగా, మరో రోజు డీజీపీ ఆదేశిస్తేనే ట్యాపింగ్ చేశామని వివరించినట్టుగా తెలుస్తోంది. దర్యాప్తు అధికారులను గందరగోళంలో పడేసేందుకే ప్రభాకర్ రావు ఇలా వ్యవహరిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రభాకర్ రావు ఇప్పటి వరకు చెప్పిన అంశాలను పరిగణనలోకి తీసుకుని సిట్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేసే అవకాశాలయితే కనిపిస్తున్నాయి.
ఆ డీజీపీకి ఎలా తెలిసింది..?
రాష్ట్ర పోలీస్ బాస్ గా వ్యవహరించే డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) శాంతి భద్రతలు, నేరాల నియంత్రణ, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలకు అనుగుణంగా పోలీసింగ్ నిర్వహించడం, అనుబంధ విభాగాలు నిఘా వర్గాలు ఇలా ఎన్నో అంశాలను పర్యవేక్షించాల్సి ఉంటుంది. సంబంధిత విభాగాల చీఫ్ ఆఫీసర్లు డీజీపీ దృష్టికి తీసుకెళ్లి ఆయన ఆదేశాల మేరకు నడుచుకునే ఆనవాయితీ ఉంటుంది. ముఖ్యమైన అంశాల్లో మాత్రమే డీజీపీ జోక్యం ఉంటుంది కానీ శాఖాపరమైన అంశాల్లో చాలా వరకు కూడా చీఫ్ ఆఫీసర్ల పర్యవేక్షణలోనే సాగుతుంటాయి. ఇందుకు సంబంధించిన సమాచారం డీజీపీకి ఇవ్వడమే, లేక ముందుగానే అనుమతి తీసుకునేందుకు ఫైల్ మూవ్ చేయడమో చేస్తుంటారు. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో అప్పటి డీజీపీ చెప్పడం వల్లే చేశానని ప్రభాకర్ రావు చెప్పడం వెనక మతలబు ఏమై ఉంటుందన్న చర్చ పోలీసు వర్గాల్లో నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో SIB అధికారులు ఇచ్చిన జాబితాకు డీజీపీ ఓకే చెప్పారా లేక డీజీపీనే లిస్ట్ ఇచ్చి ట్యాపింగ్ చేయమన్నారా అన్నది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. అప్పటి డీజీపీ వాంగ్మూలం తీసుకున్నట్టయితే మరిన్ని వాస్తవాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. శాఖాపరంగా వచ్చే ఫైళ్లకు సంబంధించిన నోట్ ఫైళ్లపై ఆమోద ముద్ర వేయాల్సిన డీజీపీ ఫోన్ నంబర్లు ఇచ్చి ట్యాప్ చేయమనేంత పరిస్థితి ఉంటుందా అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ప్రభాకర్ రావు చెప్పినట్టుగా డీజీపీ ఇలాంటి ఆదేశాలు ఇచ్చినట్టయితే మాత్రం ఆయనను కూడా ఈ కేసులో ఇరికించాల్సిన ఆవశ్యకత సిట్ ముందు ఉంటుందని తెలుస్తోంది.
నిఘా వర్గాలు…
సాధారణంగా నిఘా వర్గాలు ఇచ్చే నివేదికలు నేరుగా ప్రభుత్వ పెద్దల వద్దకు చేరుతుంటాయి. హోం మంత్రి, ముఖ్యమంత్రి స్థాయిలోనే రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన నివేదికలు ఇంటలీజెన్స్ చీఫ్ ఆఫీసర్లు చేరవేస్తుంటారు. ఇందుకు సంబంధించి డీజీపీలతో కూడా చర్చించే అవకాశం ఉన్నప్పటికీ పొలిటికల్ వ్యవహారాలు కాబట్టి ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వంలోని కీలకమైన హోం మంత్రి, ముఖ్యమంత్రులకు మాత్రమే చేరవేస్తుంటారన్నది నగ్నసత్యం. అయితే SIB వ్యవహారాలు మాత్రం కేవలం అధికారుల కనుసన్నల్లోనే సాగుతుంటాయన్నది కూడా నిజం. అసాంఘీక శక్తులు, మావోయిస్టు కార్యకలాపాలు, ఉగ్ర వాదుల కార్యకలాపాల కట్టడి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన SIB పోలీసు ఉన్నతాధికారులతో మాత్రమే చర్చించడం గతకొంతకాలంగా సాగుతోంది. సంఘ విద్రోహ శక్తులను కట్టడి చేసేందుకు ఎప్పటికప్పుడు బలగాలను మోహరించాల్సిన అవసరం ఉండడం వంటి చర్యలు ఉంటాయి కాబట్టి SIB విభాగం అధికారులు పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత కమిషనర్లు, ఎస్పీలతో మానిటరింగ్ చేస్తూ ముందుకు సాగుతుటారు. కానీ తొలిసారి SIB పై ఆరోపణలు వెల్లువెత్తడమే సంచలంగా మారింది. అసాంఘీక శక్తుల ముసుగు వేసి రాష్ట్రంలోని 600 మందికి పైగా రాజకీయ నాయకుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం అనేది ఓ సంచలనమనే చెప్పాలి. కేవలం ఉన్నతాధికారుల కనుసన్నల్లో, సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదుల కార్యకలాపాలు కట్టడి చేయాలన్న ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన SIB దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది. కానీ ప్రభాకర్ రావు చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తరువాత రాజకీయ వ్యవహారాల పర్యవేక్షణ కేంద్రంగా మారడంతో ఈ విభాగం ఒక్కసారిగా అబాసుపాలైంది.
అదే నిజమైతే..?
అత్యంత కీలకమైన SIB వింగ్ ను రిటైర్డ్ అధికారికి అప్పగించేందుకు అప్పటి డీజీపీ సాహసం చేస్తారా..? దేశ, రాష్ట్ర రక్షణ అంశాలతో ముడిపడి ఉన్న ఈ విభాగం అత్యంత రహస్యమైన ఆపరేషన్లు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి కీలకమైన విభాగానికి చీఫ్ ఆఫీసర్ గా రిటైర్డ్ ఐజీగా పని చేసిన ప్రభాకర్ రావును నియమించేందుకు డీజీపీ సొంతగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా..? కాన్ఫిడెన్షియల్ వింగ్ చీఫ్ ఆఫీసర్ గా నియమించే విషయంలో డీజీపీ రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ రావును మాత్రమే ఏరికోరి నియమించుకునేంత ఆసక్తి ఎందుకు ఉంటుందోనన్నదే మిస్టరీగా మారింది. ఒకవేళ అదే నిజమైతే ప్రభాకర్ రావుపై పీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావుతో పాటు పలు పార్టీల నాయకులు పదే పదే ఆరోపణలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఫోన్ ట్యాపింగ్ పై పెద్ద ఎత్తున దుమారం లేవడమే కాకుండా రేవంత్ రెడ్డి అయితే ప్రభాకర్ రావుపైనే డైరెక్ట్ అటాక్ చేశారు. అలాంటి పరిస్థితుల్లో రిటైర్డ్ ఐజీ అయిన ప్రభాకర్ రావును విధుల నుండి తప్పించే అధికారం డీజీపీకి ఉన్నప్పటికీ ఆయనపై చర్యలు తీసుకునేందుకు సాహసించకపోవడానికి కారణమేంటన్నది కూడా పరిగణనలోకి తీసుకోవల్సిన అవసరం ఉంది. రాష్ట్ర పోలీస్ వ్యవస్థకే అత్యున్నతమైన అధికారి హోదాలో ఉన్న డీజీపీ ప్రభాకర్ రావుపై చర్యలు తీసుకోకపోవడం వెనక ఉన్న కారణాలు ఏంటీ..? కనీసం విచారణయినా ఆదేశించారా అన్న కోణంలో కూడా ఆరా తీసినట్టయితే అసలు నిజం బయటకు వస్తుందన్న అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తీవ్రమైన ఆరోఫణలు ఎదుర్కొన్న పోలీసు అధికారులను విధుల నుండి తప్పించడం, వెకెన్సీ రిజర్వూకు పంపించడం, ఆధారాలతో కూడిన ఫిర్యాదులు అందితే క్రమ శిక్షణా చర్యలు తీసుకోవడం పోలీసు విభాగంలో సహజంగా అమలు చేస్తుంటారు. అయితే SIB చీఫ్ గా వ్యవహరిస్తున్న ప్రభాకర్ రావుపై ఆరోఫణలు వచ్చినప్పుడు పోలీసు ఉన్నతాధికారులు ఆయనను ఆ బాధ్యతల నుండి తప్పించేందుకు మీనామేషాలు లెక్కించారే తప్ప అటువైపు కన్నెత్తి కూడా చూడలేదన్నది బహిరంగ రహస్యం. ఇంటలీజెన్స్ చీఫ్ గా కూడా పనిచేసిన ప్రభాకర్ రావును తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి అసలు కారణమేంటీ..? మావోయిస్టుల ఏరివేతతో పాటు అసాంఘీక శక్తులను కట్టడి చేసిన చాలా మంది పోలీసు అధికారులు పదవి విరమణ పొందిన తరువాత తిరిగి ఈ విభాగంలో పనిచేసిన దాఖలాలు అంతంతమాత్రమే. ఒకవేళ వారిని నియమించుకున్నా సలహదారులుగానో, అనుబంధ విభాగాల సేవలకు వినియోగించుకున్నారే తప్ప అత్యంత కీలకమైన విభాగాలకు మాత్రం ఇంచార్జిగాలు అప్పగించిన దాఖలాలు అయితే లేవనే చెప్పాలి. ఇంటలీజెన్స్ చీఫ్ గా బాధ్యతలు రిటైర్డ్ అధికారులకు బాధ్యతలు అప్పగించినట్టయితే రాష్ట్ర రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన అంశాలను నమ్మకండా ప్రభుత్వ పెద్దల ముందు ఉంచే అవకాశం ఉంటుంది. కానీ అసాంఘీఖ శక్తులను కట్టడి చేసేందుకు ఏర్పాటు చేసిన SIB చీఫ్ గా ప్రభాకర్ రావును నియమించడం అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.